నిరాడంబరుడు, సేవాతత్పరుడు
పోటీ పరీక్షల్లో హ్యాట్రిక్ టాపర్
సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుమార్ ప్రస్థానం
ఏ రంగంలోనైనా రాణించేవారు ఎందరో ఉంటారు. బహు రంగాల్లో రాణించే వారు కొందరే ఉంటారు. వృత్తి, ప్రవృత్తిలోనే కాదు.. నీతి, నిజాయతీ, దయాగుణంతో నడిచే వారు అరుదుగా ఉంటారు. అవన్నీ కలగలిసిన ఒకాయన నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. కోచింగ్ తీసుకోకుండా ఏకంగా మూడు పోటీ పరీక్షల్లో స్టేట్ టాపర్‌గా నిలిచారు. గ్రూప్-1 ఆఫీసర్ హోదాలో ఓ శిథిల క్వార్టరులో ఉంటున్నారు. ఆయన మిమిక్రీ, వెంట్రిలాక్విజం ఆర్టిస్ట్ కూడా. విధి నిర్వహణలోనూ పలు అవార్డులందుకుంటున్నారు. నిస్వార్థం, నిరాడంబరత, ఆదర్శం మేళవించిన ఆ అధికారి పేరు చెన్నారెడ్డి వెంకట సత్యనారాయణ కుమార్. విశాఖ జిల్లా సర్వే, ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డెరైక్టర్! ఆశ్చర్యంగా ఉందా? అయితే ఈ కథనం చదవండి...
విశాఖపట్నం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన కుమార్‌కు చిన్నప్పట్నుంచి చదువుతో పాటు మిమిక్రీ అంటే పిచ్చి. రేడియో, టీవీల్లో వచ్చే నేరెళ్ల వేణుమాధవ్ వంటి ప్రముఖుల మిమిక్రీ షోలు చూసి స్వతహాగా అనుకరించడం నేర్చుకున్నారు. మిమిక్రీపై ఆసక్తి చూపితే కెరీర్ పాడవుతుందని, చదువు ముఖ్యమని తల్లి భుజంగవేణి కుమారుడికి హితబోధ చేసేది. అమ్మ చెప్పిన మాటలను ఒంట బట్టించుకుని చదువులో రాణిస్తూనే, తనకిష్టమైన మిమిక్రీ, వెంట్రిలాక్విజంపై ఆసక్తి పెంచుకున్నారు. 18 ఏళ్ల వయసులో ఇచ్చిన తొలి షోను అంతా మెచ్చుకోవడంతో దూసుకెళ్లారు. జెమినీ, దూరదర్శన్, ఆకాశవాణితో పాటు పలు సంస్థల తరఫున ప్రదర్శనలిచ్చి జాతీయ అవార్డులు, సన్మానాలు పొందారు.
ఉద్యోగ ప్రస్థానం..
కుమార్ ఉద్యోగ ప్రస్థానంలోనూ ఎంతో ప్రత్యేకత ఉంది. విశాఖలో పాలిటెక్నిక్, విజయవాడలో బీటెక్ (సివిల్) చదివారు. అనంతరం తొలిసారి జేఈ ఉద్యోగానికి ఆర్‌ఆర్‌బీ (సికింద్రాబాద్) పరీక్ష రాసి 2002లో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఆ ఉద్యోగంలో ఉంటూ 2005లో సెక్షన్ ఇంజినీర్ పోస్టుకి ఆర్‌ఆర్‌బీ (కోల్‌కతా) ఎగ్జామ్ రాసి దేశంలోనే మరోసారి టాపర్‌గా నిలిచారు. ఆ పోస్టులో ఉంటూనే ఏపీపీఎస్సీ 2007లో వెలువరించిన గజిటెడ్ ఎగ్జామ్‌లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంకు పొందారు. సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డెరైక్టర్ (గ్రూప్-1 కేడర్)గా శ్రీకాకుళం జిల్లాలో నియమితులయ్యారు. అనంతరం తూర్పుగోదావరి బదిలీ అయి, రెండున్నరేళ్లుగా విశాఖ జిల్లాలో ఏడీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన తనకిష్టమైన మిమిక్రీ, వెంట్రిలాక్విజం షోలివ్వక పోయినా ఉన్నతాధికారుల కోరికపై అప్పుడప్పుడూ తన ప్రతిభను చాటుకుంటున్నారు.
పురస్కారాలివీ..
కుమార్ వృత్తి, ప్రవత్తిలో పలు అవార్డులందుకున్నారు. నేషనల్ సర్వే డే రాష్ట్ర అవార్డు, బెస్ట్ సిటిజన్ జాతీయ, రాష్ట్ర అవార్డులు, ఆంధ్రరత్న రాష్ట్ర అవార్డు, లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు, విశాఖ మదర్ థెరీసా సంస్థ ఆణిముత్యం, మదర్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ జాతీయ అవార్‌డ, ఒంగోలు నేషనల్ ఆర్ట్స్ అకాడమీ రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారాలు, అర్పిత సంస్థ ఆంధ్రరత్న వంటి 15 అవార్డులు, ఎన్నో సత్కారాలు అందుకున్నారు.
నిరాడంబరత..
విధి నిర్వహణలో కుమార్ సమర్థవంతుడన్న పేరుంది. సర్వే, ల్యాండ్ రికార్డ్స్ విభాగం ఎంతో కీలకమైనది. శ్రీకాకుళం జిల్లాలో ఆయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం తూర్పు గోదావరికి బదిలీ చేసింది. అక్కడ ల్యాండ్ రికార్డ్స్ నిర్వహణలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపినందుకు స్టేట్ అవార్డు ఇచ్చింది. అనంతరం విశాఖ జిల్లాకు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఇక్కడ ప్రభుత్వ భూముల గుర్తింపు, కంచె వేయించి పరిరక్షణ పనులు చేపట్టారు. చిన్నపాటి ప్రభుత్యోద్యోగులే బహుళ అంతస్తుల భవనాల్లో ఉండే ఈ రోజుల్లో నిరాడంబరత కోరుకునే కుమార్ ఓ శిథిలమైన సాదాసీదా ఆర్ అండ్ బీ క్వార్టరులో ఉంటున్నారు. ఆధ్యాత్మిక చింతన ఉన్న కుమార్ పురాణాలు, ఇతిహాసాలను బాగా ఔపోసన పట్టారు. తనను అవే మార్చాయంటారాయన. తన పుట్టినరోజును అనాథలు, వృద్ధుల ఆశ్రమాల్లో జరుపుకుంటారు. 30 మంది పేద పిల్లలకు కంప్యూటర్ శిక్షణ ఇప్పిస్తున్నారు. ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తుంటారు.
నా ఆస్తులు ట్రస్టుకే..
నేను సర్కారు బడిలోనే చదివాను. ఒక్కరోజూ కోచింగ్ గడప ఎక్కలేదు. కేవలం మార్కెట్లో దొరికే పోటీ పరీక్షల పుస్తకాలతో కుస్తీపట్టే స్టేట్ టాపర్ ర్యాంకులు సాధించాను. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి సూచనలు, సలహాలు ఇస్తున్నాను. నాకొచ్చే జీతంలో ఎలాంటి సేవింగ్స్ చేయడం లేదు. చట్టబద్ధంగా ట్యాక్స్ చెల్లిస్తాను. కర్మయోగాన్ని నమ్ముతాను. నా తదనంతరం ఆస్తిపాస్తులు మదర్ థెరిసా ట్రస్టుకివ్వాలని నిర్ణయించుకున్నాను. నా భార్య కడప జిల్లా రాజంపేటలో స్టేట్ బ్యాంకు మేనేజరుగా పనిచేస్తున్నారు. ఆమె కూడా నా నిర్ణయాలకు
సహకరిస్తున్నారు.
-సీహెచ్‌వీఎస్‌ఎన్ కుమార్, ఎ.డి.
‘సత్య’వ్రతుడు
Published Sun, Feb 22 2015 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM