విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్: ఈ చేత్తో ఇచ్చి.. ఆ చేత్తో లాక్కున్న చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దరఖాస్తు చేసిన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ భారాన్ని తగ్గించుకునేందుకు యత్నిస్తోంది. అనర్హుల పేరిట చాలా ఇళ్లు రద్దు చేయాలన్న యోచనతోనే మళ్లీ సర్వే చేస్తున్నారని మూడో విడత రచ్చబండలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. చేసేది లేక సర్వే అధికారులపై భారం వేసి బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. మొదటి, రెండో విడతల రచ్చబండ సందర్భంగా సర్వే నిర్వహించి, అర్హులను తొలగించి ఇళ్లు మంజూరు చేశారు. ఆ రెండు విడతల్లో లక్షా 80 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 50 వేల మందిని అనర్హులుగా ప్రకటించారు. తరువాత నియోజకవర్గానికి రెండు వేలు చొప్పున తొమ్మిది నియోజకవర్గాల్లో 18 వేల మందికి, తరువాత మరో ఎనిమిది వేల మందికి కలిపి మొత్తం 26 వేల మందికి ఇళ్లు మంజూరు చేసి చేతులు దులిపేసుకున్నారు. మిగిలిన లక్షకు పైబడిన దరఖాస్తులు బుట్టదాఖలయ్యాయి.
అయితే ఏ ప్రయోజనం ఆశించో.. ఏమో.. మూడో విడతలో జిల్లాలో దరఖాస్తు చేసుకున్న 62 వేల మందికీ ఎటువంటి సర్వే లేకుండానే ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మొదట, రెండో విడత కలిపి కేవలం 26వేల ఇళ్లు మంజూరుచేయగా మూడో విడతలో పెద్ద ఎత్తున 62 వేల మందికి ఇళ్లు మంజూరు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాలో ఇల్లులేని నిరుపేదలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అయితే వారి సొంత ఇంటి కల నెరవేరే పరిస్థితి కనిపించడంలేదు. అంత భారాన్ని మోయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా లేదు. ఆ సంఖ్యను తగ్గించేందుకు యత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా సర్వే నిర్వహిస్తున్నారు.
రద్దుకు యత్నాలు
62 వేల ఇళ్లకు బిల్లులు చెల్లించవలసి వస్తే సుమారు రూ.450 కోట్లు విడుదల చేయాలి. అయితే ఇంత పెద్ద మొత్తాన్ని భరించేందుకు సర్కార్ పెద్దలు ఇష్ట పడటం లేదని తెలిసింది. భారం తగ్గించుకోవడానికి వీలుగా అనర్హుల పేరుతో జాబితాను తగ్గించేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం.
ముగ్గురు అధికారులతో సర్వే:
తహశీల్దార్, ఎంపీడీఓ, మండల గృహనిర్మాణశాఖ ఏఈలతో కూడిన బృందం సర్వే ప్రారంభించింది. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వారికి ఇంతకు ముందు ఇల్లు మంజూరు అయిందా, అయితే ఏ పథకంలో మంజూరయింది వంటి వివరాలతో కూడిన సర్వేను చేపడుతున్నారు. సర్వే సభ్యులు అనర్హులుగా తేల్చితే వారి ఇంటిని రద్దుచేస్తారు.
గతంలోనూ ఇంతే
సకాలంలో నిర్మించలేదన్న కారణంతో ఇందిరమ్మ, ఫేజ్-1, 2, 3 లలో మంజూరయిన వాటిలో జిల్లా వ్యాప్తంగా 25 వేలు ఇళ్లను 2012లో రద్దు చేశారు. వాటి స్థానంలో కొత్త వారికి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. అయితే ఇంతవరకు ఒక్కరి కూడా మంజూరు చేయలేదు. సర్వే విషయాన్ని గృహనిర్మాణశాఖ పీడీ యు.కె.కుమార్ వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు మేరకే సర్వే చేపడుతున్నామని చెప్పారు. సర్వేలో అనర్హులుగా తేలితే జాబితా నుంచి తొలిగిస్తామని తెలిపారు.
‘సర్వే’శా నీవే దిక్కు!
Published Sat, Dec 21 2013 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement
Advertisement