రోదిస్తున్న వెంకయ్య కుమారుడు సాయి గోపీనాథ్
గుంటూరు ఈస్ట్: ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్‌లో సోమవారం రాత్రి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న బుంగా వెంకయ్య (47), భార్య రజిని (40), కుమార్తె సాయికృష్ణవేణి (22) మృతదేహాలను నెహ్రూనగర్‌కు మంగళవారం తీసుకొచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుకుమున్నాయి. అనంతరం కన్నీటి వీడ్కోలుతో అంత్యక్రియలు నిర్వహించారు. వెంకయ్య కుమారుడు సాయిగోపీనాథ్ తల్లిదండ్రులు, సోదరి మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యాడు. అతనిని ఓదార్చడం ఎవరికి అలివికాలేదు. వెంకయ్య, భార్య రజిని అందరితో స్నేహంగా మెలిగేవారని, అటువంటివారు ఈవిధంగా చేసుకుని ఉండకూడదంటూ అక్కడికి వచ్చిన వారంతా కంటతడి పెట్టారు.
లేళ్ల అప్పిరెడ్డి, రోశయ్యల పరామర్శ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి నెహ్రూనగర్‌లోని వెంకయ్య గృహం వద్దకు వెళ్లి భౌతికకాయాలను సందర్శించారు. సాయిగోపీనాథ్‌ను పరామర్శించి ఓదార్చారు. సాయిగోపినాథ్‌కు తాను అండగా ఉంటానని అప్పిరెడ్డి ధైర్యం చెప్పారు. విషయం తెలియగానే లేళ్ల అప్పిరెడ్డి మధిర వెళ్లి అక్కడ మృతదేహాలను తరలించేందుకు అవసరమైన చర్యలు దగ్గరుండి చూశారు. పోస్టుమార్టం అనంతరం గుంటూరు తరలించేందుకు వేగంగా చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment