రోడ్డునపడ్డ చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు
22 నెలలుగా జీతాలు ఇవ్వని యాజమాన్యం
ఆటోలు తోలుతూ కొందరు, కూలి పనులకు మరికొందరు
కనికరించని ప్రభుత్వం
చక్కెర కర్మాగారంలో పనిచేస్తున్నా.. వారి బతుకుల్లో మాత్రం నిత్యం చేదు అనుభవాలే. జానెడు పొట్ట నింపుకోవడం కోసం వారు నానా అవస్థలు పడుతున్నారు. తమను నమ్ముకున్న వారికి పట్టెడన్నం పెట్టడానికి కొందరు ఆటోలు నడుపుతుండగా.. మరికొందరు వ్యవసాయ కూలీలుగా, చిల్లర దుకాణాల్లో గుమస్తాలుగా మారి దుర్భరజీవనం అనుభవిస్తున్నారు. ఈ వేదనంతా 22 నెలలుగా జీతాలకు నోచుకోని చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికులది.
చిత్తూరు: దాదాపు రెండేళ్లుగా జీతాల్లేక చిత్తూరు సహకార చక్కెర కర్మాగారం కార్మికులు రోడ్డున పడ్డారు. కుటుంబ పోషణ కోసం నరకయాతన పడుతున్నారు. చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీలో 322 మంది కన్షాలిడేటెడ్ కార్మికులు, 65 మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు. కన్షాలిడేటెడ్ ఉద్యోగుల్లో రూ. 10 వేల నుంచి 20 వేలు పైచిలుకు జీతాలు వచ్చేవారు ఉన్నారు. వీరందరికీ ఫ్యాక్టరీ 22 నెలలుగా రూ. 13 కోట్ల పైచిలుకు జీతాలు చెల్లించాల్లి ఉంది. చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టాక కార్మికుల జీతం బకాయిలు ఇవ్వకపోగా ఫ్యాక్టరీలో క్రషింగ్‌ను నిలిపి వేశారు. దీంతో కార్మిక కుటుంబాలు అతలా కుతలమయ్యాయి. చాలామంది అప్పులు చేసి, ఉన్న కాస్తో కూస్తో బంగారు నగలు తాకట్టు పెట్టి పూటగడుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు అప్పులిచ్చేవారూ కరువయ్యారు. పిల్లల చదువులు భారంగా మారాయి. వందలాదిమంది కార్మికులు పొట్టకూటి కోసం ఆటోలు నడుపుతున్నారు. కొందరు బెల్లం మండీల్లో, మరికొందరు చిల్లర దుకాణాల్లో గుమస్తాగిరి చేస్తున్నారు. ఇంకొందరు ఎలక్ట్రికల్ పనులకు, పెయింటింగ్ పనులకు వె ళుతున్నారు. మరికొందరు ఏ పని దొరికినా చేస్తామంటూ దొరికిన పనికల్లా వెళ్తున్నారు.
ఇన్నాళ్లు ఉద్యోగాలు ఉండడంతో పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంటుకొని ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించారు. ఇప్పుడు జీతాల్లేక కుటుంబ పోషణ భారంగా మరిన పరిస్థితిలో పిల్లలను ప్రైవేటు పాఠశాలలు మాన్పించి ప్రభుత్వ పాఠశాల్లలో చేర్పించారు. జీతాలు ఎప్పుడిస్తారో తెలియక కార్మికులు రోజూ ఫ్యాక్టరీ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. చైర్మన్, ఎండీలు ఉన్నా కార్మికుల సంగతి పట్టించుకోవడం లేదు. ప్రభుత్వంతో మాట్లాడుతున్నామంటూ మాటలతో సరిపెడుతున్నారు. ఒక్కో కార్మికుడికి లక్షల్లో జీతం బకాయి ఇవ్వాల్సి ఉంది. అటు ఫ్యాక్టరీ మూసివేసి ఇటు జీతం బకాయి ఇవ్వక చంద్రబాబు ప్రభుత్వం మా జీవితాలతోపాటు మాపిల్లల భవిష్యత్తును అంధకారం చేసిందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
బతుకంతా చేదే
Published Mon, Oct 26 2015 2:11 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 AM
Advertisement
Advertisement