‘చలో అమరావతి’పై ఉత్కంఠ
‘చలో అమరావతి’పై ఉత్కంఠ
Published Mon, Jul 24 2017 1:17 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదంటున్న ప్రభుత్వం
- ఆరునూరైనా నిర్వహించి తీరుతామని కాపు నేతల స్పష్టీకరణ
- కొనసాగుతున్న తనిఖీలు, అరెస్టులు, నోటీసులు, హెచ్చరికలు
- తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి, రాజమహేంద్రవరం/గుంటూరు: కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన ‘చావోరేవో.. చలో అమరావతి’ పాదయాత్రకు మరో రెండు రోజులే మిగిలి ఉండడంతో రాష్ట్రంలో ఉత్కంఠ పెరిగిపోతోంది. పాదయాత్రకు అనుమతి లేదని ప్రభుత్వం చెబుతుండగా, ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్వహించి తీరుతామని కాపు జేఏసీ నేతలు పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. ముద్రగడ సొంత జిల్లా తూర్పు గోదావరితోపాటు గుంటూరు జిల్లాలో పోలీసులు ఆంక్షలను తీవ్రతరం చేశారు. ఎక్కడికక్కడ నిర్బంధాలు, తనిఖీలు, అరెస్టులు, నోటీసులు, హెచ్చరికలతో వాతావరణం వేడెక్కుతోంది. ఈ నెల 26వ తేదీన స్వగ్రామం కిర్లంపూడిలో పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కిర్లంపూడితోపాటు తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. కాపు జేఏసీ నేతలు ఆదివారం కిర్లంపూడిలో సమావేశమయ్యారు. పాదయాత్ర జరిపి తీరుతామని ప్రకటించారు.
పోలీసుల దిగ్బంధంలో కిర్లంపూడి
ముద్రగడ సొంత ఊరు కిర్లంపూడిని పోలీసులు ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ రెండు వేల మంది పోలీసులు మోహరించారు. గ్రామంలోకి వచ్చే అన్ని రహదారులను దిగ్బంధించారు. ముద్రగడ ఇంటి ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాను ఆయన ఇంటిపై తరచూ తిప్పుతూ అక్కడి పరిస్థితిని రికార్డు చేస్తున్నారు. మీడియా ప్రతినిధులను ముద్రగడ నివాసంలోకి వెళ్లనివ్వడం లేదు.
జిల్లావ్యాప్తంగా కవాతులు
పాదయాత్రకు సమయం దగ్గర పడడంతో పోలీసులు జిల్లాలోని సున్నిత ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. ఆదివారం వందలాది మంది పోలీసులు సామర్లకోట, ఉప్పలగుప్తం, ద్రాక్షారామం తదితర ప్రాంతాల్లో కవాతు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 500 మందిని బైండోవర్ చేశారు.
కాపులు నక్సలైట్లా? తీవ్రవాదులా?
ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్ర ఆగదని కాపు జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం ముద్రగడతో సమావేశం అనంతరం కాపు నేతలు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు తదితరులు విలేకరులతో మాట్లాడారు. గాంధేయ మార్గంలో శాంతియుతంగా పాదయాత్ర చేస్తామని చెప్పినా ప్రభుత్వం అణచివేత చర్యలకు దిగుతోందని ధ్వజమెత్తారు.కాపులు నక్సలైట్లా? తీవ్రవాదులా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ధోరణి మార్చుకోకపోతే భవిష్యత్తులో కాపు జాతి తిరగబడటానికి సిద్ధంగా ఉందని హెచ్చరించారు.
కాపు నేతలను కట్టడి చేస్తున్న పోలీసులు
పాదయాత్రలో కాపులు పాల్గొనకుండా ప్రభుత్వం కట్టడి చేస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలో పోలీసులు ఆంక్షలను పెంచారు. జిల్లాలోని కాపు సంఘం నేతలపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. జిల్లావ్యాప్తంగా గత నాలుగు రోజులుగా 50కి పైగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.
5 వేల మందితో బందోబస్తు
గుంటూరు అర్బన్, రూరల్ జిల్లాల పరిధిలో ఐదు వేల మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు నుంచి విజయవాడకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ కాపు రిజర్వేషన్ సాధికార కమిటీ చైర్మన్ ఊరిబండి శ్రీకాంత్‌తో పాటు 15 మంది కాపు నేతలను ఆదివారం నగరపాలెం పోలీసులు అరెస్టు చేశారు. ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రకు ఎలాంటి అనుమతులు లేవని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడు స్పష్టం చేశారు. రూరల్ జిల్లా పరిధిలో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కాపు నేతలు, ట్రావెల్స్ యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. తుని ఘటన ఫొటోలను ఈ సందర్భంగా ఎస్పీ మీడియాకు చూపించారు.
Advertisement
Advertisement