
మా బతుకుల్లో వెలుగెప్పుడు?
అది లింగాపురం పంచాయతీ... మండల కేంద్రమైన కోటవురట్లకు కూతవేటు (కిలోమీటర్) దూరంలో ఉంది. పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని ఈ పంచాయతీకి దశాబ్దాల చరిత్ర ఉంది. పాలకులు మారుతున్నారే తప్ప ఈ గ్రామ ప్రజల తలరాతలు మాత్రం మారడం లేదు. 2500కు పైగా జనాభా ఉన్న గ్రామంలో శ్లాబ్ ఇళ్లే కాదు.. పూరి గుడిసెలు కూడా లెక్కకు మించి ఉన్నాయి. సరైన రోడ్లు లేవు.. మేజర్ డ్రెయిన్లు కాదు కదా కనీసం కచ్చా డ్రెయిన్లు కూడా లేవు. ఎక్కడపడితే అక్కడ మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది.
వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రజలు ఇంకా బహిరంగ ప్రదేశాలనే ఆశ్రయిస్తున్నారు. సరైన రక్షిత నీరు లేదు.. గ్రామంలో సరిగా పనిచేయని బోర్లే ప్రజలకు దిక్కు. శాసనమండలి సమావేశాలు, అధికారులతో సమీక్షలు, కార్యకర్తల సమావేశాల్లో నిత్యం తలమునకలయ్యే ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు శనివారం ‘సాక్షి’ తరపున వీఐపీ విలేకరిగా మారారు. పలుచోట్ల పర్యటించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం..
లింగాపురం గ్రామంతా తిరిగాను..ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నాను. పింఛన్లు తీసేశారని.. హౌసింగ్ పేమెంట్స్ జరగడం లేదని.. నీలం సాయం అందలేదని.. రుణ మాఫీలు జరగడం లేదని.. ఇలా ప్రతి ఒక్కరూ తమ సమస్యలను ఏకరవు పెట్టుకున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా రోడ్లు లేవు.. డ్రెయిన్లు లేవు. ఈ గ్రామస్తులెదుర్కొంటున్న సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. అధికారులతో మాట్లాడతా. పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా..
-దాట్ల వెంకట సూర్యనారాయణరాజు, ఎమ్మెల్సీ
నాకు పింఛన్ ఆపేశారు బాబయ్యా.. ఎలా బతకాలో అద్దం కావట్లేదు. ఆపీసర్లనడిగితే... నీకు ఐదెకరాల భూముందని పింఛన్ ఆపేశామని చెబుతున్నారు. నాకు సెంటు భూమి కూడా లేదు. ఇదెక్కడి నాయం బాబయ్యా. నాకు పింఛన్ వచ్చేలా చూడయ్యా.. నీకు పున్నెముంటాది
-చిటికల శ్రీరాములు
ప్రజాప్రతినిధులు గమనించాలే గానీ సమస్యలు కోకొల్లలు. వారు ప్రజలతో మాట్లాడగలిగితే... వారి కష్టసుఖాలు అర్ధం చేసుకోగలిగితే ఎన్నో ఇబ్బందులు తొలగిపోతాయి. ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు శనివారం ఆ ప్రయత్నమే చేశారు. ‘సాక్షి’ తరపున వీఐపీ విలేకరిగా వ్యవహరించారు. కోటవురట్ల మండలం లింగాపురం పంచాయతీలో పర్యటించారు.
ఎమ్మెల్సీ రాజు: ఏమ్మా ఎలా ఉన్నావ్? నీ పేరేంటి? ఏంటి నీ సమస్య ?
అల్లూరి శేషమ్మ: నా పేరు శేషమ్మ. ఏలి ముద్ర పడడం లేదని పించేను ఆపేశారు బాబయ్యా. మొన్నటి వరకు రెండొందలొచ్చేది.. ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వడం లేదు.
ఎమ్మెల్సీ రాజు:ఆఫీసర్లనడిగావా? ఏం చెప్పారు?
అల్లూరి శేషమ్మ: చాలా చార్లు అడిగాను.. నీ ఏలిముద్రలు పడడం లేదు.. మేమేమి చే యలేమంతున్నారు. కాగితం కూడా పెట్టుకున్నాను.. చూత్తామంటున్నారే తప్ప ఇవ్వడం లేదయ్యా.
ఎమ్మెల్సీ రాజు:ఏందయ్యా ఎలాగున్నావ్..ఏంటీ నీ సమస్య?
చిటికల శ్రీరాములు: నాకు పింఛన్ ఆపేశారు బాబయ్యా.. ఎలా బతకాలో అద్దం కావట్లేదు.
ఎమ్మెల్సీ రాజు: ఎందుకాపేశారు... ఆఫీసర్లేమైనా చెప్పారా?
చిటికల శ్రీరాములు: ఐదెకరాలుందంటున్నారు. భూమి ఉందని పింఛన్ ఆపేశామని చెబుతున్నారు. నాకు సెంటు భూమి కూడా లేదు. ఇదెక్కడి నాయం బాబయ్యా. నాకు పింఛన్ వచ్చేలా చూడయ్యా.. నీకు పున్నెముంటాది.
ఎమ్మెల్సీ రాజు: కార్యదర్శి గారూ.. ఏంటీ పింఛన్ల పరిస్థితి?
పంచాయతీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం: గ్రామం లో 622 పింఛన్లు ఉన్నాయ్ సార్. గ్రామ కమిటీ సిఫార్సు మేరకు 19 పింఛన్లు తొలగించారు. మరో 22 పింఛన్‌లను బయోమెట్రిక్‌లో వేలిముద్రలు సరిపోక ఆపేశారు.
ఎమ్మెల్సీ రాజు: వీరంతా నిరుపేదలండీ.. పింఛన్ తీసేస్తే ఎలా బతుకుతారు?
సుబ్రహ్మణ్యం: తొలగించిన పింఛన్లలో అర్హుల కో సం రీసర్వే చేసి నివేదిస్తున్నాం. వేలిముద్రలు పడని వారి తరపున గ్రామ కార్యదర్శి వేలిముద్రలు తీసి పంపమన్నారు.. చేస్తున్నాం.
ఎమ్మెల్సీ రాజు: ఏమయ్యా ఏం సాగు చేస్తున్నావ్? పంటల పరిస్థితి ఎలా ఉంది?
సింగంపల్లి కొండ: రెండకరాల్లో చెరకు పంట వేశా.. మొన్నొచ్చిన గాలి తుపానుకి పడిపోయింది. టన్నుకు 2 వేలు కూడా రాలేదు. పెట్టుబడి కూడా దక్కలేదు.
ఎమ్మెల్సీ రాజు: అధికారులెవరైనా వచ్చారా? ఎంత నష్టం జరిగిందో రాసుకున్నారా?
సింగంపల్లి కొండ: రాసుకున్నారు బాబయ్యా.. నీలం తుపాను సాయం కూడా ఇంకా అందలేదయ్యా.. ఇక ఈ తుపాను సాయం ఎప్పుడొస్తుందో ఏమో మరి.
ఎమ్మెల్సీ రాజు: మీరు వేసే పంటలకు గిట్టుబాటు వస్తుందా?
సిద్దాబత్తుల బాబ్జి: నేను చెరకు సాగు చేస్తున్నా. టన్నుకు రూ.2,200 కూడా రావడంలేదు. పెట్టుబడి ఏకంగా రెండు వేలై పోతుంది. ఇకేం మిగులుతుందయ్యా. కనీసం టన్నుకు మూడు వేలిస్తే గానీ సరిపోదు.
ఎమ్మెల్సీ రాజు: మరి వరి పరిస్థితి ఏంటి?
సిద్దాబత్తుల బాబ్జి: వరేద్దామంటే నీళ్లు లేవు. తాండవ ఆధునీకరణ పూర్తి కాకపోవడంతో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి.. మాకు ఇది తప్ప మరో పని చేతకాదు.
ఎమ్మెల్సీ రాజు: ఏమ్మా.. ఏం చదువుతున్నావ్?
చింతల భవాని: నర్సీపట్నంలోని ఏబీఎం కాలేజ్‌లో బీఎస్సీ చదువుతున్నా. ఫీజు రీయింబర్స్‌మెంట్ రావడంలేదు.
ఎమ్మెల్సీ రాజు: మరి స్కాలర్‌షిప్ వస్తుందా?
చింతల భవాని: రూ.3,500లు స్కాలర్‌షిప్ వస్తోంది. ఆ మొత్తం కాలేజోళ్లే ఫీజుల కోసం తీసేసుకుంటున్నారు.
ఎమ్మెల్సీ రాజు: ఏమైనా రుణ మాఫీ సొమ్ములేమైనా వచ్చాయా?
గజ్జలపు సూరయ్యమ్మ, వరాలమ్మ: మాది శ్రీ సాయిలక్ష్మి సంఘం. పొదుపు నెలకు యాబై రూపాయలు చేసుకుంటున్నాం. మూడులచ్చల యాబైయేలు తీసుకున్నాం. ఇంకా లచ్చ రూపాయలు కట్టాలి. ఆ బాబు చెప్పారు కదా కట్టొద్దని.. ఆర్నెల్లుగా కట్టడం మానీసేం.
ఎమ్మెల్సీ రాజు: బ్యాంకోళ్లు మరి ఇప్పుడేమంటున్నారు..
గజ్జలపు సూరయ్యమ్మ, వరాలమ్మ: రుణ మాఫీ అవదంటున్నారు. బ్యాంకోళ్లు బకాయింతా ఒకేసారి కత్తేయమంటున్నారు. పైగా పొదుపు సొమ్ము తీసేసుకుంటున్నారు. అసలు పోయిం ది.. వడ్డీ పోయింది. మేం చేయలేమని ముందే చెబితే మా మానాన మేమే కట్టేవాల్లం. ఏం చేయాలో పాలుపోవడం లేదు.
ఎమ్మెల్సీ రాజు: సర్పంచ్ గారూ.. ఏం చేస్తున్నారు?
సర్పంచ్ సుర్ల పోలమ్మ: ఏం చేత్తామయ్యా. మా పంచాయతీలో రోడ్లు లేవు.. కాలువల్లేవు. వేద్దామంటే డబ్బుల్లేవు.
ఎమ్మెల్సీ రాజు: ఇలా అయితే ప్రజలకేం సమాధానం చెబుతావమ్మా?
సుర్ల పోలమ్మ: మండల పరిషత్‌లో అడుగుతున్నాం.. ప్రభుత్వం నుంచి సహకారం లేదు. ఏదడిగినా డబ్బులేవంటున్నారు.