దినేష్ రెడ్డి ఆస్తులపై విచారణకు సుప్రీం ఆదేశం
హైదరాబాద్ : పోలీస్ డైరక్టర్ జనరల్ దినేష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన ఆస్తులపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐపీఎస్ ఉమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పు ఇచ్చింది. దినేష్‌డ్డితో సహా ఆయన సతీమణి కమలా రెడ్డికి చెందిన అన్ని ఆస్తుల లావాదేవీలతో పాటు డీజీపీ కుటుంబసభ్యులు వై.రవిప్రసాద్, ఏ.కృష్ణారెడ్డి జరిపిన అన్ని లావాదేవీలపై పూర్తి విచారణకు ఆదేశించాలంటూ ఆయన తన పిటీషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు... ఉమేష్ కుమార్ పిటిషన్లోని అభియోగాలను ఎదుర్కోవల్సిందేనని దినేష్ రెడ్డికి స్పష్టం చేసింది. దర్యాప్తులోని అభ్యంతరాలను ట్రయిల్ కోర్టులో తేల్చుకోవాలని డీజీపీకి సుప్రీంకోర్టు సూచించింది.
డీజీపీ భార్యకు రంగారెడ్డి జిల్లా చంపాపేట, మహేశ్వరం, మేడ్చల్ లలో 90కి పైగా భూముల లావాదేవీలు అమ్మటం, కొనటం జరిగిందని ఉమేష్ కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా దినేష్‌రెడ్డి తన భార్య పేరుతో బెనామీగా ఆస్తులను కూడబెట్టారంటూ ఉమేశ్‌కుమార్, అలాగే షూ కుంభకోణంలో ఉమేశ్‌కుమార్ నిందితుడిగా ఉన్నారంటూ దినేష్‌రెడ్డి పరస్పర ఆరోపణలతో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.