సుప్రీం అనుమతిస్తేనే రెండో విడత కౌన్సెలింగ్ | supreme court to decide engineering second phase counselling | Sakshi
Sakshi News home page

సుప్రీం అనుమతిస్తేనే రెండో విడత కౌన్సెలింగ్

Published Wed, Sep 10 2014 1:22 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

సుప్రీం అనుమతిస్తేనే రెండో విడత కౌన్సెలింగ్ - Sakshi

సుప్రీం అనుమతిస్తేనే రెండో విడత కౌన్సెలింగ్

* ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై నేడు ఉత్తర్వులు
 
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఇంజనీరింగ్ రెండో దశ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు బుధవారం స్పష్టతనివ్వనుంది. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ వ్యవహారాన్ని కూడా కోర్టు తేల్చనుంది. ఈ నేపథ్యంలో ఇందుకు విధించిన గడువును ఏపీ ఉన్నత విద్యా మండలి మరో వారం పొడిగించింది. మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీని ఈ నెల 15లోగా పూర్తి చేయాలని మొదట్లో భావించినప్పటికీ.. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఈ గడువును 23కు పొడిగించింది.

నిజానికి మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి కాగానే.. రెండో విడతకు ఏపీ మండలి సిద్ధమైంది. అయితే ఆగస్టు 31 తర్వాత కౌన్సెలింగ్ చేపడితే సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్లవుతుందని, మళ్లీ కౌన్సెలింగ్ చేపట్టాలంటే  కోర్టు అనుమతి తప్పనిసరన్న టీ సర్కార్ వాదనతో ఏపీ మండలి గందరగోళంలో పడింది. చివరకు మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీలోనూ ఇదే చిక్కు వచ్చిపడింది. దీంతో చేసేదేమీ లేక మూడు రోజుల కిందటే ఏపీ మండలి మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

రెండో దశ కౌన్సెలింగ్‌కు అనుమతినివ్వాలంటూ అఫిడివిట్ దాఖలు చేసింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలనాపర ఇబ్బందులున్నాయని, తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం(ఫాస్ట్) పథకానికి మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉందని, ఇందుకు అక్టోబరు 31 వరకు గడువు ఇవ్వాలని తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టును గతంలో కోరిన సంగతి తెలిసిందే. అయితే ఉమ్మడి ప్రవేశాలు అయినందున ఏపీ సర్కారు అభిప్రాయం మేరకు ఆగస్టు 31లోగా ప్రవేశాలను పూర్తి చేయాలని కోర్టు గతంలో ఆదేశించింది. కానీ, ఈ గడువులోగా తొలి విడత కౌన్సెలింగే పూర్తయింది.

రెండో దశతోపాటు మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి ఇంకా చర్యలు చేపట్టాలి. ఈ నేపథ్యంలో తాము మరింత గడువు అడిగితే.. ఆగస్టు 31లోగా మొత్తం కౌన్సెలింగ్ పూర్తి చేస్తామన్న ఏపీ కౌన్సిల్ ఇప్పుడు కోర్టు అనుమతి లేకుండా రెండో విడతను ఎలా చేపడతుందని టీ సర్కారు ప్రశ్నించింది. దీనిపై అడ్వొకేట్ జనరల్ అభిప్రాయం కూడా తీసుకుంది. కోర్టు తీర్పు ప్రకారం గడువు ముగిసినందున మళ్లీ ఏం చేయాలన్నా కోర్టు అనుమతి అవసరమని ఏజీ పేర్కొనడంతో ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ టీ సాంకేతిక విద్యా కమిషనర్ ఇటీవలే ఏపీ మండలికి లేఖ రాశారు. దీంతో ఈ విషయంలో మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. బుధవారం వచ్చే తీర్పు మేరకు అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

మేనేజ్‌మెంట్ కోటాకు 30 వేల దరఖాస్తులు
ఇంజనీరింగ్(బీటెక్) మేనేజ్‌మెంట్ కోటాలో సీట్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి.  మంగళవారం వరకు 30 వేలు దాటినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మంగళవారం మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ షెడ్యూలును ఏపీ ఉన్నత విద్యా మండలి మార్చింది. దీంతో దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. పాత షెడ్యూలు ప్రకారం ఈ నెల 3వ తేదీతో ఆ ప్రక్రియ ముగిసింది.

అయితే సీట్ల భర్తీకి తాజాగా సుప్రీంకోర్టు అనుమతి కోరిన నేపథ్యంలో షెడ్యూలును ఏపీ మండలి మార్చింది. ఈ నెల 12 వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఈ ప్రకారం 14 నాటికి కాలేజీలకు మెరిట్ జాబితాలను అందజేయనుంది. విద్యార్థులకు 21లోగా ఇంటర్వ్యూలు నిర్వహించాలని, సీట్లు కేటాయించిన వారి వివరాలను 23లోగా పంపిం చాలని ఏపీ మండలి వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement