కృతిక శుక్లా, జాయింట్ కలెక్టర్
సాక్షి, అమరావతి : నామినేషన్ల పర్వానికి తెరలేవడంతో జిల్లాలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో మార్మోగుతోంది. ఎక్కడ చూసినా మైక్‌సెట్లు, డప్పులమోత మోగుతోంది. పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా ప్రచార హోరు జోరుగా సాగుతోంది. మరోవైపు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో రాజకీయ పార్టీల నాయకుల కదలికలను నిఘా నేత్రాలు వెంటాడుతున్నాయి. ఎన్నికల్లో అభ్యర్థులు పెడుతున్న ఖర్చు, వినియోగించే సామగ్రి, ఉపయోగించే వాహనాలపై ఎన్నికల అధికారులు దృష్టి సారించారు.
అభ్యర్థుల ప్రతి కదలికపై అధికారులు డేగ కన్ను వేశారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా, ఓటర్లను ప్రభావితం చేయకుండా కట్టడి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేస్తున్న అభ్యర్థులు చేసే ఖర్చుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఎంపీ అభ్యర్థి రూ.70 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థి రూ.28 లక్షలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంది. దీనికి మించి ఖర్చు చేస్తే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. అయితే అభ్యర్థులు ఎంత ఖర్చు పెడుతున్నారు.. ఎలా ఖర్చుపెడుతున్నారు అన్న అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
ప్రతిదీ లెక్కే..
ఎన్నికల్లో అభ్యర్థులు చేస్తున్నఖర్చులు,లౌడ్ స్పీకర్లు, వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీలు తదితర వాటికి అయ్యే ఖర్చును పరిశీలించేందుకు, సిబ్బంది పనితీరును పర్యవేక్షించేందుకు ఐఆర్‌ఎస్ అధికారులు జిల్లాకు వస్తున్నారు. వీరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల ప్రచార శైలిని పరిశీలించనున్నారు. అభ్యర్థుల ఖాతాలను అతని అనుమతితో క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అలాగే నియోజకవర్గాల ఆర్వోలు కూడా ఎన్నికల ప్రచార శైలిని నిశితంగా పరిశీలిస్తున్నారు.
ప్రచారాన్ని రికార్డింగ్ చేయనున్న సిబ్బంది
జిల్లాలో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న నేపథ్యంలో అభ్యర్థుల ఖర్చు చేసే ప్రతి రూపాయి ఎన్నికల నియమావళిని దృష్టిలో ఉంచుకుని చేయాల్సి ఉంది. ప్రచారం చేసే అభ్యర్థులను వీడియో సర్వీయలెన్స్ టీం వెంబడిస్తుంది. సంబంధిత అధికారులు వీడియో కెమెరాలతో రికార్డింగ్ చేస్తున్నారు.
జెండాలు, బ్యానర్లు, ర్యాలీలు, హంగు ఆర్భాటాలు ఇలా ప్రతి ఒక్కదానికి చేసే ఖర్చును ఎన్నికల అధికార యంత్రానికి అప్‌లోడ్ చేస్తారు. ఈ మొత్తాన్ని అధికారులు లెక్కల్లో రాస్తారు. కార్యకర్తలకయ్యే భోజనాలు, అల్పాహారం, టీ, కాఫీలు కూడా లెక్కలోకి వస్తాయి. అధికారులతో పాటు ఎన్నికల సంఘం నూతనంగా ఈ ఏడాది ఆవిష్కరించిన సీ–విజల్ యాప్‌నకు ఎవరైనా అనుసంధానం చేసినా వాటికి కూడా లెక్క చెప్పాల్సి వస్తుంది. అభ్యర్థులు చేస్తున్న ఖర్చు వివరాలు దాచాలన్నా దాగవు.
నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి
ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. ఎవరైనా ఓటర్లను భయపెట్టినా, ప్రలోభపెట్టినా సమీపంలో ఉన్న అధికారులు, పోలీసులు, ఫ్లైయింగ్ స్క్వాడ్‌కు సమాచారం అందించాలి. ఎన్నికలు సజావుగా సాగేందుకు అధికారులకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.
– కృతిక శుక్లా, జాయింట్ కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment