ఇల్లెందుఅర్బన్(ఖమ్మం), న్యూస్‌లైన్ : అంతర్గత అభ్యర్థులతో భర్తీ చేసే పోస్టులకు పరీక్ష రాసే అర్హత సింగరేణి సూపర్‌బజార్ ఉద్యోగులకు ఉందని సింగరేణి సూపర్‌బజార్ ఎంప్లాయీస్ కొత్తగూడెం రిజీయన్ డెప్యూటీ ప్రధాన కార్యదర్శి పి.వెంకన్న తెలిపారు. గురువారం స్థానిక సూపర్‌బజార్ ఆవరణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 1982- 83, 85, 88, 89 సంవత్సరాల్లో సింగరేణిలో క్లర్క్, డంపర్ ఆపరేటర్, వార్డుబాయ్, ఇతర పోస్టులకు సింగరేణి సూపర్‌బజార్ ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా వారికి యాజమాన్యం ఉద్యోగ అవకాశాలు కల్పించిం దని చెప్పారు. కంపెనీ నిబంధనల మేరకే ఈ నెల 15వ తేదీన క్లర్క్ పోస్టులకు అంతర్గత అభ్యర్థులుగా దరఖాస్తు చేసుకునే అర్హత యాజమాన్యం కల్పించిందన్న విషయాన్ని టీబీజీకేఎస్ నాయకులు మిరియాల రాజిరెడ్డి, కనకరాజు విస్మరించారన్నారు. ఈ విషయంలో వారు చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, తక్షణమే సింగరేణి, సూపర్‌బజార్ యాజమాన్యాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంకన్న వెంట రంగారెడ్డి, అన్వర్, మంగ్యా తదితరులు పాల్గొన్నారు.