
'రేషన్‌కార్డుల రద్దుకు రహస్య ఎజెండా'
విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు రద్దుచేసేందుకు రహస్య ఎజెండా రూపొందించిందని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు. ఆదివారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రేషన్ డీలర్ల రిలేదీక్షా శిబిరాన్ని ఆయన సంద ర్శించి సంఘీభావం తెలిపారు. రఘువీరా మీడియాతో మాట్లాడుతూ ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు, పేదప్రజలకు రేషన్ ఎగ్గొట్టేందుకు టీడీపీ ప్రభుత్వం రకరకాల ప్రయోగాలు చేస్తోందన్నారు. ఈ-పోస్ విధానం ద్వారా అధికారులు దొంగలెక్కలు చూపించి రాష్ట్రంలో కోటి రేషన్ కార్డులు రద్దుచేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. రానున్న కాలంలో తెల్లకార్డులను ఎత్తివేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోందని పేర్కొన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్‌ను వ్యతిరేకించిన టీడీపీ నేతలు ఇప్పుడు ఆధార్ ద్వారా సంక్షేమ పథకాలకు కోత విధించే కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆహార భద్రత చట్టం కోసం ఆందోళన చేస్తున్న రేషన్ డీలర్లకు తమ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు మండాది వెంకట్రావు, జొన్నలగడ్డ శ్రీనివాసరావు తమ సమస్యలపై రఘువీరారెడ్డికి వినతిపత్రం అందజేశారు.