ఇన్నర్ రింగ్‌రోడ్డు ఊహా చిత్రం (ఇన్‌సెట్) రింగ్‌రోడ్డు మ్యాపు
ఎన్నికల సమయం దగ్గరపడుతోంది.. ప్రత్యేక హోదా విషయం సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.. ఇప్పటికే రాజధాని నిర్మాణం పేరుతో రైతులను దోపిడీ చేసింది.. తాజాగా ఇన్నర్ కల‘రింగ్’తో రైతులను కలవరపెడుతోంది.. విధివిధానాలు ప్రకటించలేదు.. కాని అభ్యంతరాల గడువు ముగిసింది. రెండు వారాలు కావస్తోంది.. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు.. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
తాడికొండ: ఇన్నర్ రింగ్ రోడ్డు కింద కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రభుత్వం 3,556.17 ఎకరాల భూములు తీసుకోనుంది. 42 గ్రామాలలో 27 అనుసంధాన లక్ష్యంగా పేర్కొంది. అందుకు సంబంధించిన ముసాయిదా విడుదల చేసింది. అభ్యంతరాలకు మార్చి 17 గడువు ముగిసింది. కాని విధి విధానాలు, సేకరణ– సమీకరణ అనే విషయంపై ఇంక స్పష్టత ఇవ్వలేదు.
గుట్టుచప్పడు కాకుండా మ్యాప్‌ల విడుదల
తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఫిబ్రవరి 17వ తేదీ గుట్టుచప్పుడు సీఆర్‌డీఏ మ్యాపులను విడుదల చేసింది. అనంతరం ఆన్‌లైన్‌లో అభ్యంతరాల స్వీకరణకు మార్చి 17 వరకు తుది గడువు విధించింది. రైతులు అంతగా స్పందించలేదు.
గ్రామసభలకు దూరంగా..
భూములు సేకరణ విషయంలో ముసాయిదాపై చర్చిందుకు గ్రామ సభలు నిర్వహించాల్సి ఉంది. కాని చర్యలేమీ తీసుకోలేదు. దీంతో ఈ వ్యవహారంపై అధికారులు సమాధానం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. అత్యధికంగా తాడికొండ మండలంలోనే 701.95 ఎకరాలలో భూములు కోల్పోనుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
ఖరీఫ్ పనులు ప్రారంభించాల్సి ఉండగా
సాధారణంగా వేసవి రాగానే రైతులు వ్యవసాయ పనులు చేపడుతుంటారు. వేసవి దక్కులు వేయించడం, శుభ్రం చేయించడం చేస్తుంటారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో రైలు కౌలు ఒప్పందాలు చేసుకునే సమయం ఇదే. కానీ ప్రభుత్వం ఏ సర్వే నెంబర్‌లో ఎంత భూమిని సేకరిస్తారు అనే దానిపై స్పష్టత ఇవ్వకపోవడం కారణంగా రైతులు పనులు చేసుకోవాలా వద్దా అనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు.
కోల్పోనున్న భూముల జాబితా ఇదే
ముసాయిదా ప్రకారం తుళ్ళూరు మండలం అనంతరవరంలో 11.43 ఎకరాలు, చినకాకాని 166.22, చినవడ్లపూడి 19.96, చోడవరం 85.90, దాములూరు 29.90, జేసీ ఆత్కూర్ 20.48, ఎండ్రాయి 10,59, గంగూరు 4.94, హరిశ్చంద్రపురం 100.51, ఇబ్రహీంపట్నం 7.17, జూపూడి 0.23, కంతేరు103.26, కర్లపూడి 150.47, కవులూరు 73,95, కాజా 112,47, కేతనకొండ 58.41, కొండపల్లె 95,40, కొండపల్లి సంరక్షిత అటవీ భూభాగం 100.66, కొటికలపూడి 36.94, కొత్తూరు 35.97, మోతడక 7.10, నవీపోతవరం 30.34, నిడమానూరు 71,56, నున్న 96.83, నూతక్కి 56.15, పాతపాడు 48.56, పెదపరిమి 662.49, పెదవడ్లపూడి 58.69, పెనమలూరు 48.85, పోరంకి 89.19, రామచంద్రాపురం(గన్నవరం) 5.23, రామచంద్రాపురం(మంగళగిరి) 55, సవరిగూడెం 18.71, కే.తాడేపల్లి 35.94, తాడికొండ 634.13, త్రిలోచనాపురం 20.15, తుమ్మపూడి 18.80, వడ్డమాను 174.16, వెదురుపావులూరు 132.70, వెలగలేరు 3.25, వైకుంఠపురం 60,97, జామి మాచవరం 3.31 ఎకరాలలో భూ సేకరణ చేయనున్నారు. అందులో ఇన్నర్ రింగ్ పేరిట 2,195.87 ఎకరాలు, అను సంధాన రహదారుల పేరిట 1,250.44 ఎకరాలు ప్రభుత్వం తీసుకొనుంది. సీఆర్‌డీఏ ప్రాంతంలో 75 మీటర్ల వెడల్పు, 96.16 కిలోమీటర్ల పొడవు ఈ రహదారి నిర్మాణం చేయనున్నారు.
స్పష్టత ఇవ్వకుండా ఇబ్బంది పెడితే ఎలా
రహదారులకు ప్రభుత్వం తీసుకునే భూములు సమీకరణా, సేకరణా అనే దానిపై స్పష్టత ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదు. ఏ సర్వే నెంబర్లలో ఎంత భూమిని తీసుకుంటారో కూడా రైతులకు తెలియజేయాలి. భయాందోళనలకు గురిచేస్తే ఎదుర్కొంటాం. రైతులు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నారు.– ఉయ్యూరు వెంకటరెడ్డి, రైతు, తాడికొండ
ఆన్‌లైన్ అభ్యంతరాలు సేకరణ విడ్డూరం
కోట్ల రూపాయల విలువైన భూములను కోల్పోతున్న రైతులు అభ్యంతరాలను కనీసం గ్రామసభలు కూడా నిర్వహించలేదు. ప్రభుత్వం ఆన్‌లైన్ అభ్యంతరాలు నమోదు చేయాలని కోరడం మంచిది కాదు. రైతులకు ఆన్‌లైన్‌లు ఎలా తెలుస్తాయి. ఇకనైనా స్పందించి గ్రామసభలు నిర్వహించి స్పష్టత ఇవ్వాలి. – చింతల భాస్కరరావు, సీపీఎం మండల కార్యదర్శి, తాడికొండ
Comments
Please login to add a commentAdd a comment