36 గంటలు.. 820 మరుగుదొడ్లు
జగిత్యాల జిల్లాలో కలెక్టర్ శరత్ వినూత్న ప్రయోగం
• ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లో నిర్మాణాలు ప్రారంభం
• పనుల తీరుపై.. స్వచ్ఛభారత్ మిషన్ డాక్యుమెంటరీ
• నేటి రాత్రి 8:20కి మొత్తం పనులు పూర్తి
సాక్షి, జగిత్యాల: స్వచ్ఛ భారత్.. స్వచ్ఛ తెలంగాణ స్ఫూర్తితో జగిత్యాలనూ స్వచ్ఛ జిల్లాగా లక్ష్యంగా పెట్టుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ వినూత్న ప్రయోగంతో ముందుకు సాగుతున్నారు. కేవలం 90 రోజుల్లోనే జగిత్యాలను స్వచ్ఛ జిల్లాగా మార్చే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఈ క్రమంలో తొలి ప్రయత్నంగా 36 గంటల్లో 820 మరుగు దొడ్ల నిర్మాణ లక్ష్యం పెట్టుకున్న ఆయన మంగళవారం ఉదయం సరిగ్గా 8:20 గంటలకు జిల్లాలోని మల్లాపూర్ మండలం నడికుడ గ్రామంలో పనులు ప్రారంభించారు. అదే సమయంలో నిర్ణయించిన మిగతా గ్రామా ల్లోనూ పనులు ప్రారంభించారు. పనుల పర్య వేక్షణకు సంబంధించి కలెక్టర్ ఐదు మరుగు దొడ్లకు గ్రామస్థాయి అధికారి, పది మంది గ్రామస్థాయి అధికారులపై మండల స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు.
దీంతో పాటు ఇప్పటికే ఒక్కో గ్రామానికి నియ మించిన జిల్లాస్థాయి అధికారులూ తమకు కేటాయించిన గ్రామాల్లో నిర్మాణ పనులు పర్యవేక్షించారు. కలెక్టర్ సైతం..విశ్రాంతి లేకుండా తిరుగుతూ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. బుధవారం రాత్రి 8:20 గంటలలోపు నిర్మాణ లక్ష్యం పూర్తి చేసి.. గ్రామాన్ని సంపూర్ణ మరుగుదొడ్లు ఉన్న గ్రామంగా తీర్మానం చేయాలని పంచాయతీ పాలకవర్గాన్ని ఆదేశించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో చురుకుగా పాల్గొ ని అధికారులకు మద్దతుగా నిలబడ్డారు.
300 నిర్మాణాలు పూర్తి
గత నెల 15 నుంచే నియోజక, మండల, గ్రామ స్థాయి సమావేశాలు.. సమీక్షలు నిర్వహించిన ఆయన మరుగు దొడ్లు లేని లబ్ధిదారులను గుర్తించి వారిని చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహిం చారు. కలెక్టర్ కృషి ఫలితంగా.. ఇన్నాళ్ల నుంచి మరుగుదొడ్ల నిర్మాణాలపై శ్రద్ధ చూపని నిరుపేద, నిరక్షరాస్యులు రెట్టింపు ఉత్సాహంతో ముందుకొచ్చారు. కూలీలతో పాటు లబ్ధిదారులు సైతం పనుల్లో చేయందించారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 8 గంటల వరకు జరిగిన పనుల ఆధారంగా.. అర్ధరాత్రి వరకు..(16 గంటల్లో) జిల్లావ్యాప్తంగా మూడొందల మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. నేటి రాత్రి 8:20 గంటలలోపు.. మిగతా నిర్మాణాలు పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.