=క్వింటా రూ.2700లకు పడిపోయిన ధర
=రూ. 25 కోట్లు కోల్పోతున్న నాలుగు సుగర్స్
=నష్టాల దిశగా జిల్లాలోని కర్మాగారాలు
=రైతుకు గిట్టుబాటు ధరపైనా తీవ్ర ప్రభావం
చోడవరం, న్యూస్‌లైన్: పడిపోయిన చక్కెర ధరలతో సుగర్ ఫ్యాక్టరీలన్నీ దివాలా తీసే పరిస్థితి దాపురించింది. దేశీయ మార్కెట్‌లోకి విదేశీ పంచదార భారీగా దిగుమతి కావడంతో ఇక్కడ పంచదారకు డిమాండ్ పడిపోయింది. దీంతో కర్మాగారాల్లో లక్షలాది టన్నుల పంచదార నిల్వలు పేరుకుపోయాయి. ధర పెరుగుతుం దన్న ఆశతో జిల్లాలోని చోడవరం, ఏటికొప్పా క, తాండవ, అనకాపల్లి సహకార చక్కెర ఫ్యాక్టరీల్లో సుమారు 5 లక్షల క్వింటాళ్ల నిల్వలు గోడౌన్లలో ఉన్నాయి. ఒక్క గోవాడలోనే రెండున్నర లక్షల క్వింటాళ్లు ఉన్నాయి.
లెవీ ఎత్తేశారని ఆనందంగా ఉన్న కొద్ది రోజుల కే ఒకేసారి క్వింటాకు రూ.500ల వరకు పంచదార ధర తగ్గిపోవడంతో జిల్లాలోని నాలుగు ఫ్యాక్టరీలు సుమారు రూ.25 కోట్లు కోల్పోనున్నాయి. వాటి మనుగడపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది జూన్ వరకు క్వింటా రూ.3200లు అమ్మగా ఆ తర్వాత క్రమంగా రూ.2950 నుంచి ప్రస్తుతం 2700కు పడిపోయింది. దీని ప్రభావం ఒక్క ఫ్యాక్టరీలపైనే కాదు. రైతులకిచ్చే మద్దతు ధరపైన కూడా పడనుంది. 2012-13 సీజన్ చెల్లింపులకు ఫ్యాక్టరీలు రూ. కోట్లు అప్పులు చేశాయి.
ధర పతనమై ఉన్న నిల్వలు అమ్ముడుకాకపోవడంతో ఆయా యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. అత్యధికంగా రూ.2300 వరకు మద్దతు ధర ఇచ్చిన చోడవరం వంటి ఫ్యాక్టరీ అయితే మరీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పంచదార వ్యాపారులు సిండికేట్ అయిపోయి దేశవ్యాప్తంగా ధరను తగ్గించడంతో పాటు దుంప, క్యారెట్ నుంచి తయారయ్యే నాసిరకం పంచదారను తక్కువ ధరకే దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో ఎక్కడ చూసినా ఈ పంచదారే లభ్యమవుతోంది.
విదేశీ చక్కెర దిగుమతిని నిలువరించకుండా టన్నుకు రూ.2125 కనీస మద్దతు ధరను ప్రకటించిన కేంద్రంపై దేశవ్యాప్తంగా ఇప్పటికే చక్కెర మిల్లర్లు ఎదురుతిరిగిన విషయం తెలిసిందే. చక్కెర నుంచి క్వింటా పంచదార తయారీకి సుమారు రూ.2900వరకు మిల్లర్లకే ఖర్చవుతోంది. అదీ రైతుకు టన్నుకు రూ.2100మద్దతు ధర ఇస్తే. ఇక పెరిగిన వ్యవసాయ పెట్టుబడుల రీత్యా ఈ మద్దతు ధర ఏ విధంగానూ రైతుకు గిట్టుబాటు కాదు. వచ్చే సీజన్‌లో కనీసం టన్నుకు రూ.2500 మించి ధర చెల్లించాల్సి ఉంది. అలాంటప్పుడు ఘోరంగా పడిపోయిన పంచదార ధరలతో ఎలా ఫ్యాక్టరీలను నడపాలని యాజమాన్యాలు, పాలకవర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. ఒక పక్క నిల్వలు పేరుకుపోగా మరో పక్క 2013-14సీజన్ క్రషింగ్‌ను గోవాడ, తాండవ ఫ్యాక్టరీలు గురువారం ప్రారంభించాయి.
అప్పులతో అపసోపాలు పడుతూ నామమాత్రంగా నడుస్తున్న తుమ్మపాల, తాండవ సహకార చక్కెర కర్మాగారాలపై తగ్గిన ధరల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇవి మరింత నష్టాల్లో కూరుకుపోవడం తథ్యం. వీటిని మూసేసే పరిస్థితి. ధర ఇలాగే ఉంటే లాభనష్టాలు లేకుండా నడుస్తున్న ఏటికొప్పాక, చోడవరం ఫ్యాక్టరీలదీ దయనీయ దుస్థితి. దీనిపై వెంటనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని రైతులు, ఫ్యాక్టరీల యాజమాన్యాలు కోరుతున్నాయి.
చక్కెర చిక్కులు
Published Fri, Nov 29 2013 1:18 AM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM
Advertisement
Advertisement