రామోజీకి ‘సుప్రీం’లో ఎదురుదెబ్బ | Supreme court denies stay in Eenadu case | Sakshi
Sakshi News home page

రామోజీకి ‘సుప్రీం’లో ఎదురుదెబ్బ

Published Wed, Jan 8 2014 3:28 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

రామోజీకి ‘సుప్రీం’లో ఎదురుదెబ్బ - Sakshi

రామోజీకి ‘సుప్రీం’లో ఎదురుదెబ్బ

హైకోర్టు ఆదేశాల నిలిపివేతకు నిరాకరణ
విశాఖలో ‘ఈనాడు’ స్థల యజమానికి నోటీసులు
హైకోర్టు ఉత్తర్వులను ఈనెల 10లోపు రామోజీ అమలుచేయాలి


 విశాఖపట్నం-లీగల్, న్యూస్‌లైన్: విశాఖపట్నంలోని ‘ఈనాడు’ స్థల వివాదంలో రామోజీరావుకి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసు పూర్తయ్యేవరకు ఆ స్థలంలో ఈనాడు కార్యాలయం కొనసాగాలంటే స్థల యజమాని మంతెన ఆదిత్యవర్మకు నెలకు రూ. 17 లక్షల చొప్పున అద్దె, అలాగే అద్దె బకాయి రూ. 2.57 కోట్లు ఈనెల 10లోగా చెల్లించాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని రామోజీ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వర్మకు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. 1974, మార్చి 30న రామోజీరావు 2.78 ఎకరాల స్థలం, 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనాలను 33 ఏళ్ల కాలపరిమితికి అద్దెకు తీసుకున్నారు. అద్దె గడువు 2007 ఏప్రిల్‌తో ముగిసిన పిదప లీజు పొడిగించడానికి వర్మ తిరస్కరించడంతో రామోజీరావు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. మరోవైపు లీజు సమయంలో రూ. 2,500 అద్దె, కొన్నేళ్ల తరువాత రూ.3వేలు చెల్లించాలన్న ఒప్పం దం ప్రకారం అద్దె సక్రమంగా చెల్లించకపోవడంతో వర్మ విశాఖలోని అద్దె నియంత్రణ చట్టం ప్రత్యేక కోర్టు (ఆర్‌సీసీ)ని ఆశ్రయించారు. నెల రోజుల్లో భవనం ఖాళీ చేసి యజమానికి అప్పగించాలని కోర్టు రామోజీరావును ఆదేశిస్తూ తీర్పు చెప్పింది.

ఈ తీర్పుపై రామోజీరావు అప్పీల్ చేయగా, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆర్‌సీసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. ఈ స్టేను తొలగించాలని కోరుతూ వర్మ హైకోర్టును ఆశ్రయిం చారు. ముంబై, హైదరాబాద్, విశాఖ వంటి నగరాల్లో అద్దెలు పెరగడంపై ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనం ప్రతిని కూడా హైకోర్టు ముందు ఉంచారు. దీన్ని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డి... దిగువ కోర్టులో స్టే కొనసాగాలంటే ప్రస్తుత స్థలం విలువపై ఐదు శాతం అద్దెను ప్రతీనెల చెల్లించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. విశాఖలోని సీతమ్మధార ప్రాంతంలో రిజిస్ట్రేషన్ విలువ చదరపు గజానికి రూ. 30 వేలు పైచిలుకు ఉన్న ప్రకా రం ప్రస్తుతం స్థలం విలువ రూ. 40,36,50,000గా, భవనాల విలువ రూ. 90 లక్షలుగా లెక్కించారు.

ఆ ఆస్తులను వాణిజ్య అవసరాలకు తీసుకున్న రామోజీరావు స్థల యజమాని వర్మకు రూ.17లక్షల చొప్పున ప్రతినెల 10లోపు అద్దె చెల్లించాలని, అద్దె బకాయిలు రూ. 2.57 కోట్లు ఇవ్వాలని ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ ఈనెల 3న రామోజీరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ప్రాథమిక విచారణ జరిపిన జస్టిస్ చంద్రమౌళి కేఆర్ ప్రసాద్, జస్టిస్ కురియన్ జోసఫ్‌ల ధర్మాసనం.. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలన్న రామోజీరావు అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో ఈనెల 10లోగా అద్దెతో పాటు బకాయిలు రామోజీరావు చెల్లించాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement