ఆస్పత్రులకు కేటాయించిన నిధులు ఖర్చుకానివైనం
అభివృద్ధి కమిటీలు ఏర్పాటు కాకపోవడమే కారణం
వెనక్కు మళ్లిపోనున్న రూ. కోటీ 34లక్షలు
రోగులకు అందని మెరుగైన వైద్యసేవలు
అభివృద్ధి కమిటీల ఏర్పాటులో మీనమేషాలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఆస్పత్రుల అభివృద్ధి నిధులు నిరుపయోగమైపోతున్నాయి. మంజూరైన రూ. కోటి 34లక్షల్లో ఒక్క రూపాయీ ఇంతవరకు ఖర్చు చేయలేదు. ఈ నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో ఆ నిధులు వెనక్కుమళ్లిపోయే అవకాశం ఉంది. ఈ నిధులు ఖర్చుకాని కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి నిధులు మంజూరవుతాయో లేదోనన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. దీనికంతటికీ ఆస్పత్రులకు అభివృద్ధి కమిటీలు ఏర్పాటు కాకపోవడమే కారణం. ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్ని కమిటీలే ఖర్చు పెట్టాలి. ఇప్పుడా కమిటీలే పూర్తి స్థాయిలో లేకపోవడంతో నిధులు మురిగిపోతున్నాయి. ఆస్పత్రుల అభివృద్ధీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది.
కమిటీలపై కానరాని స్పష్టత
జిల్లాలో 68పీహెచ్‌సీలు, 11సీహెచ్‌సీలు, ఆరు వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులు ఉన్నాయి. వాటన్నింటికీ అభివృద్ధి కమిటీలు వేయాలని ఏడాదిన్నర క్రితం ఉత్తర్వులొచ్చాయి. కానీ, విజయనగరం
కేంద్రాస్పత్రికి మాత్రమే అధికారికంగా కమిటీని ప్రకటించారు. మిగిలినవాటికి కమిటీలు వేశారో లేదో కూడా స్పష్టత లేదు. జిల్లా వైద్యాధికారులు మాత్రం నెల రోజుల క్రితమే 38 ఆస్పత్రులకు కమిటీలు వేశామనీ, వాటి కార్యకలాపాలు ఇంకా ప్రారంభం కాలేదని చెబుతున్నారు. కమిటీలు చార్జితీసుకోకుంటే నిధుల వినియోగానికి వీలుపడదు. విజయనగరం కేంద్రాస్పత్రికి డాక్టర్ వి.ఎస్.ప్రసాద్ చైర్మన్‌గా నియమించిన కమిటీ నేటికీ చార్జ్ తీసుకోలేదు. ఫలితంగానే కార్యకలాపాలు ప్రారంభం కాలేదని స్పష్టమవుతోంది.
రాజకీయ జోక్యంవల్లే...
గతంలో పీహెచ్‌సీకి ఎంపీపీ, సీహెచ్‌సీకి ఎమ్మెల్యే, కేంద్రాస్పత్రికి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చైర్మన్‌గా వ్యవహరిస్తూ కమిటీలుండేవి. టీడీపీ అధికారంలోకి వచ్చాక పాత విధానానికి స్వస్థిపలికి వైద్య రంగంలో ఉత్తమ సేవలందించిన వారిని, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారిని కమిటీలో నియమించాలని ఆదేశాలిచ్చింది. ఇది అధికారులకు ఇబ్బందికరంగా మారింది. తాము లేకుంటే... తమ అనుయాయులే ఉండాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. తాము చెప్పినోళ్లనే కమిటీలో వేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారి మధ్య కూడా సమన్వయం లేకపోవడంతో ఒక్కొక్కరు ఒక్కో జాబితా ఇవ్వడంతో ఎవరిని వేయాలో తేల్చుకోలేక అధికారులు సందిగ్ధంలో పడ్డారు. దీనివల్లే కమిటీల ఏర్పాటులో జాప్యం ఏర్పడింది. ఫలితంగా జిల్లాలోని ఆస్పత్రుల అభివృద్ధి కోసం కేటాయించిన రూ. కోటి 34లక్షలు మురిగిపోతున్నాయి. ఈ నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఇవి తిరిగి మళ్లిపోవచ్చని కొన్ని వర్గాల సమాచారం. దీనివల్ల వచ్చే ఏడాది నిధుల మంజూరుపైనా సందేహాలు ఏర్పడుతున్నాయని అధికార వర్గాలే చెబుతున్నాయి.
కమిటీలు వేయరు... ఖర్చు చేయరు...
Published Fri, Mar 18 2016 1:09 AM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM
Advertisement
Advertisement