పాపం పసివాళ్లు
Published Tue, Dec 3 2013 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM
అతి చిన్నదైన జీవితాన్ని ఆనందంగా గడపటం చేతకాక ఎన్నో కుటుంబాలు ‘చితికి’పోతున్నాయి. అనుమానం పెనుభూతమై జీవితాలను అంతం చేసుకుంటున్నాయి. ఆ.. ఒక్క క్షణం ఓపిక పడితే ముందంతా బంగరు జీవితం వుందనే విషయాన్నే మరుస్తున్నారు. చివరకు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన చిన్నారుల భవిష్యత్‌ను సైతం అంధకారం చేస్తున్నారు. అనాథలుగా మారుస్తున్నారు.
సాక్షి, నరసరావుపేట :భార్యలపై అనుమానంతో భర్తలు అతి దారుణంగా హత్యలు చేస్తుంటే... క్షణికావేశంలో భార్యలు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక్క విషయాన్ని పెద్దలు ఆలోచించడం లేదు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తమ బిడ్డల భవిష్యత్ ఏమిటన్నది వారికే అర్థం కాకుండా ఉంది. కళ్ల ముందే కన్నతల్లి రక్తపు మడుగులో ప్రాణం వదులుతుంటే, తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకొని జైలుకు తరలిస్తుంటే ఆ పసి హృదయాలు తల్లడిల్లిపోతున్నాయి. సమాజంలో కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లలను భారంగా భావిస్తూ మానసిక పరిపక్వత రాకముందే బాల్య వివాహాలు చేస్తూ తమ బాధ్యత తీరిపోయిందని భావిస్తున్నారు. చిన్న వయస్సులో కుటుంబ భారం మీద పడి ఏది మంచి, ఏది చేడో తెలియక అనాలోచిత నిర్ణయాలతో తమ జీవితాలను బుగ్గిపాలు చేసు కుంటున్నారు.
క్షణికావేశాలకు లోనై భార్యలను సైతం చంపడానికి భర్తలు వెనుకాడకపోవడం లేదా భార్యలు బిడ్డలు ఏమైపోతారోననే ఆలోచన లేకుండా ఆత్మహత్యలకు పాల్పడటం వంటి సంఘటనలతో చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు దూరమై ఎందరో చిన్నారులు అనాథలుగా మారి దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. నరసరావుపేట పట్టణం ఏనుగుల బజారులో శనివారం జరిగిన సంఘటన పరిశీలిస్తే.. కోపర్తి వెంకటరమణ తన కుమార్తె సీతారావమ్మ అలియాస్ విజయలక్ష్మికి15 ఏళ్ళ వయసులోనే గురజాల మండలం చ ర్లగుడిపాడుకు చెందిన తంగెళ్ల సత్యనారాయణరాజుకు ఇచ్చి వివాహం చేసింది. పెళ్లయిన ఏడాదికి వారికి ఓ పాప. ఆ తరువాత రెండేళ్లకు ఓ బాబు పుట్టారు.
కొద్దిరోజులకు దంపతుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకుని విజయలక్ష్మి పుట్టింటిని ఆశ్రయించింది. భార్యను కాపురానికి పంప లేదని అత్తపైనా, పిల్లలను తనకు దూరం చేసిందని భార్యపైన కక్ష పెంచుకున్న సత్యనారాయణ రాజు శనివారం సాయంత్రం అత్తారింటికి చేరుకున్నారు. ఇంటి ముందు శుభ్రం చేస్తున్న భార్యపై కత్తితో దాడి చేశాడు. అడ్డువచ్చిన అత్తను సైతం హతమార్చేందుకు ప్రయత్నించగా ఆమె పరారైంది. ఈ సంఘటనను అక్కడే వుండి చూసిన వారి చిన్నారులు భీతిల్లిపోయారు. రక్తపుమడుగులో ఉన్న తల్లిని చూసి చిన్నారులు రోదిస్తున్న తీరు అక్కడవున్న వారిచేత కంట తడిపెట్టించింది. తల్లి మృతి చెందడం, తండ్రి జైలుకు వెళ్లడంతో చిన్నారులు అనాథలుగా మారారు.
మరో సంఘటనలో...
రొంపిచర్ల మం డలం మాచవరంలో మద్యానికి బానిసైన బొడ్డు బొల్లయ్య అనే వ్యక్తి మందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో భార్యపై దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. తల్లి మృతి చెందడం, తండ్రి పరారీలో ఉండటంతో ఏడాదిన్నర వయసు వున్న వారి పాప అనాథగా మిగి లింది. జిల్లాలో నెలకు ఒకటి చొప్పున జరుగుతున్న ఈ తరహా సంఘటనలకు క్షణికావేశమే కారణమని మానసిక వైద్యులు విశ్లేషిస్తున్నారు.
Advertisement