సాక్షి, న్యూ ఢిల్లీ : విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ అంశంపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్ల విచారణ వీలైనంత త్వరగా ముగించాలని హైకోర్టుకు సూచిస్తామని తెలిపింది. వచ్చే వారం చివరి నాటికి హైపర్ కమిటీ విచారణ ముగించాలంది. సుమోటోగా కేసు తీసుకునే అధికారం ఉందని ఇప్పటికే ఎన్జీటీ స్పష్టం చేసిందని పేర్కొంది. ఎన్జీటీ ఆదేశాలతో డిపాజిట్ చేసిన 50 కోట్ల పంపిణీని 10 రోజులు ఆపాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ ప్రధాన ఆదేశాలను సవాలు చేస్తూ అప్లికేషన్ సమర్పించాలని పిటిషనర్‌కు సూచన చేసింది. ( గ్యాస్ లీకేజీ ఘటన: ముగిసిన విచారణ )
ప్లాంట్‌ను సీల్ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు ఎల్జీ పాలిమర్స్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ. ప్లాంట్ సీల్, కంపెనీ డైరెక్టర్ల పాస్ పోర్టులను సమర్పించాలన్న హైకోర్టు ఆదేశాలను సవాలు చేశామన్నారు. ప్లాంట్‌ను సీల్ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్న రోహత్గీ వాదనపై జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ స్పందిస్తూ.. ప్లాంట్‌ను సీల్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని భావించట్లేదన్నారు. కంపెనీ లోపం వల్ల గ్యాస్ లీక్ అయిందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ సమయంలో ఇందులో జోక్యం చేసుకోవాలనుకోవట్లేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని ముకుల్ రోహత్గీ కోరిన నేపథ్యంలో పిటిషన్‌పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment