
కోవూరులో జగన్‌కు సంఘీభావంగా నిర్వహించిన పాదయాత్రలో అభివాదం చేస్తున్న ఎమ్మెల్యే రోజా, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం: రాష్ట్రంలో ప్రజల తరఫున పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాట యోధుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్, వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లు దాటిన నేపథ్యంలో సంఘీభావంగా కోవూరులో సోమవారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను, అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు అండగా నిలిచిన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ప్రజల కోసం తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్ని పోరాటాలు చేశారో ప్రజలందరూ చూస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు కొత్త డ్రామాలాడుతున్నారన్నారు. నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో అబద్ధపు పాలన సాగిస్తున్న, ప్రజలను మోసగిస్తూ మభ్యపెడుతున్న చంద్రబాబునాయుడును గద్దె దించాలన్నారు. రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని తెలిపారు. కోవూరు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని గెలిపించాలని ఆమె ప్రజలనుకోరారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 46 మండలాల్లో 45 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించారన్నారు. అయితే ఆయా మండలాలకు ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయం అందడం లేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే రైతులను అన్నివిధాలా ఆదుకుంటారన్నారు.
ప్రజా సంకల్పయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయాలని చూస్తున్నారని తెలిపారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీని అమలు చేయకుండా చంద్రన్న కానుక సంచికే పరిమితమయ్యారన్నారు. రుణమాఫీ మొదలు ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. రైతులు, మహిళలు బ్యాంకుల చుట్టూ తిరిగి అలసిపోతున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశారన్నారు. అడుగడుగునా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి ధైర్యం చెబుతూ అధికారంలోకి వస్తే చేసే పనులను వివరిస్తున్నారని తెలిపారు. పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అరాచక పాలన చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కారన్నారు. ప్రజలు నరకం అనుభవిస్తున్నారన్నారు. అప్రజాస్వామిక పాలనకు చరమగీతం పలకాలని చూస్తున్నారన్నారు.
జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడంతో రాష్ట్ర ప్రజలకు మంచిరోజులొస్తాయన్నారు. పార్టీ నాయకుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడంతో సుపరిపాలన అందుతుందన్నారు. ప్రజాసంక్షేమానికి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలతో అందరూ సుభిక్షంగా ఉంటారన్నారు. అందరూ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించాలని, ప్రసన్నకుమార్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబు రెడ్డి, నాపా వెంకటేశ్వర్లునాయుడు, నలుబోలు సుబ్బారెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి, సూరా శ్రీనివాసులు రెడ్డి, వీరి చలపతిరావు, కలువ బాలశంకర్‌రెడ్డి, గొల్లపల్లి విజయ్‌కుమార్, నల్లపరెడ్డి రజత్‌కుమార్‌రెడ్డి, నల్లపరెడ్డి వినోద్‌కుమార్‌రెడ్డి, షేక్ అల్లాబక్షు, గంధం వెంకటశేషయ్య, బెజవాడ గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment