వెనక్కు తగ్గిన మంత్రి?
♦ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సాక్షి కథనాలపై వివరణ ఇచ్చుకున్న సుజయ్‌కృష్ణ రంగారావు
♦ పార్టీ తలదించుకునే పరిస్థితి రానీయనంటూ వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: బొబ్బిలి రాజవంశీయుడు, రాష్ట్ర గనుల శాఖా మంత్రి ఆర్వీ సుజయ కృష్ణ రంగారావు గిరిజనులకిచ్చిన భూములను లాక్కునే యత్నాలపై ఆలోచనలో పడ్డారు. బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని నిరుపేద గిరిజనులకు పూర్వీకులు పంపిణీ చేసిన భూములను మంత్రి సుజయ్ వెనక్కు లాక్కోవడానికి చేస్తున్న కుట్రలను ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వరుస కథనాల ఆధారంగా విపక్షాలు సైతం మంత్రి చర్యలపై మండిపడ్డాయి. స్వపక్షంలోనూ మంత్రికి మద్దతుగా నిలిచేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు.
పై పెచ్చు కొత్తగా పార్టీలోకి వచ్చి మంత్రి పదవి సైతం దక్కించుకున్న సుజయ కృష్ణ రంగారావు టీడీపీకి జిల్లాలో చెడ్డపేరు తీసుకువస్తున్నారనే విషయాన్ని ఆ పార్టీ జిల్లా నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. భూముల దందాపై ఇంటా బయటా అభాసుపాలయిన మంత్రి ఆలోచనలో పడ్డారు. దీనిపై తెలుగు దేశం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం సాక్షిగా ఆయన చేసిన వ్యాఖ్యలు జిల్లాలో మరోసారి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
తను తప్పు చేయనని, పార్టీకి తలవంపులు తెచ్చే పని చేయనంటూ ‘సాక్షి’ కథనాలపై ఆయనిచ్చిన వివరణ గిరిజన రైతుల భూముల జోలికి వెళ్లనని పరోక్షంగా ప్రకటించినట్టయింది. కుటుంబ సభ్యుల్లాంటి నాయకులు, కార్యకర్తలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం తనకు ఉందంటూ, బొబ్బలిలో గిరిజనుల భూములు లాక్కుంటున్నానని ‘సాక్షి’ వారం రోజుల పాటు వార్తలు రాశారన్నారు. నాకు మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ముచేయనని చెప్పుకున్నారు. నా వల్ల పార్టీకి, ప్రభుత్వానికీ తలదించుకునే పరిస్థితి రాదన్నారు.
సాక్షి కథనాలు ప్రస్తావిస్తూ నీళ్లు తాగిన మంత్రి!
మంత్రి రంగారావు వైఖరిని ఎండగడుతూ ‘సాక్షి’ ప్రచురించిన కథనాలపై వారం రోజులుగా నోరు మెదపని ఆయన ఆదివారం ఆ కథనాలపై వివరణ ఇచ్చేందుకు సైతం తడబడ్డారు. సాక్షి పేరును, కథనాలను ప్రస్తావిస్తున్నప్పుడు ఆయన గద్గద స్వరంతో మాట్లాడుతుండటాన్ని గమనించిన పార్టీ నాయకులు వెంటనే మంచినీళ్ల బాటిల్‌ను అందించారు. నీళ్లు తాగిన అనంతరం మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు. మొత్తానికి ‘సాక్షి’ కథనంపై తెలుగు దేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సుజయ్ ప్రస్తావించడాన్ని కేంద్రమంత్రి, ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ‘సాక్షి’ పుణ్యాన మంత్రి వివరణ ఇచ్చారని, గిరిజనులకు న్యాయం జరుగుతుందన్న చర్చ టీడీపీ క్యాడర్‌తో పాటు జిల్లా ప్రజల్లో జోరందుకుంది.