land collection
-
యజమాని అంగీకరిస్తేనే భూ సేకరణ!
సాక్షి, హైదరాబాద్: యజమానుల అంగీకారంతోనే భూ సేకరణ జరపాలన్న కీలక షరతుతో ఫార్మా సిటీ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ, అటవీ, పర్యావరణ మార్పుల శాఖ పర్యావరణ అనుమతులు జారీ చేసింది. నిర్వాసితులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని స్పష్టం చేసింది. దీంతో హైదరాబాద్ నగరంలో ఫార్మాసిటీ నిర్మాణంతో నూతన అధ్యాయానికి తెరలేవనుంది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల పరిధిలోని 19,333.20 ఎకరాల భారీ విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన ఈ పారిశ్రామికవాడ నిర్మాణంతో 5.6 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రభుత్వ అంచనా ప్రకారం.. ఫార్మా సిటీ ఔషధ ఉత్పత్తుల ద్వారా ఏటా రూ.1.4 లక్షల కోట్ల టర్నోవర్ సాధించడంతోపాటు రూ.58 వేల కోట్ల విలువైన ఔషధాలను విదేశాలకు ఎగుమతి చేయనుంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మించనున్న ఫార్మాసిటీ కోసం భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తోంది. రూ.16,784 కోట్ల అంచనా వ్యయంతో నిర్మి స్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా రూ.64 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని అంచనా వేసింది. హైదరాబాద్ నుంచి 298 కాలుష్య కారక ఔషధ పరిశ్రమలను ఫార్మా సిటీకి తరలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నివేదించింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నేతృత్వంలోని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఈ నెల 7న ఢిల్లీలో సమావేశమై.. ఫార్మా సిటీ ప్రాజెక్టుకు 18 షరతులతో కూడిన పర్యావరణ అనుమతులు జారీ చేయాలని సిఫారసులు చేసింది. 18 షరతులివీ.. ♦ పర్యావరణ పరిరక్షణ నిబంధనల అమలు బాధ్యత టీఎస్‌ఐఐసీదే. ♦ పరిహారం చెల్లించి భూయజమానుల అంగీకారంతోనే మిగులు భూ సేకరణ జరపాలి. ♦ భూ నిర్వాసితులకు సరైన శిక్షణ అందించి వారి నైపుణ్యాన్ని పెంపొందించి, ఫార్మా సిటీలో వారికి టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలి. ♦ ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతంలో ఇప్పటికే ఉన్న పరిశ్రమలు, ఆవాసాలను మరో ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించాలి. సాధ్యం కాకుంటే ప్రస్తుతమున్న జనా వాసాలు, పరిశ్రమల మధ్య కనీసం ఒక కిలోమీటర్ బఫర్ జోన్ ఏర్పాటు చేయాలి. ♦ ఫార్మాసిటీ నిర్మిత స్థలం, అడవుల మధ్య 100 మీటర్ల బఫర్ జోన్ ఏర్పాటు చేయాలి. ♦ జల వనరులు కలుషితం కాకుండా 100 మీటర్ల బఫర్ జోన్‌తో రక్షణ కల్పించాలి. ♦ ఫార్మా సిటీ ప్రతిపాదిత ప్రాంతానికి 5 కి.మీల పరిధిలో ఉన్న గ్రామాల్లో వార్షిక ఆరోగ్య సర్వే నిర్వహించాలి. గ్రామస్తులకు వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవాలి. ♦ బాయిలర్ల కోసం సహజ వాయువులనే వినియోగించాలి. మీథేన్ వాయువుల ఉద్గారాన్ని నిరంతరంగా సమీక్షిస్తుండాలి. ♦ భూ ఉపరితల జలాలు, భూగర్భ జలాల నాణ్యతలపై క్రమం తప్పకుండా సమీక్షలు జరిపి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయం, పీసీబీలకు త్రైమాసిక నివేదికలు సమర్పించాలి. ♦ ఫార్మా సిటీ అవసరాలకు భూగర్భ జలాలను వినియోగించరాదు. ♦ కేంద్ర/రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో ఎప్పటికప్పుడు గాలి, నీటి నాణ్యతల సమాచారాన్ని తెలిపే ఆన్లైన్ సమీక్షల విధానాన్ని ఏర్పాటు చేయాలి. ♦ అటవీ శాఖతో సంప్రదింపులు జరిపి రిజర్వు ఫారెస్టు సంరక్షణ ప్రణాళిక అమలు చేయాలి. మూడేళ్లలో రూ.28.22 కోట్లు ఖర్చు చేసేలా చూడాలి. పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ)లో భాగంగా ప్రతిపాదించిన ఖర్చులకు ఇది అదనం. అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కోసం టీఎస్ఐఐసీ, అటవీ శాఖతోపాటు ఈ అంశంలో అవగాహన కలిగిన 2 జాతీయ గుర్తింపున్న స్వచ్ఛంద సంస్థలతో కమిటీ ఏర్పాటు చేయాలి. పర్యావరణం, కాలుష్యంపై సమీక్షల కోసం మరో కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ రెండు కమిటీలు ఏడాదికి కనీసం రెండుసార్లు సమావేశమై పర్యావరణ మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించాలి. ♦ రాష్ట్ర భూగర్భ జల శాఖ సహకారంతో ప్రాజెక్టు ప్రాంతంలో పీజోమీటర్లు ఏర్పాటు చేయాలి. భూగర్భ జలాల నాణ్యతలను త్రైమాసికంగా పరీక్షించి పర్యావరణ శాఖకు నివేదిక సమర్పించాలి. ♦ ఫార్మా సిటీకి 5 కి.మీల పరిధిలో ఉన్న పంట పొలాల స్థితిగతులు, దిగుబడులపై వార్షిక అధ్యయనం జరిపి పర్యావరణ శాఖకు నివేదిక సమర్పించాలి. ♦ సిటీ మూడో విడతలో ఆరెంజ్, గ్రీన్, వైట్ కేటగిరీల పరిశ్రమలనే ఏర్పాటు చేయాలి. ♦ ఫార్మా సిటీలోని ప్రతి పరిశ్రమ సొంత వ్యర్థాల శుద్ధి కర్మాగారం (ఈటీపీ) ఏర్పాటు చేసుకునే విధంగా సంబంధిత నియంత్రణ సంస్థ చర్యలు తీసుకోవాలి. ఫార్మా సిటీలోని కేంద్ర వ్యర్థాల శుద్ధి ప్లాంట్‌పై ఒత్తిడి పెరగకుండా బల్క్ ఔషధాలు, రసాయన మిశ్రమాల ఉత్పత్తి పరిశ్రమలు ఈటీపీలు ఏర్పాటు చేయాలి. ♦ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలి. సరైన విరుగుడు మందులతోనే రసాయనాల రవాణా జరపాలి. రసాయ నాలు రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేయాలి. పర్యావరణ పరిరక్షణ నివేదికలో పేర్కొన్నట్టు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి -
అంతా కల'రింగే'
ఎన్నికల సమయం దగ్గరపడుతోంది.. ప్రత్యేక హోదా విషయం సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.. ఇప్పటికే రాజధాని నిర్మాణం పేరుతో రైతులను దోపిడీ చేసింది.. తాజాగా ఇన్నర్ కల‘రింగ్’తో రైతులను కలవరపెడుతోంది.. విధివిధానాలు ప్రకటించలేదు.. కాని అభ్యంతరాల గడువు ముగిసింది. రెండు వారాలు కావస్తోంది.. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు.. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తాడికొండ: ఇన్నర్ రింగ్ రోడ్డు కింద కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రభుత్వం 3,556.17 ఎకరాల భూములు తీసుకోనుంది. 42 గ్రామాలలో 27 అనుసంధాన లక్ష్యంగా పేర్కొంది. అందుకు సంబంధించిన ముసాయిదా విడుదల చేసింది. అభ్యంతరాలకు మార్చి 17 గడువు ముగిసింది. కాని విధి విధానాలు, సేకరణ– సమీకరణ అనే విషయంపై ఇంక స్పష్టత ఇవ్వలేదు. గుట్టుచప్పడు కాకుండా మ్యాప్‌ల విడుదల తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఫిబ్రవరి 17వ తేదీ గుట్టుచప్పుడు సీఆర్డీఏ మ్యాపులను విడుదల చేసింది. అనంతరం ఆన్లైన్లో అభ్యంతరాల స్వీకరణకు మార్చి 17 వరకు తుది గడువు విధించింది. రైతులు అంతగా స్పందించలేదు. గ్రామసభలకు దూరంగా.. భూములు సేకరణ విషయంలో ముసాయిదాపై చర్చిందుకు గ్రామ సభలు నిర్వహించాల్సి ఉంది. కాని చర్యలేమీ తీసుకోలేదు. దీంతో ఈ వ్యవహారంపై అధికారులు సమాధానం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. అత్యధికంగా తాడికొండ మండలంలోనే 701.95 ఎకరాలలో భూములు కోల్పోనుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఖరీఫ్ పనులు ప్రారంభించాల్సి ఉండగా సాధారణంగా వేసవి రాగానే రైతులు వ్యవసాయ పనులు చేపడుతుంటారు. వేసవి దక్కులు వేయించడం, శుభ్రం చేయించడం చేస్తుంటారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో రైలు కౌలు ఒప్పందాలు చేసుకునే సమయం ఇదే. కానీ ప్రభుత్వం ఏ సర్వే నెంబర్లో ఎంత భూమిని సేకరిస్తారు అనే దానిపై స్పష్టత ఇవ్వకపోవడం కారణంగా రైతులు పనులు చేసుకోవాలా వద్దా అనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. కోల్పోనున్న భూముల జాబితా ఇదే ముసాయిదా ప్రకారం తుళ్ళూరు మండలం అనంతరవరంలో 11.43 ఎకరాలు, చినకాకాని 166.22, చినవడ్లపూడి 19.96, చోడవరం 85.90, దాములూరు 29.90, జేసీ ఆత్కూర్ 20.48, ఎండ్రాయి 10,59, గంగూరు 4.94, హరిశ్చంద్రపురం 100.51, ఇబ్రహీంపట్నం 7.17, జూపూడి 0.23, కంతేరు103.26, కర్లపూడి 150.47, కవులూరు 73,95, కాజా 112,47, కేతనకొండ 58.41, కొండపల్లె 95,40, కొండపల్లి సంరక్షిత అటవీ భూభాగం 100.66, కొటికలపూడి 36.94, కొత్తూరు 35.97, మోతడక 7.10, నవీపోతవరం 30.34, నిడమానూరు 71,56, నున్న 96.83, నూతక్కి 56.15, పాతపాడు 48.56, పెదపరిమి 662.49, పెదవడ్లపూడి 58.69, పెనమలూరు 48.85, పోరంకి 89.19, రామచంద్రాపురం(గన్నవరం) 5.23, రామచంద్రాపురం(మంగళగిరి) 55, సవరిగూడెం 18.71, కే.తాడేపల్లి 35.94, తాడికొండ 634.13, త్రిలోచనాపురం 20.15, తుమ్మపూడి 18.80, వడ్డమాను 174.16, వెదురుపావులూరు 132.70, వెలగలేరు 3.25, వైకుంఠపురం 60,97, జామి మాచవరం 3.31 ఎకరాలలో భూ సేకరణ చేయనున్నారు. అందులో ఇన్నర్ రింగ్ పేరిట 2,195.87 ఎకరాలు, అను సంధాన రహదారుల పేరిట 1,250.44 ఎకరాలు ప్రభుత్వం తీసుకొనుంది. సీఆర్డీఏ ప్రాంతంలో 75 మీటర్ల వెడల్పు, 96.16 కిలోమీటర్ల పొడవు ఈ రహదారి నిర్మాణం చేయనున్నారు. స్పష్టత ఇవ్వకుండా ఇబ్బంది పెడితే ఎలా రహదారులకు ప్రభుత్వం తీసుకునే భూములు సమీకరణా, సేకరణా అనే దానిపై స్పష్టత ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదు. ఏ సర్వే నెంబర్లలో ఎంత భూమిని తీసుకుంటారో కూడా రైతులకు తెలియజేయాలి. భయాందోళనలకు గురిచేస్తే ఎదుర్కొంటాం. రైతులు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నారు.– ఉయ్యూరు వెంకటరెడ్డి, రైతు, తాడికొండ ఆన్లైన్ అభ్యంతరాలు సేకరణ విడ్డూరం కోట్ల రూపాయల విలువైన భూములను కోల్పోతున్న రైతులు అభ్యంతరాలను కనీసం గ్రామసభలు కూడా నిర్వహించలేదు. ప్రభుత్వం ఆన్లైన్ అభ్యంతరాలు నమోదు చేయాలని కోరడం మంచిది కాదు. రైతులకు ఆన్లైన్లు ఎలా తెలుస్తాయి. ఇకనైనా స్పందించి గ్రామసభలు నిర్వహించి స్పష్టత ఇవ్వాలి. – చింతల భాస్కరరావు, సీపీఎం మండల కార్యదర్శి, తాడికొండ -
ఏపీ ప్రభుత్వానికి ఝలక్
సాక్షి, హైదరాబాద్ : ఏపీ రాజధాని రైతులకు ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టులో ఊరట లభించింది. ప్రభుత్వం రాజధాని భూసేకరణకు అవార్డు జారీ చేయకుండా స్టే విధిస్తూ మంగళవారం కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. పెనుమాక, బేతపూడి, నవులూరు, కురగల్లు గ్రామాల రైతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. వీరి తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు ప్రభుత్వం భూసేకరణ అవార్డు చేపట్టకుండా స్టే విధించింది. రెండు వారాల్లో పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది. -
అనుమతి తప్పనిసరి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అటవీ ప్రాంతాల్లో చేపట్టే పనులకు ఆ శాఖ అనుమతి తప్పనిసరిగా పొందాలని కలెక్టర్ అహ్మద్ బాబు అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఇంజినీరింగ్ శా ఖల ద్వారా చేపడుతున్న పనుల ఫొటోలు వెంట తీసుకురావాలని చెప్పినా ఎందుకు తేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో సర్వేయర్ల కొరత ఉందని, ఇతర జిల్లాల నుంచి డెప్యుటేషన్‌పై పనిచేసేందుకు ఎ వరూ ముందుకు రావడం లేదని తెలిపారు. జేసీ, అదనపు జేసీ పోస్టులు ఖాళీగా ఉండడంతో భూ సేకరణ ఫైళ్ల పరిష్కారానికి ఆటంకం కలుగుతోందని చెప్పా రు. కమ్యూనిటీ సర్వేయర్ల ద్వారా పనులు చేపట్టాలని సూచించారు. ఆరు విడతలుగా చేపట్టిన భూ పంపిణీలో కొందరు లబ్ధిదారులకు భూములు చూపలేదని, ఆయూ భూములను ఆర్డీవోలు పరిశీలించాలని ఆదేశించారు. భూ సేకరణకు ప్రైవేట్ భూములు సేకరిస్తే నిధులు ముందుగానే సమకూర్చాలన్నారు. సమావేశంలో డీఆర్వో ఎస్ఎస్.రాజు, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్డీవోలు సుధాకర్‌రెడ్డి, రామచంద్రారావు, చక్రధర్, ల్యాండ్ సర్వే ఏడీ ఇనేశ్, రెవెన్యూ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఆర్ అండ్ ఆర్‌పై సమీక్ష.. రీ హ్యాబిటేషన్, రీ సెటిల్మెంట్పై కలెక్టర్ అహ్మద్ బాబు మంగళవారం తన కార్యాలయంలో సమీక్ష స మావేశం నిర్వహించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముం పునకు గురైన బాధితులకు నష్టపరిహారం పంపిణీ తీరును అడిగి తెలుసుకున్నారు. మంచిర్యాల మం డలం గుడిపేట, రాపల్లి, నంనూర్ ముంపు బాధితులకు పరిహారం పంపిణీపై ఆరా తీశారు. గుడిపేట, రాపల్లి బాధితులకు పరిహారం చెల్లించామని, నంనూర్ బాధితుల్లో కొందరికి చెల్లించాల్సి ఉందని అధికారులు బదులిచ్చారు. గుడిపేట బాధితులకు పునరావాస చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మిగి లిన బాధితులందరికీ త్వరగా పరిహారం అందించి పునరావాసం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, డీఆర్వో ఎస్ఎస్.రాజు, ఆర్డీవోలు చక్రధర్, సుధాకర్‌రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ ఉమామహేశ్వర్రావు, అటవీశాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. నూతన గ్రీవెన్స్ హాల్ పరిశీలన కలెక్టరేట్ సమావేశ మందిరం పక్కన కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫిర్యాదుల విభాగం హాల్‌ను కలెక్టర్ అహ్మద్‌బాబు పరిశీలించారు. సౌకర్యాలను పరిశీలించారు. హాల్లో తొమ్మిది కౌంటర్లు ఏర్పాటు చేసే వీలు ఉందని అధికారులు తెలిపారు. ఆయన వెంట డీఆర్వో ఎస్ఎస్.రాజు, సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్డీవోలు సుధాకర్‌రెడ్డి, చక్రధర్ ఉన్నారు.