ఇంటి నుంచే స్వచ్ఛభారత్
పోట్లదుర్తి(ఎర్ర గుంట్ల) : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడి, రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వారి ఇంటి నుంచే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కెవీ రమణ పిలుపు నిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు సాధికారిత సదస్సులో పాల్గొని రైతులకు రుణ విముక్తి పత్రాలను అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపధ్యంలో ఆర్థిక కష్టాలు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అర్హులైన రైతులందరికీ రుణ మాఫీ చేశారన్నారు. కొన్ని సాంకేతిక సమస్యల వల్ల కొందరికి మొదటి విడతలో రాలేదని వారికీ త్వరలోనే వస్తాయన్నారు. ఈ రుణ మాఫీ కింద జిల్లాలో సుమారు 2,78,000 మంది రైతులకు రూ.316 కోట్లు రుణ మాఫీ వర్తించిందన్నారు.
రుణ మాఫీలో అవకతవకలు ఉంటే మళ్లీ సర్వే చేసి రైతులందరికీ వర్తించేలా జిల్లా వ్యాప్తంగా మూడు స్థాయిలలో కమిటీలు వేశామన్నారు. మండల స్థాయిలో తహశీల్దార్, డివిజనల్ స్థాయిలో ఆర్డీఓ, జిల్లా స్థాయిలో కలెక్టర్ అందులో ఉంటారన్నారు. రైతులకు ఇబ్బందులు ఉంటే ఆయా కమిటిలకు ఆర్జీలు చేసుకోవచ్చన్నారు. కొత్త పింఛన్‌లను రెండు నెలలో విడుదల చేస్తామన్నారు. జనవరి నుంచి పింఛన్లును పోస్టల్ ద్వారా పంపిణి చేస్తామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడీ జ్ఙానేశ్వర్, గ్రామ సర్పంచ్ వెంకటరంగయ్య యాదవ్, ఎంపీటీసీ సభ్యురాలు శిరీషా, తహశీల్దార్ బి మహేశ్వరరెడ్డి, వ్యవసాయ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ సీఎం సురేష్‌నాయుడు, ఈఓపీఆర్డీ శివకుమారితో పాటు రైతులు పాల్గొన్నారు.
ఉద్యాన పంటల సాగుకు సబ్సిడీ...
తిప్పలూరు గ్రామ సమీపంలోని పాలిహౌస్‌లోని బ్రిటిస్ దోస ఉద్యాన పంట సాగును మంగళవారం జిల్లా కెవీ రమణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యాన పంటల సాగు చేసుకోవడానికి రైతులు ముందుకు వస్తే ప్రభుత్వ 50 శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఇలాంటివి 11 యూనిట్లు ఉన్నాయన్నారు. ఉద్యాన పంట సాగు ఎంతో లాభసాటి అని ఉద్యాన శాఖ ఆసిస్టెంట్ డెరైక్టర్ మధుసూదన్‌రెడ్డి అన్నారు.
రూల్స్‌ను కాదని పోట్లదుర్తికి అనుమతి..
పోట్లదుర్తి గ్రామంలోని కళ్యాణ మండపంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ సందర్శించి మహిళలతో మట్లాడారు. పోట్లదుర్తి గ్రామంలో ఉన్న ఈ కుట్టు మిషన్ యూనిట్ మున్సిపాలిటీలలో ఉండాలన్నారు. కానీ సీఎం రమేష్‌నాయుడు చెప్పడంతో రూల్స్‌ను కాదని ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశామని, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
స్కూల్ యూనిఫాం కుట్టడమే కాకుండా మహిళలే స్వయంగా మార్కెటింగ్ చేసుకోవాలని అన్నారు. అన్ని అధికారులే చూడలాంటే సాధ్యం కాదన్నారు. జీతాలు ఆలస్యంగా ఇస్తున్నారని, ఇలా అయితే మా కుటుంబాలు గడవడం కష్టంగా ఉంటుందని ఓ మహిళ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో మెప్మా పీడీ వెంకటసుబ్బయ్య, మండల ప్రత్యేక అధికారి మధుసూదన్‌రెడ్డి, తహ శీల్దార్ బి మహేశ్వరరెడ్డి, సర్పంచ్ వెంకటరంగయ్య యాదవ్, టీడీపీ నేత సురేష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పి వెంకటాపురంలోని స్థలం పరిశీలన ...
పి.వెంకటాపురంలో ప్రభుత్వం ఏర్పాటు చేయునున్న సోలార్ విద్యుత్ ప్లాంట్‌కు సంబంధించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ కెవీ రమణ పరిశీలించారు. దీనిపై పూర్తి వివరాలు పంపించాలని తహశీల్దార్‌ను ఆయన ఆదేశించారు.
పోట్లదుర్తి వసతి గృహం పరిశీలన
పోట్లదుర్తిలో ఉన్న ప్రభుత్వ ఎస్సీ వసతి గృహాన్ని మంగళవారం కలెక్టర్ కెవీ రమణ పరిశీలించారు. వసతి గృహంలో రూ.3 లక్షలతో ఏర్పాటు చేసిన సోలార్ వాటర్ ప్లాంట్‌ను పరిశీలించారు. అనంతరం వంట గదిని, విద్యార్థుల స్టడీ గదలును పరిశీలించారు. వార్డన్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.