సాక్షి, హైదనాబాద్: ‘ఇబ్రహీంపట్నంలో స్థిరాస్తి వ్యాపారులు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలను తుపాకీతో కాల్చి చంపేసిన ఖాజా మోహియుద్దీన్, బుర్రి భిక్షపతిలు తొలిసారి నేరస్తులే. అప్పటివరకు వాళ్లసలు గన్‌ను ఎప్పుడు చూడలేదు, పట్టుకోలేదు కూడా. హత్యకు 20 రోజుల ముందు తుపాకీని కొనుగోలు చేసి గురి తప్పకుండా ఎలా కాల్చాలో యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నారు’
‘గచ్చిబౌలిలో భువనతేజ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ యజమాని వెంకట సుబ్రమణ్యం యజమాని ఇంట్లోకి ఐటీ అధికారుల వలే ప్రవేశించి రూ.2 లక్షల నగదు, 13.40 తులాల బంగారంతో ఉడాయించిన తొమ్మిది మంది నిందితులూ తొలిసారి నేరస్తులే. చోరీ కంటే ముందు నిందితులు.. సోదాల సమయంలో ఐటీ అధికారులు ఎలా ప్రవర్తిస్తారో ‘స్పెషల్ 26’ హిందీ సినిమా చూసి నేర్చుకున్నారు.
...ఇలా ఒకట్రెండు సంఘటనలు కాదు గ్రేటర్‌లో నమోదవుతున్న నేరాలలో సగానికి పైగా కేసులలో నిందితులు తొలిసారి నేరస్తులే. ఇంటర్నెట్‌లో సినిమాలు, యూట్యూబ్‌లో చూసి నేరాలు చేస్తున్నారని పోలీసుల విచారణలో బయటపడుతున్నాయి.
జల్సాల కోసం..
పిల్లలు, పెద్దలు ఎవరినైనా సరే ‘ఫలానా వాణ్ని చూసి నేర్చుకో’ అంటుంటాం. దీన్నే కాస్త మార్చేసి సినిమాలు, యూట్యూబ్‌లలో చూసి నేరాలు ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల రవాణా, వాహనాల చోరీలు, చైన్ స్నాగింగ్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని నేరస్తులు భావిస్తున్నారు. అక్రమ సంపాదనతో గోవా, శ్రీలంక, మలేషియా, సింగపూర్, దుబాయ్‌లకు వెళ్లి జల్సాలు చేస్తుంటారు. జేబు ఖాళీ కాగానే మళ్లీ నేరాల బాట పడుతుంటారు. పోలీసుల చేతికి చిక్కి జైలుకెళ్లిన ప్రవర్తన మార్చుకోకపోగా.. పాత నేరస్తులతో పరిచయాలు చేసుకొని బయటికొచ్చాక కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసులకు దొరకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
కొత్త నేరగాళ్లు పుట్టుకొస్తున్నారు..
గతంలో ఎలాంటి నేరచరిత్ర లేని వాళ్లు కూడా నేరస్తులుగా మారుతున్నారు. వ్యక్తిగత కక్షలతో కొందరు, అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని మరికొందరు నేరస్తులుగా మారిపోతున్నారు. తొలిసారి నేరస్తులలో యువతే ఎక్కువగా ఉండటం దురదృష్టకరం. సాధారణంగా పాత నేరస్తులపై పోలీసులు నిఘా ఉంటుంది. జైలు నుంచి విడుదలయ్యాక వారి కదలికలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంటారు.
కొన్ని సందర్భాలలో నేరం జరగకముందే అడ్డుకునే అవకాశం ఉంటుంది. కొత్త నేరస్తుల విషయంలో అలా కుదరదు. వారు ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు నేరానికి పాల్పడతారో పసిగట్టడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో నేరాలలో కొత్త నేరస్తులు పుట్టుకొస్తున్నారు. రాత్రికి రాత్రే లక్షలు సంపాదించాలి, జల్సా చేయాలనే వక్రబుద్ధే కొత్త నేరగాళ్ల పుట్టుకకు కారణమని ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
చదవండి: Banjara Hills: సీఎం శిలాఫలకానికే దిక్కులేదు.. ఇప్పటికైనా సాధ్యమేనా..?
పాత నేరస్తుల అనుభవాలే పాఠాలుగా..
∙తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి, దర్జాగా విలాసవంతమైన జీవితాన్ని గడపాలి, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరగాలి.. నేరస్తులు ఎవరైనా ఇదే తరహా ఆలోచనే. నేరం చేయడానికి ఏ స్థాయిలో ప్రణాళికలు వేస్తున్నారో.. అంతకు రెట్టింపు స్థాయిలో నేరం చేశాక పోలీసులకు దొరకకుండా పథకం రచిస్తున్నారు. పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు నేరస్తులు పటిష్టమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఇందుకోసం తొలిసారి నేరస్తులు, పాత క్రిమినల్స్‌లో పరిచయాలు పెంచుకుంటున్నారు. వారి అనుభవాలను, పోలీసుల దర్యాప్తు, విచారణల గురించి ముందుగానే తెలుసుకొని రంగంలోకి దిగుతున్నారు. నేరం చేయడానికి ముందు ఇంటర్నెట్ ఆ తరహా నేరాలకు సంబంధించిన సినిమాలు, యూట్యూబ్‌లో వెతుకుతున్నారు. వాటిని చూసి పక్కాగా అమలుపరుస్తున్నారు. ఖరీదైన వాహనాల నుంచి కార్పొరేట్ మోసాల వరకూ నేరస్తులది ఇదే మార్గం. ఏటా నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో లక్షల్లోనే నేరాలు జరగుతున్నాయి. నేరగాళ్లను పట్టుకోవటం, జైలు శిక్షలు వేసినా సరే ఏటా నేరాల సంఖ్య 10–15 శాతం వరకు పెరుగుతోంది.
చదవండి: కోవిడ్ పోయింది.. హైబ్రిడ్ వచ్చింది!
Comments
Please login to add a commentAdd a comment