swacha bharat
-
వందే భారత్ రైళ్లలో ఇది పరిస్థితి.. భారతీయ రైల్వేస్ రిక్వెస్ట్
Viral News: ఇతర దేశాల్లో బుల్లెట్ ట్రైన్లు, మాగ్నటిక్ బుల్లెట్ ట్రైన్ల టెక్నాలజీతో రైల్వే రంగాలు దూసుకుపోతున్నాయి. మన దగ్గర అంతస్థాయిలో కాకపోయినా మెట్రో, ఈ మధ్యకాలంలో వందే భారత్ లాంటి సెమీ స్పీడ్ రైళ్లను పట్టాలెక్కించింది కేంద్రం. అయితే.. భారత్‌లో ఇప్పటిదాకా హైక్లాస్ రైలుగా వందే భారత్ ఓ ఫీట్ సాధించగా.. వసతులు, ఆధారంగా భూతల విమానంగా అభివర్ణిస్తున్న వందే భారత్ రైలులో పరిస్థితి ఇది అంటూ తాజాగా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వందే భారత్ రైలు కంపార్ట్మెంట్లో మొత్తం వాటర్ బాటిళ్లు, చెత్తా చెదారం, కవర్లు నిండిపోయి ఉన్నాయి. ఓ వర్కర్ దానికి శుభ్రం చేస్తుండగా తీసిన ఫొటో ఇది. ఐఏఎస్ అధికారి అవానిష్ శరణ్ తన ట్విటర్లో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. పైగా ‘వీ ద పీపుల్’ అంటూ మన జనాల్లోని కొందరి మైండ్ సెట్‌ను ఉదాహరించారాయన. “We The People.” Pic: Vande Bharat Express pic.twitter.com/r1K6Yv0XIa — Awanish Sharan (@AwanishSharan) January 28, 2023 ఆయన పోస్ట్‌కు రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ప్లాస్టిక్ నిషేధం లేన్నన్నాళ్లూ ఇలాంటి పరిస్థితి తప్పదంటూ కొందరు.. జనాలకు స్వీయ శుభ్రత అలవడితేనే పరిస్థితి మారుతుందంంటూ మరికొందరు.. ఏది ఏమైనా మన దేశంలో ఇలాంటి పరిస్థితిలో మార్పురాదని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఓవైపు చెత్తాచెదారం శుభ్రం చేశాక కూడా.. సిబ్బంది ముందే చెత్తా పారబోస్తున్నారు. వందే భారత్ రైళ్లు గమ్యస్థానం నుంచి ప్రారంభం అయ్యే లోపే ప్రయాణికులు వేస్తున్న చెత్తాచెదారంతో నిండిపోతోందని సిబ్బంది వాపోతున్నారు. ఇదిలాఉంటే సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే వందేభారత్ రైలులో చెత్తాచెదారం దర్శనమివ్వగా.. దయచేసి శుభ్రతను పాటించాలంటూ భారతీయ రైల్వేస్ సంస్థ వందేభారత్ ప్రయాణికులకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల వైఖరి, మనస్తతత్వం మారనంత కాలం.. స్వచ్ఛ భారత్ సాధించడం కష్టం. కాబట్టి, మెరుగైన సేవలను అందుకోవడానికి రైల్వేస్‌తో సహకరించండి. దయచేసి చెత్తచెదారం వేయకండి. డస్ట్బిన్లలోనే చెత్త వేయండంటూ అంటూ ప్రకటనలో పేర్కొంది భారతీయ రైల్వేస్. హైక్లాస్ రైలు.. అత్యాధునిక, సాంకేతిక వ్యవస్థలతో పనిచేసే వందే భారత్ రైళ్లలో.. విమానాల్లో మాదిరి ఇంటీరియర్ కనిపిస్తుంది. కోచ్‌లన్నీ ఫ్లైట్ ఇంటీరియర్‌తో పోలి ఉంటాయి. సీటింగ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఆటోమేటిక్ డోర్లు ఉండటమే కాక అవన్నీ రొటేట్ అవుతుంటాయి. సీట్ల వద్ద ఉండే బటన్ ప్రెస్ చేసి ఎవరితోనైనా మాట్లాడవచ్చు. సీసీ కెమెరాలుంటాయి. ప్రయాణికుల కదలికలను సెంట్రల్ స్టేషన్ నుంచి మానిటరింగ్ చేస్తారు. భద్రతకు ప్రాధాన్యత.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా భద్రతా వ్యవస్థ సత్వరం స్పందిస్తుంది. ఎమర్జన్సీ అలారం ఉంటుంది. మరుగుదొడ్లు స్టార్ హోటల్లో ఉన్నట్టుగా తలపిస్తాయి. ఇంజిన్ కాక్‌పిట్ అత్యద్భుతంగా ఉంటుంది. ఈ-డిస్‌ప్లేలుంటాయి. గంటకు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకుపోయినా గ్లాసులో వాటర్ ఒలకదు. గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సగటు వేగం 88 కిలోమీటర్ల మేర ఉంటుంది. సున్నితంగా ఉంటుంది ఈ రైలులో ప్రయాణం. -
పీఎస్‌లలో శుభ్రత పాటించాలి
మోమిన్‌పేట : పోలీస్ స్టేషన్లో పరిశుభ్రత పాటించాలని ఎస్పీ అన్నపూర్ణ సిబ్బందికి సూచించారు. పీఎస్‌ల వార్షిక తనిఖీల్లో భాగంగా డీఎస్పీ శిరీషతో కలిసి సోమవారం ఆమె మోమిన్‌పేట స్టేషన్‌ను సందర్శించారు. పీఎస్‌లోని రికార్డులను పరిశీలించారు. స్టేషన్ ఆవరణలో కలియతిరిగి ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని.. సీఐ శ్రీనివాస్, ఎస్ఐ అరుణ్‌కుమార్‌ను అభినందించారు. స్మార్ట్, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో సిబ్బంది పాత్ర కీలకమని తెలిపారు. ప్రజల్లో పోలీసులంటే భయం పోగొట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్‌లో భాగంగా ప్రతీ స్టేషన్‌కు రిసెప్షనిస్ట్‌తో పాటు ఫిర్యాదుదారులకు అవసరమైన కాగితం, పెన్నుతో పాటు టేబుళ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. తాగేందుకు చల్లని నీరు, చెట్ల కింద కూర్చునేందుకు బల్లలు వేశామన్నారు. రికార్టులను ఫైలింగ్ చేయడంతో పాటు సిబ్బందికి అవసరమైన వసతులు కల్పిస్తున్నామని వివరించారు. జిల్లాలోని 14 పీస్‌లను స్మార్ట్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టంచేశారు. గతంలో కన్నా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పారు. ప్రతీ రోజు వాహనాల తనిఖీలు, డ్రంకన్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామన్నారు. లైసెన్స్ లేకుండా, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారికి జరిమానాలు విధిస్తున్నామని వెల్లడించారు. దీంతో ప్రమా దాలు బాగా తగ్గాయన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీంలతో పాటు భరోసా కేంద్రాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సీఐ శ్రీనివాస్, ఎస్ఐ అరుణ్‌కుమార్ తదితరులు ఉన్నారు. -
ఐదేళ్లు నేనే ఉంటా..!
సాక్షి, టీ.నగర్: ఐదేళ్లపాటు తాను రాష్ట్ర గవర్నర్‌గా కొనసాగుతానని బన్వరీలాల్ పురోహిత్ ధీమా వ్యక్తం చేశారు. గవర్నర్ పదవి చేపట్టగానే బన్వరీలాల్ జిల్లాల వారీగా వెళ్లి తనిఖీలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఆయన స్వచ్ఛ భారత్ పనుల్లో పాల్గొనడమే కాకుండా ప్రజల దగ్గర వినతులను స్వీకరిస్తున్నారు. ప్రభుత్వ అధికారులతో అభివృద్ధి పనుల గురించి చర్చలు జరుపుతున్నారు. కృష్ణగిరిలో ఈ పనులను పరిశీలించేందుకు గవర్నర్ సోమవారం చెన్నై నుంచి కారులో కృష్ణగిరికి వెళ్లారు. రాత్రి టూరిస్టు బంగ్లాలో బస చేశారు. మంగళవారం ఉదయం గవర్నర్ పురోహిత్ అక్కడ నుంచి కారులో కావేరిపట్టణంకు వెళ్లారు. అక్కడ సఫానిపట్టి ప్రాంతంలో జరిగిన చెన్నై శంకర నేత్రాలయ మొబైల్ కంటి శస్త్ర చికిత్స శిబిరంలో ప్రత్యేక అతిథిగా గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో అంధత్వం నివారణకు 2015లో సంచార కంటి శస్త్ర చికిత్స కేంద్రాలు ఏర్పాటైనట్లు తెలిపారు. తర్వాత ఆయన కావేరి పట్టణంలోని తిమ్మాపురానికి వెళ్లి అక్కడున్న చెత్తల తొలగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు మంత్రి బాలకృష్ణారెడ్డి, కలెక్టర్ కదిరవన్ సహా పాల్గొన్నారు. డీఎంకే నిరసన కృష్ణగిరి టోల్గేట్లో ఈస్ట్ జిల్లా డీఎంకే నిర్వాహకులు, ఎమ్మెల్యే సెంగుట్టవన్ ఆధ్వర్యంలో అక్కడికి చేరుకున్న డీఎంకే, కూటమి పార్టీలు గవర్నర్‌కు వ్యతిరేకంగా నల్లజెండాలు ప్రదర్శించి నినాదాలు చేశారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించారు. -
36 గంటలు.. 820 మరుగుదొడ్లు
జగిత్యాల జిల్లాలో కలెక్టర్ శరత్ వినూత్న ప్రయోగం • ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లో నిర్మాణాలు ప్రారంభం • పనుల తీరుపై.. స్వచ్ఛభారత్ మిషన్ డాక్యుమెంటరీ • నేటి రాత్రి 8:20కి మొత్తం పనులు పూర్తి సాక్షి, జగిత్యాల: స్వచ్ఛ భారత్.. స్వచ్ఛ తెలంగాణ స్ఫూర్తితో జగిత్యాలనూ స్వచ్ఛ జిల్లాగా లక్ష్యంగా పెట్టుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ వినూత్న ప్రయోగంతో ముందుకు సాగుతున్నారు. కేవలం 90 రోజుల్లోనే జగిత్యాలను స్వచ్ఛ జిల్లాగా మార్చే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఈ క్రమంలో తొలి ప్రయత్నంగా 36 గంటల్లో 820 మరుగు దొడ్ల నిర్మాణ లక్ష్యం పెట్టుకున్న ఆయన మంగళవారం ఉదయం సరిగ్గా 8:20 గంటలకు జిల్లాలోని మల్లాపూర్ మండలం నడికుడ గ్రామంలో పనులు ప్రారంభించారు. అదే సమయంలో నిర్ణయించిన మిగతా గ్రామా ల్లోనూ పనులు ప్రారంభించారు. పనుల పర్య వేక్షణకు సంబంధించి కలెక్టర్ ఐదు మరుగు దొడ్లకు గ్రామస్థాయి అధికారి, పది మంది గ్రామస్థాయి అధికారులపై మండల స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు ఇప్పటికే ఒక్కో గ్రామానికి నియ మించిన జిల్లాస్థాయి అధికారులూ తమకు కేటాయించిన గ్రామాల్లో నిర్మాణ పనులు పర్యవేక్షించారు. కలెక్టర్ సైతం..విశ్రాంతి లేకుండా తిరుగుతూ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. బుధవారం రాత్రి 8:20 గంటలలోపు నిర్మాణ లక్ష్యం పూర్తి చేసి.. గ్రామాన్ని సంపూర్ణ మరుగుదొడ్లు ఉన్న గ్రామంగా తీర్మానం చేయాలని పంచాయతీ పాలకవర్గాన్ని ఆదేశించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో చురుకుగా పాల్గొ ని అధికారులకు మద్దతుగా నిలబడ్డారు. 300 నిర్మాణాలు పూర్తి గత నెల 15 నుంచే నియోజక, మండల, గ్రామ స్థాయి సమావేశాలు.. సమీక్షలు నిర్వహించిన ఆయన మరుగు దొడ్లు లేని లబ్ధిదారులను గుర్తించి వారిని చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహిం చారు. కలెక్టర్ కృషి ఫలితంగా.. ఇన్నాళ్ల నుంచి మరుగుదొడ్ల నిర్మాణాలపై శ్రద్ధ చూపని నిరుపేద, నిరక్షరాస్యులు రెట్టింపు ఉత్సాహంతో ముందుకొచ్చారు. కూలీలతో పాటు లబ్ధిదారులు సైతం పనుల్లో చేయందించారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 8 గంటల వరకు జరిగిన పనుల ఆధారంగా.. అర్ధరాత్రి వరకు..(16 గంటల్లో) జిల్లావ్యాప్తంగా మూడొందల మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. నేటి రాత్రి 8:20 గంటలలోపు.. మిగతా నిర్మాణాలు పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. -
15 రోజుల్లో 4వేల కిలోమీటర్లు పూర్తి
మోదీ స్ఫూర్తిగా ప్రయాణం రంగారెడ్డి(తాండూరు): ప్రధాని నరేంద్ర మోదీ ‘స్వచ్ఛ భారత్’ స్ఫూర్తితో తాండూరు పట్టణానికి చెందిన జొల్లు ప్రవీణకుమార్ అనే వ్యక్తి తన ద్విచక్రవాహనంపై చేపట్టిన భారత దేశయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. గత నెల 31వ తేదీన తాండూరులో ప్రారంభించిన ఈ యాత్ర తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, అనంతపురం, కర్నూలు, చిత్తూరుతోపాటు తమిళనాడులో 8 జిల్లాలు, కేరళలో 7 జిల్లాల్లో పూర్తయ్యింది. కర్ణాటకలోని 8 జిల్లాల్లో ఈయాత్ర పూర్తయి ప్రస్తుతం గుల్బర్గా జిల్లాలోకి ప్రవేశించింది. తాండూరు నుంచి ప్రవీణ్‌కుమార్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, వీరశైవ సమాజం ప్రతినిధులు, స్నేహితులు గుల్బర్గాకు వెళ్లి ఆయనను కలిశారు. గుల్బర్గాలోని శ్రీశరణు బసవేశ్వర దేవాలయంలో అప్పాజీని ప్రవీణ్‌కుమార్ కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ ఫోన్లో మాట్లాడారు. యాత్ర చేపట్టిన 15 రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో సుమారు 4వేల కి.మీ. పూర్తి చేసినట్టు తెలిపారు. రోజుకు సుమారు 250-300కి.మీ. వరకు ప్రయాణం చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి చోటా ప్రజలు,స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, పోలీసులు మంచి ఆదరణ చూపారన్నారు. స్వచ్ఛభారత్తోపాటు భ్రూణ హత్యల నివారణ, మహిళలను గౌరవించడం తదితర అంశాలపై ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు,పట్టణాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు ఆయన చెప్పారు. ఆదివారం గుల్బర్గా నుంచి బీజాపూర్‌కు బయలుదేరనున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు యాత్రలో ఎలాంటి ఇబ్బందులు కలుగలేదని తెలియజేశాడు. -
స్వచ్ఛ తెలంగాణ.. అచ్ఛా మెదక్
పట్టణం రూపురేఖల్ని మారుద్దాం డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి పట్టణంలో ‘స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ’ మెదక్ టౌన్ : నాలుగేళ్లలో మెరుగైన ప్రణాళికలతో మెదక్ పట్టణం రూపురేఖలు మారుస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ‘అచ్ఛా మెదక్.. స్వచ్ఛ తెలంగాణ’ నినాదంతో మెదక్ ప్రజాప్రతినిధులు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పట్టణ ప్రజలను భాగస్వాముల్ని చేయాలన్నారు. పట్టణాన్ని 9 సెక్టార్లుగా విభ జించి 27 వార్డుల్లో కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామన్నారు. రోడ్ల విస్తరణ, డివైడర్ల నిర్మాణం కోసం పట్టణానికి రూ.16 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. మంచినీటి కోసం రూ.25 లక్షలు మంజూరు అయ్యాయన్నారు. ఖిల్లాపై భారీ ట్యాంకు నిర్మించి ప్రతి ఇంటికి తాగునీరందిస్తామన్నారు. ప్రస్తుత మార్కెట్ ప్రజల అవసరాలకు సరిపోవట్లేదని, మరో రెండు మార్కెట్ల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. 4 ఎకరాల స్థలంలో వైకుంఠధామం (శ్మశానవాటిక) ఏర్పాటు చేస్తామన్నారు. భౌతికకాయాలను తరలించేందుకు మునిసిపాలిటీ ఆధ్వర్యంలో రూ.12 లక్షలతో వైకుంఠ రథాన్ని కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. పట్టణ ప్రజలకు మొదటి విడతగా 800 మరుగుదొడ్లు మంజూరయ్యాయన్నారు. 400 మందికి ప్రస్తుతం మంజూరు పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆర్డీఓ మెంచు నగేష్, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ పథకాల్లో అధికారులంతా భాగస్వాములు కావాలని పిలునిచ్చారు. మెదక్ ఏరియా ఆస్పత్రిని దత్తత తీసుకొని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని డీఎస్పీ రాజారత్నం తెలిపారు. అంతకు ముందు మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి లబ్ధిదారులకు మరుగుదొడ్ల నిర్మాణ పత్రాలు అందజేశారు. అనంతరం ఆమె ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటి, చెత్తా చెదారాన్ని ట్రాక్టర్లలో నింపి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో తహశీల్దార్ విజయలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కమిషనర్ వెంకటేశం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గంగాధర్, కృష్ణాగౌడ్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫాజిల్, మహిళ అధ్యక్షురాలు జెల్ల గాయత్రి తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్ లో స్వచ్ఛభారత్
వరంగల్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన 'స్వచ్ఛభారత్' కార్యక్రమానికి తెలంగాణలో కూడా మంచి ఆదరణ లభిస్తోంది. రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఘనంగా ప్రారంభించారు. యూసఫ్ గూడ ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ శ్రీరామమూర్తి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. కమాండెంట్‌తో పాటు మిగతా పోలీసు సిబ్బంది కూడా పాల్గొన్నారు. -
స్వచ్ఛ తెలంగాణ.. స్వచ్ఛ భారత్
- ‘స్వచ్ఛ భారత్ మిషన్’ పేరు మార్చుతూ సర్కారు నిర్ణయం హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్‌ను రాష్ట్రంలో ‘స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ భారత్’ పథకంగా అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇంతకు మునుపు ఈ కార్యక్రమాన్ని ‘స్వచ్చ భారత్ గ్రామీణ మిషన్’గా అమలు చేయాలనుకున్న ప్రభుత్వం తాజాగా ఈ పేరును ఖరారు చేసింది. ఈ కార్యక్రమం అమల్లో భాగంగా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో సుమారు 6.5 లక్షల మరుగుదొడ్లు నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ఒక్కో టాయిలెట్‌కు రూ.12 వేలు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఇందులో 75 శాతం (రూ.9 వేలు) కేంద్ర ప్రభుత్వ, 25 శాతం(రూ.3 వేలు) రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. వెనుకబడిన మండలాలకు ప్రాధాన్యం.. తొలిదశలో వెనుకబడిన మండలాల్లో మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభించాలని, వందశాతం నిర్మించుకునేందుకు ముందుకు వచ్చిన గ్రామాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సర్కారు సూచించింది. ఎస్సీ ఎస్టీ వర్గాలుండే ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మాణానికి సబ్‌ప్లాన్ కింద నిధులు కేటాయించనుంది. జిల్లాస్థాయిలో కలెక్టర్లు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్.. పర్యావరణానికి హాని లేని విధంగా ఇరిగేషన్ శాఖ రిటైర్డు చీఫ్ ఇంజనీర్ ఒకరు రూపొం దించిన బయో డిగ్రేడ్ టాయిలెట్ నమూనాను పైలట్ ప్రాజెక్టుగా నిజామాబాద్ జిల్లాలో నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. -
మరుగున పడినట్టే..
స్వచ్ఛభారత్‌లో భాగంగా మరుగుదొడ్డి లేని ఇళ్లు ఉండొద్దన్న లక్ష్యం జిల్లాలో పూర్తిగా నీరుగారిపోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పుష్కలంగా నిధులు విడుదల చేస్తున్నా మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లా యంత్రాంగం వెనుకబడింది. సంబంధిత శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా మరుగుదొడ్ల ఆవశ్యకతపై అవగాహన కరువై మళ్లీ బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా మంజూరైన మరుగుదొడ్లలో మూడోవంతు మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయి. తాజాగా స్వచ్ఛభారత్ పేరుతో పారిశుధ్యంపై దృష్టి పెట్టినా మరుగుదొడ్లను మరుగున పడేయడం గమనార్హం. ముకరంపుర: వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, మహిళల ఆత్మగౌరవం కోసం 2017 నాటికి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలన్న లక్ష్యం ఆచరణలో ఆమడదూరంలో ఉంది. క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమవుతోంది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను గతంలో ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ నిర్మాణాల బిల్లుల చెల్లింపులో అంతులేని అవినీతి, అక్రమాలు జరిగాయి. సగం బిల్లులే మంజూరీ చేసి మిగతావి ఎగవేసిన సంఘటనలున్నారుు. దీంతో గత కలెక్టర్ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణాలపై అవినీతి నిరోధక శాఖ తనిఖీలు చేపట్టింది. తర్వాత మరుగుదొడ్ల నిర్మాణాలను ఉపాధిహామీ పథకానికి బదిలీ చేశారు. అయినా నిర్మాణాలు నత్తనడకన సాగాయి. తాజాగా ఈ పథకాన్ని మళ్లీ ఆర్‌డబ్ల్యూఎస్‌కు బదలాయించారు. పెండింగ్‌లో ఉన్న 1,26,546 మరుగుదొడ్లను వారే నిర్మించాల్సి ఉంది. జిల్లాలో 2012 నుంచి ఇప్పటివరకు 2,34,000 మరుగుదొడ్లు మంజూరయ్యూరుు. ఇప్పటివరకు 79,527 మాత్రమే పూర్తయ్యాయి. మరో 27,927 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయి. యంత్రాంగం నిర్లక్ష్యంతోనే.. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ మంజూరు చేసినప్పటికీ నిర్మాణాలు పూర్తి చేసేందుకు అధికారులు సహకరించడం లేదు. నిర్మాణాలు పూర్తయిన వారికి కొంత మొత్తం బిల్లులు చెల్లించడం, అసలే రాకపోవడం, సాంకేతిక సాకులతో బిల్లుల ఎగవేత వంటి కారణాలతో అర్ధాంతరంగా ఆపేస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లు స్టోరేజీ గదులుగా మారుతున్నారుు. మరుగుదొడ్ల ఆవశ్యకతపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేయకపోవడంతో ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా మళ్లీ బహిర్భూమికే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారు బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ మార్గదర్శకాలు విడుదలయ్యాక బిల్లులు చెల్లిస్తామని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. -
ఇంటి నుంచే స్వచ్ఛభారత్
పోట్లదుర్తి(ఎర్ర గుంట్ల) : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడి, రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వారి ఇంటి నుంచే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కెవీ రమణ పిలుపు నిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు సాధికారిత సదస్సులో పాల్గొని రైతులకు రుణ విముక్తి పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపధ్యంలో ఆర్థిక కష్టాలు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అర్హులైన రైతులందరికీ రుణ మాఫీ చేశారన్నారు. కొన్ని సాంకేతిక సమస్యల వల్ల కొందరికి మొదటి విడతలో రాలేదని వారికీ త్వరలోనే వస్తాయన్నారు. ఈ రుణ మాఫీ కింద జిల్లాలో సుమారు 2,78,000 మంది రైతులకు రూ.316 కోట్లు రుణ మాఫీ వర్తించిందన్నారు. రుణ మాఫీలో అవకతవకలు ఉంటే మళ్లీ సర్వే చేసి రైతులందరికీ వర్తించేలా జిల్లా వ్యాప్తంగా మూడు స్థాయిలలో కమిటీలు వేశామన్నారు. మండల స్థాయిలో తహశీల్దార్, డివిజనల్ స్థాయిలో ఆర్డీఓ, జిల్లా స్థాయిలో కలెక్టర్ అందులో ఉంటారన్నారు. రైతులకు ఇబ్బందులు ఉంటే ఆయా కమిటిలకు ఆర్జీలు చేసుకోవచ్చన్నారు. కొత్త పింఛన్లను రెండు నెలలో విడుదల చేస్తామన్నారు. జనవరి నుంచి పింఛన్లును పోస్టల్ ద్వారా పంపిణి చేస్తామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడీ జ్ఙానేశ్వర్, గ్రామ సర్పంచ్ వెంకటరంగయ్య యాదవ్, ఎంపీటీసీ సభ్యురాలు శిరీషా, తహశీల్దార్ బి మహేశ్వరరెడ్డి, వ్యవసాయ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ సీఎం సురేష్‌నాయుడు, ఈఓపీఆర్డీ శివకుమారితో పాటు రైతులు పాల్గొన్నారు. ఉద్యాన పంటల సాగుకు సబ్సిడీ... తిప్పలూరు గ్రామ సమీపంలోని పాలిహౌస్‌లోని బ్రిటిస్ దోస ఉద్యాన పంట సాగును మంగళవారం జిల్లా కెవీ రమణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యాన పంటల సాగు చేసుకోవడానికి రైతులు ముందుకు వస్తే ప్రభుత్వ 50 శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఇలాంటివి 11 యూనిట్లు ఉన్నాయన్నారు. ఉద్యాన పంట సాగు ఎంతో లాభసాటి అని ఉద్యాన శాఖ ఆసిస్టెంట్ డెరైక్టర్ మధుసూదన్‌రెడ్డి అన్నారు. రూల్స్‌ను కాదని పోట్లదుర్తికి అనుమతి.. పోట్లదుర్తి గ్రామంలోని కళ్యాణ మండపంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ సందర్శించి మహిళలతో మట్లాడారు. పోట్లదుర్తి గ్రామంలో ఉన్న ఈ కుట్టు మిషన్ యూనిట్ మున్సిపాలిటీలలో ఉండాలన్నారు. కానీ సీఎం రమేష్‌నాయుడు చెప్పడంతో రూల్స్‌ను కాదని ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశామని, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్కూల్ యూనిఫాం కుట్టడమే కాకుండా మహిళలే స్వయంగా మార్కెటింగ్ చేసుకోవాలని అన్నారు. అన్ని అధికారులే చూడలాంటే సాధ్యం కాదన్నారు. జీతాలు ఆలస్యంగా ఇస్తున్నారని, ఇలా అయితే మా కుటుంబాలు గడవడం కష్టంగా ఉంటుందని ఓ మహిళ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో మెప్మా పీడీ వెంకటసుబ్బయ్య, మండల ప్రత్యేక అధికారి మధుసూదన్‌రెడ్డి, తహ శీల్దార్ బి మహేశ్వరరెడ్డి, సర్పంచ్ వెంకటరంగయ్య యాదవ్, టీడీపీ నేత సురేష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. పి వెంకటాపురంలోని స్థలం పరిశీలన ... పి.వెంకటాపురంలో ప్రభుత్వం ఏర్పాటు చేయునున్న సోలార్ విద్యుత్ ప్లాంట్‌కు సంబంధించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ కెవీ రమణ పరిశీలించారు. దీనిపై పూర్తి వివరాలు పంపించాలని తహశీల్దార్‌ను ఆయన ఆదేశించారు. పోట్లదుర్తి వసతి గృహం పరిశీలన పోట్లదుర్తిలో ఉన్న ప్రభుత్వ ఎస్సీ వసతి గృహాన్ని మంగళవారం కలెక్టర్ కెవీ రమణ పరిశీలించారు. వసతి గృహంలో రూ.3 లక్షలతో ఏర్పాటు చేసిన సోలార్ వాటర్ ప్లాంట్‌ను పరిశీలించారు. అనంతరం వంట గదిని, విద్యార్థుల స్టడీ గదలును పరిశీలించారు. వార్డన్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
మోదీపై రవీనాటాండన్ ప్రశంసలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన 'స్వచ్ఛభారత్' కార్యక్రమంపై బాలీవుడ్ నటి రవీనా టాండన్ ప్రశంసలు కురిపించింది. ప్రతి ఒక్కరూ ఈ బృహత్ కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చింది. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లే, దేశాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత దేశవాసులు అందరిమీదా ఉందని తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఓ నగల దుకాణాన్ని ప్రారంభించిన తర్వాత రవీనా విలేకరులతో మాట్లాడింది. శ్రీకృష్ణుడి నగరం అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె చెప్పింది. జమ్ము కాశ్మీర్లో వరదలతో బాధపడుతున్నవారిని ఆదుకోడానికి ఉదారంగా విరాళాలు ఇవ్వాలని కూడా ప్రజలకు రవీనా పిలుపునిచ్చింది. -
మోదీకి ఫుల్ సపోర్ట్.. చీపురు పడతా: సమంత
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపడుతున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయని సమంత చెబుతోంది. ఆయనకు తన పూర్తి మద్దతు ప్రకటించింది. ముఖ్యంగా ఇటీవల గాంధీ జయంతి రోజున మోదీ ప్రకటించిన 'స్వచ్ఛభారత్' కార్యక్రమం తననెంతో ఆకట్టుకుందని తాజాగా సమంత చెప్పింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో హెపటైటిస్ బిపై జరిగిన అవగాహన శిబిరానికి సమంత హాజరైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తననెవరూ ఆహ్వానించలేదని, పిలిస్తే మాత్రం తప్పనిసరిగా తాను కూడా పాల్గొంటానని చెప్పింది. నాగార్జున, సానియా మీర్జా తదితరులను అనిల్ అంబానీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం, అందులో తాను చీపురు పట్టుకుని పాల్గొంటానని సానియా చెప్పడం కూడా తెలిసిందే. సమాజసేవ విషయంలో ముందంజలో ఉండే సమంత.. ఇప్పుడు తాను సైతం చీపురు పట్టుకుని స్వచ్ఛభారత్ కార్యక్రమానికి హాజరవుతానని చెప్పడం మరింతమందికి స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నారు. -
ఘనంగా గాంధీ జయంతి
ఆదిలాబాద్ కల్చరల్ : ఆదిలాబాద్‌లో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న గాంధీ పార్కులోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మున్సిపల్ చైర్ పర్సన్ రంగినేని మనీష, కలెక్టర్ ఎం.జగన్మోహన్, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ షాహిద్ మసూద్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. చీపుళ్లతో రోడ్డు శుభ్రపర్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సయ్యద్ సాజిదొద్దీన్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారుఖ్ అహ్మద్, ఆదిలాబాద్ ఎంపీపీ నైతం లక్ష్మీ పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో మంత్రి రామన్న సారథ్యంలో వేడుకలు నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి నిర్వహించారు. మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి మహాత్ముని సందేశాన్ని అందించారు. నాయకుడు నరేష్ జాదవ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, నాయకులు సునందరెడ్డి, గణేష్‌రెడ్డి, తుమ్మ ప్రకాశ్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అలల అజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో రిమ్స్ ఆస్పత్రిలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్యవైశ సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు గాదె వినోద్‌కుమార్, నాయకులు జనగం సంతోష్, మధుకర్, తదితరులు పాల్గొన్నారు. -
పరిశుభ్రతా దినంగా గాంధీజయంతి
భివండీ, న్యూస్‌లైన్ : ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు భివండీ నిజాంపూర్ శహర్ మహానగర్ పాలిక ముఖ్య కార్యాలయంలో కమిషనర్ జీవన్ సోనావునే నాయకత్వంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని గురువారం పారిశుద్ధ్య చర్యలను ప్రారంభించారు. కార్పొరేషన్ మూడవ అంతస్తులోని సమావేశ మందిరంలో జీవన్ సోనావునే, డిప్యూటీ కమిషనర్ విజయ కంఠేతోపాటు ఇతర అధికారులు గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. స్వచ్ఛతలో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లోని తెలుగు సేవ సంస్థలు, కార్పొరేటర్లు తమ పరిసర మురికి కాలువలతో పాటు రోడ్లను శుభ్రపరిచారు. భివండీ కార్పోరేషన్ కమిషనర్‌తోపాటు ఇతర అధికారులు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు. స్వచ్ఛతను ఎళ్లవేలలా పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. తెలుగు ప్రజలు అధిక సంఖ్యలో ఉండే పద్మనగర్ ప్రాంతంలోని బాలాజీ సేవ సోసైటీ, బాలాజీ మిత్ర మండల్ కార్యకర్తలు ఉదయం తమ పరిసర ప్రాంతాల్లో ఉన్న మురికి కాలువలు, రోడ్లను శుభ్రపర్చారు. సోసైటీ అధ్యక్షులు పూల రవి మాట్లాడుతూ...ప్రధాన మంత్రి చేపట్టిన స్వచ్ఛతా భారత్ అభియాన్‌ను ప్రతి భారతీయుడు పాటించాలని అన్నారు. కామత్‌ఘర్‌లోని బీజేపీ కార్పోరేటర్ హనుమాన్ చౌదరి కార్యాకర్తలతో కలిసి వార్డులోని పరిసర ప్రాంతాల్లో గల రోడ్లను ఊడ్చారు. మరి కొంత మంది స్థానికులు కార్పొరేటరును చూసి పరిసర ప్రాంతంలో గల రోడ్లను ఊడ్చారు.