పేదల ఆహార సమస్య మీకు పట్టదా? | Supreme court fires on state food commission recruitments | Sakshi
Sakshi News home page

పేదల ఆహార సమస్య మీకు పట్టదా?

Published Thu, Apr 27 2017 1:15 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

పేదల ఆహార సమస్య మీకు పట్టదా? - Sakshi

పేదల ఆహార సమస్య మీకు పట్టదా?

రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ ఏర్పాటుచేయకపోవడంపై మండిపడ్డ సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫుడ్‌ కమిషన్‌లో నియామకాలు త్వరితగతిన పూర్తిచేయకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదల ఆహార సమస్య మీకు పట్టదా? అంటూ మండిపడింది. కరువు రాష్ట్రాల్లో రైతులకు ప్రభుత్వాల నుంచి ఉపశమనం లభించడం లేదంటూ స్వరాజ్‌ అభియాన్‌ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్, జస్టిస్‌ ఎన్‌.వి.రమణతో కూడిన ధర్మాసనం కొంతకాలంగా విచారణ జరుపుతోంది.

జాతీయ ఆహార భద్రత చట్టానికి లోబడి రాష్ట్రాల్లో వీలైనంత త్వరగా రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని, కమిషన్‌లో నియామకాలు త్వరితగతిన పూర్తిచేయాలని మార్చి 22న ధర్మాసనం 10 రాష్ట్రాలను ఆదేశించింది. ఈ ఉత్తర్వుల అమలు వివరాలతో ఏప్రిల్‌ 26న ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు(సీఎస్‌) స్వయంగా హాజరు కావాలంది. ఈ మేరకు బుధవారం ఈ పిటిషన్‌ విచారణకు రాగా ఆయా రాష్ట్రాల సీఎస్‌లను ధర్మాసనం వివరాలు అడిగింది. ఐదు రాష్ట్రాలు  నియామకాలు చేపట్టకపోవడం తో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

నెలలోగా పూర్తి చేయాలి..
ధర్మాసనం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ దినేష్‌కుమార్‌ విచారణకు హాజరయ్యారు. ఏపీ తరఫున న్యాయవాది గుంటూరు ప్రభాకర్‌ వాదనలు వినిపించారు. రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌లో నియామకాలు చేపట్టేందుకు సెలక్షన్‌ కమిటీ వేశామని, మూడు నెలల్లో నియామకాలు పూర్తిచేస్తామని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నియామకాలను నెలలోగా పూర్తిచేయాలని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఏపీ సీఎస్‌ను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement