ఆత్మహత్య కాదు హత్యే!
► వేముల నాగమణి మృతికి ప్రియుడే కారణం
► కొట్టి చంపి, చీరతో ఉరి వేశాడని పోలీసుల వెల్లడి
► సమాధి నుంచి వెలికి తీసి మృతదేహానికి పోస్టుమార్టం
పిడుగురాళ్ల : ఓ మహిళను ప్రియుడే హత్య చేసి సాధారణ ఆత్మహత్యగా చిత్రీకరించి తప్పించుకునే ప్రయత్నం చేసిన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని లెనిన్‌నగర్‌కు చెందిన వేముల నాగమణి (23) ఈ నెల 11వ తేదీ చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు నమ్మి ఖననం చేశారు. అయితే మృతురాలి స్నేహితురాలు ఇచ్చిన సమాచారంతో తీగలాగగా డొంక కదిలింది. చండ్రపాలేనికి చెందిన శంకర్ అనే వ్యక్తితో నాగమణికి సంబంధం ఉందని తెలపడంతో అతనిపై అనుమానాలు రేకెత్తాయి. దీంతో మృతురాలి అక్క వేముల పుష్పలత పట్టణ పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.
అనుమానితుడైన శంకర్‌ను పోలీసులు విచారణ చేయగా అసలు విషయాన్ని బయటకు కక్కాడు. దీంతో నాగమణి మృతదేహాన్ని గురువారం వెలికితీసి గురజాల వైద్యుడు సతీష్ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఎస్.లక్ష్మయ్య, సీఐ శ్రీధర్‌రెడ్డి సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. చీటీపాటలు నిర్వహించే వేముల నాగమణి రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటికి చేరుకుంది. అదే సమయంలో ఆమె ప్రియుడు శంకర్ ఇంటికి వ చ్చాడు. అయితే తను చెప్పినట్లుగా నాగమణి వినడంలేదన్న అక్కసుతో నాగమణి మెడ వెనుక వైపు బలంగా కొట్టడంతో మంచంపై పడిపోయింది. ముఖంపై నీళ్లు చల్లినా స్పృహ లేకుండా ఉండటంతో వెంటనే గూట్లో ఉన్న చీరతో మెడకు చుట్టి ఇంటి దూలానికి కట్టి తలుపు దగ్గరకు వేసి అక్కడి నుంచి శంకర్ ఉడాయించాడు.
ఇరుగు పొరుగువారు నాగమణి ఇంట్లో నుంచి చపాతీలు కాలుతున్న వాసన వస్తుండటంతో వెళ్లి చూశారు. నాగమణి చనిపోయిన దృశ్యం కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు కూడా నాగమణి ఆత్మహత్య చేసుకుందని భావించారు. మృతురాలి స్నేహితురాలు తెలిపిన వివరాలతో అసలు విషయం బయటకు వచ్చింది. సీఐ వై.శ్రీధర్‌రెడ్డి కేసును విచారణ చేస్తున్నారు. నిందితుడు శంకర్‌ను అరెస్టు చేశారు.