సూర్య బైక్.
డోన్ ఐటీఐ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ
- సూర్యకాంతితో నడిచే వాహనం
- తీరనున్న ఇంధన కష్టాలు
- ఫుల్ చార్జింగ్‌తో 60 కిలోమీటర్ల ప్రయాణం
- అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఇ-బైక్
డోన్ రూరల్: లీటరు పెట్రోల్ ధర రూ.80. మారుతున్న కాలానికి అనుగుణంగా దైనందిన జీవితంలో ద్విచక్ర వాహనం కూడా భాగమైపోతోంది. అయితే రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరతో వీటి నిర్వహణ భారమవుతోంది. ఈ నేపథ్యంలో డోన్ ఐటీఐ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ అందరినీ అబ్బురపరుస్తోంది. వీరి కృషి ఫలించి.. సోలార్ బైక్‌లు మార్కెట్‌లోకి వస్తే ఇంధన కష్టాలకు చెక్ పడినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కర్నూలులోని ఇండస్ పాఠశాలకు చెందిన సూర్యతేజ చిన్నప్పటి నుంచి సాంకేతిక పరిజ్ఞానంపై ఎనలేని మక్కువ.
ఆ దిశగా తరచూ ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్నోవేటివ్ ఫౌండేషన్ ప్రతినిధులు ఇండస్ పాఠశాలను సందర్శించిన సమయంలో సూర్యతేజ తన ఆలోచనలను వారితో పంచుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్నోవేటర్ బంగారురాజు ఆయనకు సహకరించారు. తన ఆవిష్కరణకు కొన్ని పరికరాలు అవసరం కావడంతో డోన్ ఐటీఐ కళాశాలను ఎంచుకున్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బరామయ్య, అధ్యాపక సిబ్బందితో మాట్లాడి సోలార్ ఇ-బైక్ తయారీకి సిద్ధమయ్యారు. ఎలక్ట్రానిక్ ట్రేడ్ విద్యార్థుల సమష్టి కృషితో టీవీఎస్-50 ఎక్సెల్, సైకిల్, బైక్ సామగ్రిని కొనుగోలు చేసి సూర్యతేజ సోలార్ బైక్‌ను రూపొందించారు. ఇందుకోసం ఈ విద్యార్థులు చేసిన ఖర్చు రూ.30 వేలు మాత్రమే. బైక్‌కు అమర్చిన బ్యాటరీ ఫుల్ చార్జి అయితే 60 కిలోమీటర్లు ప్రయాణించవచ్చన్నారు. బ్రేక్ వేసినప్పుడు మోటార్ జనరేటర్‌గా మారి విద్యుదుత్పత్తి చేసి మరింత దూరం ప్రయాణించేందుకు దోహదపడుతుందని వివరించారు.