తిరుపతి : గుంటూరు, విజయవాడ నగరాల (కొత్త రాజధాని) మధ్య ఆధునిక వసతులతో సూపర్ స్పెషాలిటీ (ఈఎస్‌ఐ) ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తిరుపతిలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని మంత్రి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తూ ఈఎస్‌ఐ ఆస్పత్రుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. విశాఖపట్నంలో అవసాన దశలో ఉన్న ఈఎస్‌ఐ ఆస్పత్రిని 200 పడకలుగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. విజయనగరంలో అసంఘటిత రంగ కార్మికులు అధికంగా ఉన్నారని, వీరి సౌకర్యార్థం అక్కడున్న ఈఎస్‌ఐ ఆస్పత్రిని 100 పడకలుగా తీర్చిదిద్దుతామన్నారు. తిరుపతిలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని సైతం 100 పడకలతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, వృత్తి విద్యా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి 5 కోట్ల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
సీఆర్‌డీఏ పరిధిలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి
Published Thu, Apr 2 2015 10:00 PM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM
Advertisement