
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
ఆ తల్లికి ...ఏ కష్టం వచ్చిందో.. ఏమో.. ఆరునెలల బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి, మరో బిడ్డకు కడుపు నిండా అన్నం పెట్టి గదిలో నిద్రబుచ్చి, పక్క గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నెలలు నిండిన ఆమె పుట్టింటికి వెళ్లి పండంటి ఆడపిల్లను ప్రసవించి, ఐదోనెలలో అత్త వారింటికి వచ్చింది. ఈనెల 28న నామకరణం చేద్దామని భావించగా, ఈలోగా ఆత్మహత్య చేసు కోవడం స్థానికులను కలవరపాటుకు గురి చేసింది.ఈ సంఘటన పామర్రులో బుధవారం చోటు చేసుకుంది.
పామర్రు : స్థానిక రావి హరిగోపాల్ నగర్‌లోని కావేటి దుర్గా ప్రసాద్‌కు కంచికచర్ల గ్రామానికి చెందిన దుర్గ (23)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మహాలక్ష్మి(2) చిన్న కుమార్తెకు 6నెలల వయస్సు. ఇంకా పేరుపెట్టలేదు. ఈనెల 28న పేరు పెడదామనుకుంటున్నారు. ప్రసవానికి పుట్టింటికి వెళ్లగా పెద్ద ఆపరేషన్ చేయించారు. అనంతరం దుర్గ పిల్లలను తీసుకొని నెల రోజుల క్రితం భర్త వద్దకు వచ్చింది. ఈనేపథ్యంలో బుధవారం దుర్గ ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దుర్గ భర్త ఉయ్యూరులోని ఓ ప్రైవేటు కాన్వెంటు వ్యానుకు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
ఉదయమే తన విధులకు వెళ్లి పోయాడు. దుర్గ అత్త మావిళ్లమ్మ ఉదయమే గిల్టు నగల వ్యాపారం నిమిత్తం ఇంటి నుంచి వెళ్లి పోయింది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో దుర్గ గదిలోని ఫ్యానుపైన ఉన్న దూలానికి చీరను కట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అదే సమయంలో తన కూతురుని చూసేందుకు కంచికచర్ల నుంచి తల్లిదండ్రులైన బత్తిన శ్రీను,రాజులమ్మ ఉదయం 11 గంటల సమయంలో తమ కుమార్తె ఇంటికి చేరుకున్నారు. తలుపులు మూసి ఉండడంతో కొద్ది సేపు తలుపులు తట్టారు.
ఎవ్వరూ పలుకకపోవడంతో ఇరుగుపొరుగు వారిని పిలిచి ఇంట్లో వారు ఎక్కడి వెళ్లారు అని అడుగుతుండంగా ఇంట్లో నించి మృతురాని పెద్ద కుమార్తె ఏడుపులు వినపడడంతో అనుమానం వచ్చి స్థాని కులు కిటికి తలుపులు తీసి చూశారు. లోపలి గదిలో ఉన్న ఫ్యాను దూలానికి ఉరి వేసుకుని దుర్గ వేలాడుతూ కనబడింది. దీంతో దుర్గ తండ్రి శ్రీను తలుపులు బద్దలు కొట్టి చూసే సరికి దుర్గ అప్పటికే మృతి చెందింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు.అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ ఎన్‌వీ కోటేశ్వరరావు తెలిపారు.
అత్తింటి వారే హతమార్చారు
తనకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారని పెద్ద కుమార్తె దుర్గని అల్లారుముద్దుగా పెంచుకున్నామని ఎంతో బాధ్యతగా ఉండే తమ కుమార్తె మృతికి అత్తింటి వారే కారణమని తల్లి రాజులమ్మ బోరుమని విలపించింది. తన అల్లుడు దుర్గా ప్రసాద్ తన కుమార్తెను ఫోన్‌లో కూడా మాట్లాడనిచ్చే వాడు కాద న్నారు. చీటికి మాటికీ తిడుతూ కొడుతుండేవాడని పోలీసులకు తెలిపింది. బాలింత అని చూడకుండా భర్త కొట్టడం వల్లే మనస్తాపానికి గురై ఉరి వేసుకున్నదని ఆమె ఆరోపించారు.
-తల్లి రాజులమ్మ
తల్లిని కోల్పోయిన చిన్నారులు
తల్లి చనిపోయిన విషయం తెలియక రెండేళ్ల కుమార్తె అటు ఇటు తిరగడం స్థానికులను కలచివేసింది. ఆరు నెలల పాప పాల కోసం ఏడుస్తూంటే..అమ్మమ్మ ఏడుస్తూ డబ్బా పాలు పట్టించడం చూపరులను కంటతడిపెట్టించింది.