ట్రైమెక్స్ మైనింగ్ కార్యకలాపాల నిలిపివేతపై స్టే
సాక్షి, హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లాలో ట్రైమెక్స్ శాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టిన బీచ్ శాండ్ తవ్వకాల నిలిపివేత వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ జిల్లాలోని గార మండలం వత్సవలస, తోనంగి పరిధిలోని 387 ఎకరాల్లో అనుమతులు లేకుండా బీచ్ శాండ్ తవ్వకాలు చేపట్టి, అక్రమ ఎగుమతులు చేశారంటూ ట్రైమెక్స్ మైనింగ్ కార్యకలాపాలను నిలిపేస్తూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన మెమో అమలుపై తాత్కాలిక స్టే విధించింది.
ప్రభుత్వం ఎత్తిచూపిన ఉల్లంఘనలను సరిదిద్దుకునేందుకు నిబంధనల ప్రకారం 60 రోజుల నోటీసును జారీ చేయనందున మెమో అమలును నిలిపేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.