
ఎండ వేడిమి తట్టుకోలేక ముఖానికి చున్నీ రక్షణగా...
పశ్చిమగోదావరి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో భానుడి విశ్వరూపం చూపిస్తున్నాడు. ప్రచండశాసనుడై నిప్పులు చెరుగుతున్నాడు. ప్రజలపై కక్ష కట్టినట్టు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతూ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఫొనీ తుపాను ప్రభావంతో నాలుగు రోజుల క్రితం జిల్లాలో మబ్బులు కమ్ముకుని కొద్దిగా ఎండ వేడిమి తగ్గి కాస్త ఉపశమనం కలిగినా తుపాను తీరం దాటిన తరువాత భానుడు తిరిగి ప్రజలపై నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. గురువారం తాడేపల్లిగూడెంలో నమోదైన 47 డిగ్రీల ఉష్ణోగ్రతే గత దశాబ్దకాలంలో జిల్లాలో అత్యధికమని వాతావరణ శాఖ చెబుతోంది. జిల్లాలోని ఇతర పట్టణాల్లోనూ భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు నగరంలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
.ఏలూరు నగరంతోపాటు నరసాపురం, భీమవరం, పాలకొల్లు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, తణుకు, తదితర ప్రాం తాల్లో గురువారం 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యమైన పనులు ఉంటే తప్ప ఇళ్ళలోనుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. రాబోయే రెండు రోజుల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని ఆర్టీజీఎస్ ప్రకటించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వచ్చే రెండు రోజుల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉండబోతోందని, పిడుగులు పడబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చంటి పిల్లలు, వృద్ధులు ఉంటే మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా ఈ నెల 12 నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత కాస్త తగ్గుతుందని ఆర్టీజీఎస్ ప్రకటించడంతో ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment