ఎస్సీలకు సాయంలో ఏపీ అగ్రగామి  | AP is top in helping SCs | Sakshi
Sakshi News home page

ఎస్సీలకు సాయంలో ఏపీ అగ్రగామి 

Published Mon, Jul 31 2023 3:39 AM | Last Updated on Mon, Jul 31 2023 6:45 PM

AP is top in helping SCs - Sakshi

సాక్షి, అమరావతి: ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 2022 ఏప్రిల్‌ నుంచి 2023 మార్చి వరకు ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా దేశంలోని 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 53,85,270 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించగా.. ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 96.39% అంటే 51,91,091 ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. మరే రాష్ట్రం కనీసం లక్ష మంది ఎస్సీ కుటుంబాలకు కూడా సహాయం అందించలేదు.

ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కా­ర్యక్ర­మాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక స్పష్టం చేసింది. 2022–23 ఆర్థిక ఏడాదిలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలు పురోగతిపై విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది. లక్ష్యాల కన్నా 90% పైగా అమలు చేసిన రాష్ట్రాల పనితీరు చాలా బాగుందని, లక్ష్యాలలో 80% నుంచి 90% మధ్య సాధిస్తే మంచి పనితీరు చూపిందని.. 80% లోపు ఉంటే ఆ రాష్ట్రాల పనితీరు పేలవంగా ఉందని నివేదిక విశ్లే షించింది.

గతంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు విడుదల చేసిన నివేదికలో రాష్ట్రంలో 33.57 లక్షల ఎస్సీ కు­టుంబాలకు సాయం అందించిందని, అనంతరం జ­నవరి నుంచి మార్చి వరకు అదనంగా మరో 18.34 లక్షల కుటుంబాలకు సాయం చేసిందని నివేదిక స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ తర్వాత అత్యధికంగా కర్ణాటకలో 59,345 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందింది.  

పట్టణ పేదలకూ చేయూత 
గత ఆర్థిక ఏడాది పట్టణ పేదలకు సాయం చేయడంలో కూడా దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉన్నట్లు కేంద్ర నివేదిక స్పష్టం చేసింది. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటిలో కలిపి మొత్తం 8.49 లక్షల మంది పట్టణ పేదలకు సాయం అందగా, అందులో 7,24,776 మంది ఏపీ వారేనని నివేదిక పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఆదాయం గల కుటుంబాలకు 2.67 లక్షల ఎల్‌ఐజీ గృహాలను రాష్ట్రంలో నిర్మించగా, ఇతరత్రా దేశ వ్యాప్తంగా 9.15 లక్షల గృహాలు నిర్మించారని తెలిపింది.

2022–23 ఆర్థిక ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ ఆహార భద్రత చట్టాన్ని నూటికి నూరు శాతం అమలు చేశారని ప్రశంసించింది. 18.47 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేశారని తెలిపింది. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ కింద లక్ష్యానికి మించి కొత్తగా 33,122 స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించారని స్పష్టం చేసింది. గత ఆర్థిక ఏడాదిలో ఏపీలో 24,852 వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, 1,24,311 పంపు సెట్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చి నట్లు నివేదిక స్పష్టం చేసింది.

ఇది లక్ష్యానికి 500 శాతం మేర అధికం అని తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 99.98 శాతం డెలివరీలు (ప్రసవాలు) ఇన్‌స్టిట్యూషన్లలోనే జరిగాయని నివేదిక పేర్కొంది. ఇలా రాష్ట్రంలో 7,61,629 డెలివరీలు జరిగాయని తెలిపింది. ఏపీలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు నూటికి నూరు శాతం చాలా మంచి పనితీరు కనపరిచాయని, 257 ఐసీడీఎస్‌ బ్లాక్‌లు (సమగ్ర శిశు అభివృద్ధి కేంద్రాలు) చక్కగా పని చేశాయని ప్రశంసించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement