దొంగల నుంచి చిత్తూరు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాలు
చిత్తూరు అర్బన్/దేవరపల్లి (పశ్చిమ గోదావరి): యూట్యూబ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని భారీగా ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన 13 మంది అంతర్ రాష్ట్ర దొంగలను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసి 107 బైక్‌లు, ఓ ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకోగా.. అదే తరహాలో చోరీలకు పాల్పడిన మరో ఇద్దరి అరెస్ట్ చేసి 109 బైక్‌లను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండు జిల్లాల్లో ఒకేరోజు 216 బైక్‌లు పట్టుబడటం గమనార్హం. రెండుచోట్లా పట్టుబడిన నిందితులు అంతర్ రాష్ట్ర దొంగలు కావటం.. టెక్నాలజీ సాయంతోనే చోరీలకు పాల్పడటం విశేషం. చిత్తూరు జిల్లాలో వెలుగుచూసిన చోరీలకు సంబంధించి ఎస్పీ సెంథిల్‌కుమార్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు, పలమనేరు, పుత్తూరు, శ్రీసిటీ సబ్–డివిజన్ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీ అవుతున్నట్టు పోలీసులకు పెద్దఎత్తున ఫిర్యాదులొచ్చాయి. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన డీఎస్పీలు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఆ బృందాలు చిత్తూరు జిల్లాతో పాటు తమిళనాడులోని తిరువళ్లూరు, వేలూరు జిల్లాకు చెందిన నాలుగు ముఠాలు వాహనాల చోరీకి పాల్పడుతున్నట్టు గుర్తించాయి. వరుస చోరీలకు పాల్పడుతున్న 11 మందిని అరెస్ట్ చేసి విచారణ జరపగా.. జల్సాలకు అలవాటు పడి ఆ దొంగల్లో పలువురు యూట్యూబ్‌లో చూసి చోరీలు చేస్తున్నట్టు చెప్పారు.
చిత్తూరు జిల్లా కేసుల్లో నిందితులు వీరే..
చిత్తూరు సబ్ డివిజన్‌లో యాదమరికి చెందిన ఎ.వినోద్‌కుమార్ (25), సీజీ రాజా (47), చిత్తూరు నగరంలోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన ఎస్.రవిచంద్ర (32) అనే ముగ్గురిని అరెస్ట్ చేసి 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు సబ్–డివిజన్ పోలీసులు తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన ఎస్.సతీష్‌కుమార్ (27), ఐ.జయచంద్ర (55), వరదయ్యపాలెంకు చెందిన ఎస్.వెంకటేశ్వర్లు (27), ఎస్.సుబ్రహ్మణ్యం (18)లను అరెస్ట్ చేసి 37 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలమనేరు సబ్–డివిజన్ పోలీసులు తమిళనాడులోని పేర్నంబట్టుకు చెందిన జి.మురళి (25), పి.కుమరేశన్ (34), యాదమరికి చెందిన జ్యోతి (50) అనే ముగ్గురిని అరెస్ట్ చేసి 27 ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. శ్రీసిటీ పరిధిలో సత్యవేడుకు చెందిన ఎస్.యుగంధర్ (26)ను అరెస్ట్ చేసి 8 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. వాహనాలకు మార్కెట్‌లో లభించే నాణ్యత ఉన్న లాక్‌లను ఉపయోగించాలని, బైకులు చోరీకి గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సెంథిల్‌కుమార్ కోరారు. కాగా, డీఎస్పీలు సుధాకర్‌రెడ్డి, గంగయ్య, యశ్వంత్‌లతో పాటు దర్యాప్తులో పాల్గొన్న సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
దేవరపల్లిలో 109 బైక్‌లు
తెలంగాణతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోటార్ బైక్‌లు చోరీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సుమారు రూ.55 లక్షల విలువైన 109 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన పత్సా రాంబాబు, మారం మునియ్య కలిసి వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. వీరు కూడా తాళాలు వేసి ఉన్న ఎలాంటి బైక్‌నైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సులభంగా స్టార్ట్ చేసి దర్జాగా వేసుకెళ్లిపోయేవారు. వాటిని విక్రయించడం ద్వారా వచ్చే సొమ్మును జల్సాగా ఖర్చు చేసేవారు. వీరిద్దరూ దొంగిలించిన 109 బైక్‌లలో 83 బైక్‌లకు సంబంధించి ఏలూరు, భీమడోలు, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, టి.నర్సాపురం, దేవరపల్లి, కొవ్వూరు, నిడదవోలు, చాగల్లు, తాడేపల్లిగూడెం, ద్వారకా తిరుమల, తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, తెలంగాణలోని ఆశ్వారావుపేట పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్టు ఎస్పీ తెలిపారు. 26 బైక్‌లకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. చోరీ చేసిన మోటార్ సైకిళ్లను యాదవోలుకు చెందిన 12 మంది వ్యక్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. దేవరపల్లి ప్రాంతంలో సారా తయారీదారులు ఈ బైక్‌లను కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించారు. నిందితులు 93 బైక్‌లను యాదవోలు గ్రామంలోనే విక్రయించినట్టు చెప్పారు.
తనిఖీల్లో పట్టుబడ్డారు
నిందితులు పత్సా రాంబాబు, మారం మునియ్య పోలీసులు నాకాబందీ నిర్వహిస్తుండగా పట్టుబడ్డారు. దేవరపల్లి ఎస్సై కె.శ్రీహరిరావు, సిబ్బంది వచ్చీపోయే వాహనాలను తనిఖీలు చేస్తుండగా నిందితులిద్దరూ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం ఇవ్వడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి అసలు విషయాన్ని రాబట్టారు. నిందితులిద్దరితోపాటు బైక్‌లు కొనుగోలు చేసిన 12 మందిపైనా కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో చోరీ అయిన బైక్‌లను త్వరితగతిన స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేయడంలో చొరవ చూపిన కొవ్వూరు డీఎస్పీ బి.శ్రీధర్, దేవరపల్లి ఎస్సై కె.శ్రీధర్, స్టేషన్ సిబ్బందికి ఎస్సీ రాహుల్‌దేవ్‌శర్మ రివార్డులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment