- ఆలయ కమిటీల తీరు ఆక్షేపణీయం
- ఉత్సవాల నిర్వహణకే పరిమితం
- రాజకీయ జోక్యంతో సమస్యలు
- బాధ్యతలు విస్మరిస్తున్న సభ్యులు
ఆలయ సంక్షేమమే లక్ష్యం.. దేవుని ఆస్తుల పరిరక్షణ కర్తవ్యం.. అయితే ఆశయం ఒకటైతే, అనుసరణ ఓ విధంగా ఉండడమే ఆలయ కమిటీల తీరులో విచిత్రం. దేవుని సేవలో తరించాల్సిన ఈ సంస్థలు సంకుచిత మార్గాన్ని అనుసరిస్తున్నాయి. ఉదాత్తతకు తిలోదకాలిచ్చి అభాసు పాలవుతున్నాయి.
యలమంచిలి, న్యూస్‌లైన్ : ఆలయ అభివృద్ది కమిటీలు ఉత్సవ కమిటీలుగా మారాయి. ఆలయాల అభివృద్ది దేవుడెరుగు ఉన్న ఆస్తులను కాపాడడంలో ఆలయ కమిటీలో పూర్తిగా విఫలమవుతున్నాయి. ఆలయాల అభివృద్ది పాటుపడవలసిన కమిటీలు కేవలం ఉత్సవాలు నిర్వహించడానికి మాత్రమే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అభివృద్ది కమిటీల నియామకం రాజకీయ నేతల్లో చేతుల్లో ఉండడంతో ఆలయాల అభివృద్దిపై ఆసక్తి ఉన్న భక్తులకు అవకాశం లభించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పలు ఆలయాల కమిటీ నియామకాలు వివాదాస్పదంగా మారడంతో సమస్య జటిలమవుతోంది. జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో 1063 ఆలయాలు ఉండగా గత రెండు నెలల్లో 200వరకు ఆలయాల అభివృద్ది కమిటీలకు నియామకపు ఉత్తర్వులు జారీచేశారు. నోటిఫికేషన్‌లో నిబంధలకు లోబడి ఆలయ అభివృద్ది కమిటీలు ఏర్పాటుచేయవలసి ఉన్నప్పటికీ అధికశాతం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సిఫార్సులతోనే కమిటీల నియామకాలు జరుగుతున్నాయి. జిల్లాలో సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి, ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామి, యలమంచిలి వీరభద్రస్వామి ఆలయాలకు ఉన్న కోట్లాది రూపాయల విలువచేసే ఆస్తులు అన్యాక్రాంతమవడమే కాకుండా పలు ఆలయాలు ఏళ్లతరబడి అభివృద్దికి నోచుకోవడంలేదు.
ఆస్తుల పరిరక్షణ ఏదీ?
యలమంచిలి వీరభద్రస్వామి ఆలయానికి సంబంధించి దాదాపు రూ.10కోట్ల విలువచేసే ఆస్తులు ఆక్రమణలో ఉన్నాయి. పట్టణంలో ఇంకా రెండెకరాలవరకు ఖాళీస్థలాలు ఉన్నాయి. ఈ స్థలాలు కూడా ఆక్రమణలకు గురవుతున్నప్పటికీ అధికారులు, ఆలయ అభివృద్ది కమిటీలు ఏమాత్రం పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటికొప్పాక వేణుగోపాలస్వామికి సంబంధించి భూములు కూడా ఆక్రమణలో ఉండడంతో ఈ ఆలయం పూర్వవైభవాన్ని కోల్పోయింది. ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అభివృద్ది కమిటీల నియామకం ఎప్పుడు వివాదస్పదమే. ఈ ఆలయ అభివృద్ది కూడా అంతంతమాత్రంగానే ఉంది.
అభివృద్దికమిటీలు ఏంచేయాలి?
ఆలయ ఆస్తులను సంరక్షించడంతోపాటు ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవడానికి అధికారులకు సహకరించాలి. రైతులవద్ద ఉన్న భూములకు శిస్తులు పెంచడానికి చర్యలు తీసుకోవడం, అర్చకులు, సిబ్బందికి జీతాలు చెల్లింపులో బాధ్యతాయుతంగా వ్యవహరించవలసి ఉంది. ముఖ్యమైన ఉత్సవాలు, పర్వదినాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయించవలసి ఉంది.
అభివృద్ది కమిటీలు చేస్తున్నదేమిటి?
ఉత్సవాలు, పర్వదినాల్లో ఆలయాలకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేయించడం, ప్రసాదాలు పంచిపెట్టడానికి మాత్రమే అభివృద్ది కమిటీలు పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక రాజకీయనాయకులు, ఉన్నతాధికారులు ఆలయాలను సందర్శించినపుడు మంగళవాయిద్యాలతో స్వాగతం పలుకుతున్నాయి.