National food security
-
ఎస్సీలకు సాయంలో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా దేశంలోని 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 53,85,270 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించగా.. ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 96.39% అంటే 51,91,091 ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. మరే రాష్ట్రం కనీసం లక్ష మంది ఎస్సీ కుటుంబాలకు కూడా సహాయం అందించలేదు. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక స్పష్టం చేసింది. 2022–23 ఆర్థిక ఏడాదిలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలు పురోగతిపై విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది. లక్ష్యాల కన్నా 90% పైగా అమలు చేసిన రాష్ట్రాల పనితీరు చాలా బాగుందని, లక్ష్యాలలో 80% నుంచి 90% మధ్య సాధిస్తే మంచి పనితీరు చూపిందని.. 80% లోపు ఉంటే ఆ రాష్ట్రాల పనితీరు పేలవంగా ఉందని నివేదిక విశ్లే షించింది. గతంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు విడుదల చేసిన నివేదికలో రాష్ట్రంలో 33.57 లక్షల ఎస్సీ కుటుంబాలకు సాయం అందించిందని, అనంతరం జనవరి నుంచి మార్చి వరకు అదనంగా మరో 18.34 లక్షల కుటుంబాలకు సాయం చేసిందని నివేదిక స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత అత్యధికంగా కర్ణాటకలో 59,345 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందింది. పట్టణ పేదలకూ చేయూత గత ఆర్థిక ఏడాది పట్టణ పేదలకు సాయం చేయడంలో కూడా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నట్లు కేంద్ర నివేదిక స్పష్టం చేసింది. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటిలో కలిపి మొత్తం 8.49 లక్షల మంది పట్టణ పేదలకు సాయం అందగా, అందులో 7,24,776 మంది ఏపీ వారేనని నివేదిక పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఆదాయం గల కుటుంబాలకు 2.67 లక్షల ఎల్ఐజీ గృహాలను రాష్ట్రంలో నిర్మించగా, ఇతరత్రా దేశ వ్యాప్తంగా 9.15 లక్షల గృహాలు నిర్మించారని తెలిపింది. 2022–23 ఆర్థిక ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ ఆహార భద్రత చట్టాన్ని నూటికి నూరు శాతం అమలు చేశారని ప్రశంసించింది. 18.47 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేశారని తెలిపింది. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద లక్ష్యానికి మించి కొత్తగా 33,122 స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించారని స్పష్టం చేసింది. గత ఆర్థిక ఏడాదిలో ఏపీలో 24,852 వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, 1,24,311 పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఇది లక్ష్యానికి 500 శాతం మేర అధికం అని తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 99.98 శాతం డెలివరీలు (ప్రసవాలు) ఇన్‌స్టిట్యూషన్లలోనే జరిగాయని నివేదిక పేర్కొంది. ఇలా రాష్ట్రంలో 7,61,629 డెలివరీలు జరిగాయని తెలిపింది. ఏపీలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు నూటికి నూరు శాతం చాలా మంచి పనితీరు కనపరిచాయని, 257 ఐసీడీఎస్ బ్లాక్‌లు (సమగ్ర శిశు అభివృద్ధి కేంద్రాలు) చక్కగా పని చేశాయని ప్రశంసించింది. -
ఉచిత రేషన్‌కు సర్కారు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా కేంద్రం ప్రకటించిన సంవత్సర కాలం ఉచితరేషన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ జనవరి నుంచి వచ్చే డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా 5 కిలోలు బియ్యం ఉచితంగా అందించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. జాతీయ ఆహార భద్రతా చట్టం కార్డులు కలిగిన వారికి ఒక్కొక్కరికి 5కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వనున్నారు. అంత్యోదయ కార్డులకు కుటుంబానికి 35 కిలోలు, అన్నపూర్ణ కార్డులకు 10 కిలోలు ఉచితంగా అందించనున్నారు. అదేవిధంగా కుమ్రంబీమ్, ఆసిఫా బాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాలకు బియ్యానికి బదులుగా ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహార భద్రత కార్డులున్న వారి విషయంలో ఉచిత రేషన్ గురించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్రంలో 90 లక్షల ఆహార భద్రత కార్డులుండగా, అందులో 55 లక్షల కార్డులు కేంద్ర పరిధిలో ఉండగా, 35 లక్షల కార్డులు రాష్ట్ర పరిధిలో ఉన్నాయి. -
దేశాన్ని నలుగురు నడిపిస్తున్నారు: రాహుల్
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వంపై దాడిని కాంగ్రెస్ తీవ్రం చేసింది. ఈ చట్టాలతో దేశ ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని, ఇవి రైతుల వెన్నెముకను విరిచేస్తాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ దేశాన్ని నలుగురు వ్యక్తులే నడిపిస్తున్నారని, వారెవరో అందరికీ తెలుసని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో గురువారం బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. తన ప్రసంగంలో వ్యవసాయ చట్టాలను విమర్శించేందుకే ప్రాధాన్యతనిచ్చారు. ‘విపక్ష సభ్యులెవరూ వ్యవసాయ చట్టాల్లోని విషయాలపై, వాటి ఉద్దేశాలపై మాట్లాడలేదని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడు ఆ చట్టాల ఉద్దేశాలపై, అందులోని విషయాలపై నేను మాట్లాడుతాను. ఈ చట్టాల సాయంతో కార్పొరేట్లు భారీ మొత్తంలో ఆహార ధాన్యాలను కొనుగోలు చేసి, ఇష్టమొచ్చినంత కాలం నిల్వ చేసి, దేశ ఆహార భద్రతను నాశనం చేస్తారు. అదే ఆ చట్టాల ప్రధాన ఉద్దేశం’అని రాహుల్ విమర్శించారు. కుటుంబ నియంత్రణ ప్రచార నినాదమైన ‘మనం ఇద్దరం.. మనకు ఇద్దరు’స్ఫూర్తితో ఈ దేశాన్ని నలుగురు వ్యక్తులు మాత్రమే నడిపిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కొత్త సాగు చట్టాలతో వ్యవసాయ మార్కెట్లు కనుమరుగవుతాయని, నిత్యావసర వస్తువుల చట్టం ప్రాధాన్యత కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆహార భద్రత వ్యవస్థను, గ్రామీణ ఆర్థిక రంగాన్ని కొత్త సాగు చట్టాలు నాశనం చేస్తాయి. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు రైతులు విశ్రమించబోరు’అన్నారు. ‘నిజమే.. ఈ చట్టాలు రైతులకు ఎంచుకునే అవకాశం ఇచ్చాయి. అవి ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలను ఎంచుకునే అవకాశం’అని మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మాత్రమే ఉద్యమించడం లేదని, దేశమంతా వారి వెనుక ఉందని, ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కు తీసుకోక తప్పదని స్పష్టం చేశారు. ఉద్యమంలో 200 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, అయినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. రైతుల మృతికి నివాళిగా కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ సభ్యులతో కలిసి సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ‘సాగు చట్టాలపై ప్రత్యేక చర్చ కావాలని కోరాం. ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే, నిరసనగా, నేను ఈ రోజు రైతుల విషయంపైనే మాట్లాడుతాను’అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వ్యవసాయం కూడా బడ్జెట్లో భాగమేనని, అదీకాక, బడ్జెట్‌పై చర్చల్లో పాల్గొన్న సభ్యుడు సాధారణ అంశాలపై కూడా మాట్లాడవచ్చని నిబంధనల్లోనే ఉందని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి పేర్కొన్నారు. -
పేదల ఆహార సమస్య మీకు పట్టదా?
రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఏర్పాటుచేయకపోవడంపై మండిపడ్డ సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫుడ్ కమిషన్‌లో నియామకాలు త్వరితగతిన పూర్తిచేయకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదల ఆహార సమస్య మీకు పట్టదా? అంటూ మండిపడింది. కరువు రాష్ట్రాల్లో రైతులకు ప్రభుత్వాల నుంచి ఉపశమనం లభించడం లేదంటూ స్వరాజ్ అభియాన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ ఎన్.వి.రమణతో కూడిన ధర్మాసనం కొంతకాలంగా విచారణ జరుపుతోంది. జాతీయ ఆహార భద్రత చట్టానికి లోబడి రాష్ట్రాల్లో వీలైనంత త్వరగా రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని, కమిషన్‌లో నియామకాలు త్వరితగతిన పూర్తిచేయాలని మార్చి 22న ధర్మాసనం 10 రాష్ట్రాలను ఆదేశించింది. ఈ ఉత్తర్వుల అమలు వివరాలతో ఏప్రిల్ 26న ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు(సీఎస్) స్వయంగా హాజరు కావాలంది. ఈ మేరకు బుధవారం ఈ పిటిషన్ విచారణకు రాగా ఆయా రాష్ట్రాల సీఎస్‌లను ధర్మాసనం వివరాలు అడిగింది. ఐదు రాష్ట్రాలు నియామకాలు చేపట్టకపోవడం తో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నెలలోగా పూర్తి చేయాలి.. ధర్మాసనం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ సీఎస్ దినేష్‌కుమార్ విచారణకు హాజరయ్యారు. ఏపీ తరఫున న్యాయవాది గుంటూరు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్‌లో నియామకాలు చేపట్టేందుకు సెలక్షన్ కమిటీ వేశామని, మూడు నెలల్లో నియామకాలు పూర్తిచేస్తామని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ మదన్ బి.లోకూర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నియామకాలను నెలలోగా పూర్తిచేయాలని జస్టిస్ ఎన్.వి.రమణ ఏపీ సీఎస్‌ను ఆదేశించారు. -
గుజరాత్ భారత్‌లో లేదా?: సుప్రీం
న్యూఢిల్లీ: గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఆహార భద్రత చట్టం అమలు చేయకపోవడాన్ని సుప్రంకోర్టు తీవ్రంగా పరిగణించింది. పార్లమెంట్ తెచ్చిన చట్టాన్నీ పట్టించుకోకపోతే ఎలా అంది. ‘ఇది దేశం మొత్తానికీ వర్తించే చట్టం. కానీ గుజరాత్ దీన్ని అమలు చేయడం లేదు. గుజరాత్ భారత్‌లో భాగం కాదా? పార్లమెంట్ ఏంచేస్తోంది’ అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరువు బాధిత రాష్ట్రాల్లో ఉపాధి హామీ, జాతీయ ఆహార భద్రత తదితరాలపై ప్రస్తుత పరిస్థితిపై వివరాలు తమ ముందుంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆహార భద్రత వంటి సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ, ఏపీ తదితర కరువు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని దాఖలైన వహిస్తున్నాయంటూ స్వరాజ్ అభియాన్ వేసిన పిల్‌ను సోమవారం సుప్రీమ్ కోర్టు మరోసారి విచారించింది.