development committees
-
ముహూర్తం ఖరారు!
సాక్షి, రంగారెడ్డి: ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల సమీక్షలో కీలకమైన స్థాయి సంఘాల కమిటీల ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 29వ తేదీన కమిటీలను నియమించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు జిల్లా పరిషత్ పాలకవర్గం ప్రత్యేకంగా భేటీ కానుంది. సర్వసభ్య సమావేశం నిర్వహించి స్థాయి సంఘాల కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. మరోపక్క కొత్త జిల్లాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్న ఈ కమిటీల కూర్పు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు దీనిపై దృష్టి సారించారు. జిల్లాలో 21 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. ఇందులో 16 స్థానాల్లో అధికార పార్టీ సభ్యులు కొనసాగుతున్నారు. నాలుగు జెడ్పీటీసీలు కాంగ్రెస్ చేతికి చిక్కగా.. మరొకటి ఏఐఎఫ్బీ దక్కించుకున్న విషయం తెలిసిందే. కమిటీల కూర్పు ఇలా.. జిల్లా పరిషత్‌లో ఏడు స్థాయి సంఘాలు ఉంటాయి. గ్రామీణాభివృద్ధి, విద్య–వైద్యం, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, ప్లానింగ్– ఫైనాన్స్, పనుల కమిటీలు ఉంటాయి. జిల్లాలో 21 మంది జెడ్పీటీసీలు, ఇద్దరు కో–ఆçప్షన్ సభ్యులు ఉన్నారు. వీరితోపాటు చేవెళ్ల, భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ఎంపీలు రంజిత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, రాములు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఆరుగురు ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 33 మంది సభ్యులు ఉంటారు. అయితే, కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సభ్యుల సంఖ్యలో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది. జిల్లా పరిధిలో ఓటు హక్కు ఉన్న ప్రజాప్రతినిధులే జెడ్పీ సభ్యులుగా కొనసాగుతారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు నాగర్‌కర్నూల్‌లో ఓటు ఉంది. నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జెడ్పీల్లో దేనిలో కొనసాగుతారో ఆయన విచక్షణపై ఆధారపడి ఉంది. ఈ మేరకు స్పష్టత కోసం రంగారెడ్డి జిల్లా జెడ్పీ అధికారులు ఆయనకు ఒకటిరెండు రోజుల్లో లేఖ రాయనున్నారు. ఎంతో కీలకం.. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జిల్లా పరిషత్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. జిల్లా స్థాయిలో ప్రజా సమస్యలను, నిధులు అవసరాన్ని, పథకాల్లో లోటుపాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కమిటీల తీర్మానాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. అధికారులకు సూచనలు అందజేయడంలోనూ కమిటీల ప్రాధాన్యత ముఖ్యమైంది. జెడ్పీ సర్వసభ్య సమావేశం, స్థాయి సంఘం సమావేశాల్లో సభ్యులు చేసే తీర్మానాలను ఆమోదించి ప్రభుత్వానికి పంపిస్తారు. దీనికి అనుగుణంగా సర్కారు చర్యలు తీసుకుంటుంది. ఇలా కీలకమైన స్థాయి సంఘాల కమిటీల ఏర్పాటుపై ప్రజాప్రతినిధులు దృష్టిసారించారు. ఆయా సంఘాల్లో ఎవరికి ప్రాతినిథ్యం కల్పించాలనే అంశంపై జెడ్పీ చైర్పర్సన్ డాక్టర్ అనితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చర్చలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. కమిటీ స్వరూపం ఇలా.. సభ్యులందరినీ ఏడు భాగాలుగా విభజించి ఒక్కో స్థాయి సంఘంలో సమానంగా చోటు కల్పిస్తారు. గ్రామీణాభివృద్ధి, విద్య–వైద్యం, ప్లానింగ్–ఫైనాన్స్ కమిటీలకు జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. వ్యవసాయ కమిటీకి జెడ్పీ వైస్ చైర్మన్ అధ్యక్షుడిగా కొనసాగుతారు. మహిళా శిశు సంక్షేమ కమిటీకి జనరల్ మహిళా జెడ్పీటీసీ అధ్యక్షురాలిగా ఉంటారు. సాంఘిక సంక్షేమ కమిటీకి అ«ధ్యక్షురాలిగా ఎస్సీ లేదా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలిని అధ్యక్షురాలిగా నియమిస్తారు. ఏడు స్ధాయి సంఘాల్లో ప్లానింగ్–ఫైనాన్స్ కమిటీ ప్రధానమైంది. ఈ కమిటీలో చోటు కోసం జెడ్పీటీసీ సభ్యులు పోటీ పడుతున్నట్లు తెలిసింది. ఎలాగైనా స్థానం దక్కించుకోవాలని తమ పరిధి ఎమ్మెల్యేల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. చైర్పర్సన్ అనితారెడ్డి సూచన మేరకు జెడ్పీ అధికారులు స్థాయి సంఘం కమిటీల ఏర్పాటు కోసం కరసత్తు పూర్తి చేస్తున్నారు. ఏ కమిటీలో ఎవరిని సభ్యులుగా చేర్చాలనే అంశంపై గోప్యత పాటిస్తున్నారు. కమిటీల ఏర్పాటు అనంతరం ప్రతి రెండు నెలలకోసారి స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించనున్నారు. -
కమిటీలు వేయరు... ఖర్చు చేయరు...
ఆస్పత్రులకు కేటాయించిన నిధులు ఖర్చుకానివైనం అభివృద్ధి కమిటీలు ఏర్పాటు కాకపోవడమే కారణం వెనక్కు మళ్లిపోనున్న రూ. కోటీ 34లక్షలు రోగులకు అందని మెరుగైన వైద్యసేవలు అభివృద్ధి కమిటీల ఏర్పాటులో మీనమేషాలు సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఆస్పత్రుల అభివృద్ధి నిధులు నిరుపయోగమైపోతున్నాయి. మంజూరైన రూ. కోటి 34లక్షల్లో ఒక్క రూపాయీ ఇంతవరకు ఖర్చు చేయలేదు. ఈ నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో ఆ నిధులు వెనక్కుమళ్లిపోయే అవకాశం ఉంది. ఈ నిధులు ఖర్చుకాని కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి నిధులు మంజూరవుతాయో లేదోనన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. దీనికంతటికీ ఆస్పత్రులకు అభివృద్ధి కమిటీలు ఏర్పాటు కాకపోవడమే కారణం. ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్ని కమిటీలే ఖర్చు పెట్టాలి. ఇప్పుడా కమిటీలే పూర్తి స్థాయిలో లేకపోవడంతో నిధులు మురిగిపోతున్నాయి. ఆస్పత్రుల అభివృద్ధీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది. కమిటీలపై కానరాని స్పష్టత జిల్లాలో 68పీహెచ్‌సీలు, 11సీహెచ్‌సీలు, ఆరు వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులు ఉన్నాయి. వాటన్నింటికీ అభివృద్ధి కమిటీలు వేయాలని ఏడాదిన్నర క్రితం ఉత్తర్వులొచ్చాయి. కానీ, విజయనగరం కేంద్రాస్పత్రికి మాత్రమే అధికారికంగా కమిటీని ప్రకటించారు. మిగిలినవాటికి కమిటీలు వేశారో లేదో కూడా స్పష్టత లేదు. జిల్లా వైద్యాధికారులు మాత్రం నెల రోజుల క్రితమే 38 ఆస్పత్రులకు కమిటీలు వేశామనీ, వాటి కార్యకలాపాలు ఇంకా ప్రారంభం కాలేదని చెబుతున్నారు. కమిటీలు చార్జితీసుకోకుంటే నిధుల వినియోగానికి వీలుపడదు. విజయనగరం కేంద్రాస్పత్రికి డాక్టర్ వి.ఎస్.ప్రసాద్ చైర్మన్‌గా నియమించిన కమిటీ నేటికీ చార్జ్ తీసుకోలేదు. ఫలితంగానే కార్యకలాపాలు ప్రారంభం కాలేదని స్పష్టమవుతోంది. రాజకీయ జోక్యంవల్లే... గతంలో పీహెచ్‌సీకి ఎంపీపీ, సీహెచ్‌సీకి ఎమ్మెల్యే, కేంద్రాస్పత్రికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ చైర్మన్‌గా వ్యవహరిస్తూ కమిటీలుండేవి. టీడీపీ అధికారంలోకి వచ్చాక పాత విధానానికి స్వస్థిపలికి వైద్య రంగంలో ఉత్తమ సేవలందించిన వారిని, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారిని కమిటీలో నియమించాలని ఆదేశాలిచ్చింది. ఇది అధికారులకు ఇబ్బందికరంగా మారింది. తాము లేకుంటే... తమ అనుయాయులే ఉండాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. తాము చెప్పినోళ్లనే కమిటీలో వేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారి మధ్య కూడా సమన్వయం లేకపోవడంతో ఒక్కొక్కరు ఒక్కో జాబితా ఇవ్వడంతో ఎవరిని వేయాలో తేల్చుకోలేక అధికారులు సందిగ్ధంలో పడ్డారు. దీనివల్లే కమిటీల ఏర్పాటులో జాప్యం ఏర్పడింది. ఫలితంగా జిల్లాలోని ఆస్పత్రుల అభివృద్ధి కోసం కేటాయించిన రూ. కోటి 34లక్షలు మురిగిపోతున్నాయి. ఈ నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఇవి తిరిగి మళ్లిపోవచ్చని కొన్ని వర్గాల సమాచారం. దీనివల్ల వచ్చే ఏడాది నిధుల మంజూరుపైనా సందేహాలు ఏర్పడుతున్నాయని అధికార వర్గాలే చెబుతున్నాయి. -
ఉత్సవవిగ్రహాలు
ఆలయ కమిటీల తీరు ఆక్షేపణీయం ఉత్సవాల నిర్వహణకే పరిమితం రాజకీయ జోక్యంతో సమస్యలు బాధ్యతలు విస్మరిస్తున్న సభ్యులు ఆలయ సంక్షేమమే లక్ష్యం.. దేవుని ఆస్తుల పరిరక్షణ కర్తవ్యం.. అయితే ఆశయం ఒకటైతే, అనుసరణ ఓ విధంగా ఉండడమే ఆలయ కమిటీల తీరులో విచిత్రం. దేవుని సేవలో తరించాల్సిన ఈ సంస్థలు సంకుచిత మార్గాన్ని అనుసరిస్తున్నాయి. ఉదాత్తతకు తిలోదకాలిచ్చి అభాసు పాలవుతున్నాయి. యలమంచిలి, న్యూస్‌లైన్ : ఆలయ అభివృద్ది కమిటీలు ఉత్సవ కమిటీలుగా మారాయి. ఆలయాల అభివృద్ది దేవుడెరుగు ఉన్న ఆస్తులను కాపాడడంలో ఆలయ కమిటీలో పూర్తిగా విఫలమవుతున్నాయి. ఆలయాల అభివృద్ది పాటుపడవలసిన కమిటీలు కేవలం ఉత్సవాలు నిర్వహించడానికి మాత్రమే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అభివృద్ది కమిటీల నియామకం రాజకీయ నేతల్లో చేతుల్లో ఉండడంతో ఆలయాల అభివృద్దిపై ఆసక్తి ఉన్న భక్తులకు అవకాశం లభించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పలు ఆలయాల కమిటీ నియామకాలు వివాదాస్పదంగా మారడంతో సమస్య జటిలమవుతోంది. జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో 1063 ఆలయాలు ఉండగా గత రెండు నెలల్లో 200వరకు ఆలయాల అభివృద్ది కమిటీలకు నియామకపు ఉత్తర్వులు జారీచేశారు. నోటిఫికేషన్లో నిబంధలకు లోబడి ఆలయ అభివృద్ది కమిటీలు ఏర్పాటుచేయవలసి ఉన్నప్పటికీ అధికశాతం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సిఫార్సులతోనే కమిటీల నియామకాలు జరుగుతున్నాయి. జిల్లాలో సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి, ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామి, యలమంచిలి వీరభద్రస్వామి ఆలయాలకు ఉన్న కోట్లాది రూపాయల విలువచేసే ఆస్తులు అన్యాక్రాంతమవడమే కాకుండా పలు ఆలయాలు ఏళ్లతరబడి అభివృద్దికి నోచుకోవడంలేదు. ఆస్తుల పరిరక్షణ ఏదీ? యలమంచిలి వీరభద్రస్వామి ఆలయానికి సంబంధించి దాదాపు రూ.10కోట్ల విలువచేసే ఆస్తులు ఆక్రమణలో ఉన్నాయి. పట్టణంలో ఇంకా రెండెకరాలవరకు ఖాళీస్థలాలు ఉన్నాయి. ఈ స్థలాలు కూడా ఆక్రమణలకు గురవుతున్నప్పటికీ అధికారులు, ఆలయ అభివృద్ది కమిటీలు ఏమాత్రం పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటికొప్పాక వేణుగోపాలస్వామికి సంబంధించి భూములు కూడా ఆక్రమణలో ఉండడంతో ఈ ఆలయం పూర్వవైభవాన్ని కోల్పోయింది. ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అభివృద్ది కమిటీల నియామకం ఎప్పుడు వివాదస్పదమే. ఈ ఆలయ అభివృద్ది కూడా అంతంతమాత్రంగానే ఉంది. అభివృద్దికమిటీలు ఏంచేయాలి? ఆలయ ఆస్తులను సంరక్షించడంతోపాటు ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవడానికి అధికారులకు సహకరించాలి. రైతులవద్ద ఉన్న భూములకు శిస్తులు పెంచడానికి చర్యలు తీసుకోవడం, అర్చకులు, సిబ్బందికి జీతాలు చెల్లింపులో బాధ్యతాయుతంగా వ్యవహరించవలసి ఉంది. ముఖ్యమైన ఉత్సవాలు, పర్వదినాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయించవలసి ఉంది. అభివృద్ది కమిటీలు చేస్తున్నదేమిటి? ఉత్సవాలు, పర్వదినాల్లో ఆలయాలకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేయించడం, ప్రసాదాలు పంచిపెట్టడానికి మాత్రమే అభివృద్ది కమిటీలు పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక రాజకీయనాయకులు, ఉన్నతాధికారులు ఆలయాలను సందర్శించినపుడు మంగళవాయిద్యాలతో స్వాగతం పలుకుతున్నాయి.