swacha telangana
-
‘స్వచ్ఛ’ ర్యాంకు మెరుగయ్యేనా..?
మంచిర్యాలటౌన్: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు సాధనపై అధికారులు దృష్టి సారించడం లేదు. ఎన్నికల విధులతో మున్సిపల్ అధికారులు బిజీగా ఉండడంతో ‘స్వచ్ఛ’తలో అడుగు ముందుకు పడడం లేదు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా నగరాలు, పట్టణాలను స్వచ్ఛమైన నివాస ప్రాంతాలుగా మార్చాలన్న లక్ష్యంతో మున్సిపాలిటీల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది ఏ మేరకు కొనసాగుతుందో తెలుసుకునేందుకు 2017 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్‌ను ప్రారంభించింది. ఏటా జనవరిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ బృందం సభ్యులు పరిశుభ్రతను పరిశీలించి స్వచ్ఛతపై వివరాలు సేకరించిన అనంతరం మార్కులను బట్టి ర్యాంకు కేటాయిస్తారు. ఈ బృందం కాలనీల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వివరాల సేకరణతోపాటు స్థానికుల నుంచి వివరాలు సేకరించి కేంద్రానికి పంపిస్తారు. ఆ వివరాల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంక్‌లను ప్రకటిస్తుంది. ఈ ఏడాది జనవరిలో ఆశించిన ర్యాంకుల సాధనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు వెనుకబడ్డాయి. ఈ ఏడాది ఆగస్టులో కొత్తగా మున్సిపాలిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసినా అవి స్వచ్ఛ సర్వేక్షన్ పోటీలో లేవు. వచ్చే జనవరిలో పాత ఏడు మున్సిపాలిటీల్లోనే మరోసారి సర్వేకు బృందాలు రానున్నాయి. దీంతో మున్సిపల్ కమిషనర్లు స్వచ్ఛ సర్వేక్షన్‌లోని మార్గదర్శకాలపై సానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లకు దిశానిర్ధేశం చేశారు. 2018లో సౌత్జోన్లో ఉమ్మడి జిల్లాలోని భైంసా, నిర్మల్, మంచిర్యాల కొంత మెరుగైన ర్యాంకులు సాధించాయి. ఈసారి ఎన్నికల హడావుడిలో అధికారులు నిమగ్నం కావడంతో స్వచ్ఛతపై పెద్దగా పట్టించుకోలేదు. 2019 జనవరిలో ప్రకటించే ర్యాంకులు ఏవిధంగా ఉండబోతాయోనని అధికారుల్లో కొంత ఆందోళన నెలకొంది వారం రోజులే.. దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్–2019 పోటీల్లో 4,231 నగరాలు, పట్టణాలు పోటీపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్ని పట్టణాలు మెరుగైన ర్యాంకుల సాధనకు గత రెండు నెలలుగా పట్టణ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో అధికారులు స్వచ్ఛ సర్వేక్షణ్‌పై దృష్టి సారించినా.. ఎన్నికల విధులతో ఆశించిన మేర సమయం కేటాయించలేకపోయారు. జనవరి 4 నుంచి ఫిబ్రవరి 4వరకు మున్సిపాలిటీల్లో స్వచ్ఛ సర్వేక్షన్ థర్డ్‌పార్టీ క్యూసీఐ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తాయి. స్వయంగా స్వచ్ఛతను పరిశీలించి ప్రజల అభిప్రాయాలను నమోదు చేసుకుంటారు. ప్రజల అభిప్రాయాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పబ్లిక్ టాయిలెట్లు, పరిశుభ్రత, దేవాలయాలు, మసీదు, చర్చిలు, ఆర్టీసీ బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, చెత్త సేకరించే విధానం, అందుకు వినియోగిస్తున్న పారిశుధ్య సిబ్బంది, సేకరించిన చెత్త నిల్వ కేంద్రాలు, చెత్త ప్రాసెసింగ్ వంటి వివరాలను మదింపు చేస్తారు. ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా ప్రజల నుంచి వివరాలు రాబడుతారు. స్వచ్ఛ సర్వేక్షణ్ బృందంలోని అధికారులు ప్రతి మున్సిపాలిటీని నాలుగు విభాగాలుగా విభజించి మార్కులు కేటాయిస్తారు. సర్వీస్ లెవల్ బెంచ్ మార్కుకు 1,250 మార్కులు, థర్డ్ పార్టీ అసెసర్ల పరిశీలన ద్వారా 1,250 మార్కులు, సిటిజన్ ఫీడ్ బ్యాక్ ద్వారా 1,250 మార్కులు, సర్టిఫికెట్, ఓడీఎఫ్, గ్యార్బేజీ, ఫ్రీసిటి, కెపాసిటీ బిల్డింగ్ ద్వారా 1,250 మార్కులు కేటాయించి, ర్యాంకులను ప్రకటిస్తారు. గతంలో ర్యాంకులు అంతంతే.. సౌత్జోన్లో ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు గాను మూడింటిలోనే కొంత మెరుగైన ర్యాంకులు వచ్చాయి. భైంసాకు 2,329 మార్కులు రాగా 18వ ర్యాంకు వచ్చింది. మంచిర్యాలకు 2,286 మార్కులకు గాను 23వ ర్యాంకు, నిర్మల్‌కు 2,199 మార్కులకు గాను 34వ ర్యాంకు వచ్చింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీకి 2,423 మార్కులు రాగా 133వ ర్యాంకు వచ్చింది. ఇక మందమర్రికి 1,647 మార్కులు రాగా, 284వ ర్యాంకు పొందింది. కాగజ్‌నగర్‌కు 1,542 మార్కులు రాగా, 394వ ర్యాంకు పొందింది. బెల్లంపల్లి మున్సిపాలిటీకి 1,450మార్కులు రాగా, 516 ర్యాంకు వచ్చింది. ప్రజల్లో చైతన్యం తేవాలి సౌత్‌జోన్‌తోపాటు జాతీయ స్థాయిలో పలు మున్సిపాలిటీలతో పోటీ పడి మంచి మార్కులు, ర్యాంకు సాధించుకోవాలంటే ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం తేవాలి. పారిశుధ్య సిబ్బంది మున్సిపాలిటీల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించి, పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలి. బహిరంగ మలమూత్ర విసర్జనను వందశాతం నిషేధించాలి. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసి అందించేలా చూడడంతోపాటు పారిశుధ్య కార్మికులు బాధ్యతగా తీసుకుని చెత్తను ప్రతిరోజు తీసుకెళ్లేలా చూడాలి. మున్సిపాలిటీల్లో తడి, పొడి చెత్త సేకరణకు రెండు చెత్త బుట్టలను ప్రజలకు అందించారు. వాటిని ప్రజలు సక్రమంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలి. చెత్తను తరలించి శివారు ప్రాంతాల్లో ఇష్టానుసారంగా వేస్తున్నారు. ఇలాంటి వాటిపై మున్సిపల్ సానిటరీ విభాగం పూర్తిగా దృష్టిసారించి చెత్తను డంపింగ్ యార్డులకు తరలించి రీసైక్లింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలి. ప్లాస్టిక్ వాడకంపై నిషేధం ఉన్నా ప్రజలు బట్ట సంచులను వినియోగించడం లేదు. మున్సిపల్ అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతో స్వచ్ఛతపై ఎలాంటి కార్యక్రమాలు ప్రారంభించలేదు. పట్టణ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం ఆదిలాబాద్‌రూరల్: స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం కింద మంచి మార్కులు, ర్యాంకు సాధించేందుకు పట్టణ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. మంచి మార్కులు సాధించాలంటే ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. ప్లాస్టిక్ వాడకం నిషేధించడంతోపాటు బహిరంగా ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేయకూడదు. మరుగుదొడ్లు నిర్మించుకున్నారు కానీ వాడడం లేదు. తప్పనిసరిగా వాటిని వినియోగించుకోవాలి. అంతేకాకుండా వ్యర్థ పదార్థాల నుంచి వర్మీ కంపోస్టు వంటి ఎరువులు తయారు చేస్తున్నాం. – మారుతి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్, ఆదిలాబాద్ -
వందశాతం సాధించాలి
జహీరాబాద్ : మరుగుదొడ్ల నిర్మాణంలో లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సూచించారు. శనివారం సాయంత్రం స్థానిక షెట్కార్ ఫంక్షన్ హాల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ఇతర జిల్లాలతో పోల్చితే మన జిల్లా వెనుకబడి ఉందన్నారు. ప్రతి ఒక్కరూ చొరవ తీసుకుని లక్ష్యాలను సాధించేలా శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించుకునేలా చూడాలన్నారు. మరుగుదొడ్లు లేని మహిళలు బహిర్భూమికి వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారిని చైతన్య పర్చి మరుగుదొడ్లను నిర్మించుకునేలా చూడాలని అప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుందన్నారు. మరుగుదొడ్లకు సంబంధించి నిర్మించుకున్న వారికి వెంటనే బిల్లులను చెల్లించడం జరుగుతుందన్నారు. ఇందుకు అవసరమైన నిధులు ఉన్నాయన్నారు. లక్ష్యాన్ని పూర్తి చేయించడంకోసం సర్పంచ్‌లు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ఇతర మండలాలతో పోల్చితే జహీరాబాద్ మండలం మరుగుదొడ్ల నిర్మాణంలో వెనుకబడి ఉందన్నారు. వందశాతం మరుగుదొడ్లను సాధించి జిల్లాను అగ్రగామిగా నిలిపేలా చూడాలన్నారు. ప్రజా ప్రతినిధులు గ్రామాలను దత్తత తీసుకుని లక్ష్యం పూర్తయ్యేలా చూడాలని కోరారు. ఇందుకు సినీ నిర్మాత ఎం.శివకుమార్ ముందుకు వచ్చి ఈదులపల్లి, మేదపల్లి గ్రామాలను దత్తత తీసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎం.డీ.ఫరీదుద్దీన్, ఆర్డీఓ అబ్దుల్ హమీద్, డీఆర్డీఓ ఎం.వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ డి.లక్ష్మారెడ్డి, ఆత్మ చైర్మన్ పి.రామకృష్ణారెడ్డి, ఎంపీపీలు చిరంజీవి ప్రసాద్, అనిత, పీఏసీఎస్ చైర్మన్ పి.సంజీవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఎం.శివకుమార్, కె.మాణిక్‌రావు, ఎంపీడీఓలు రాములు, లక్ష్మీబాయి, ఎల్లయ్య, ఈఓపీఆర్డీలు శ్రీనివాస్‌రెడ్డి, సుమతి, సాయిబాబా, యాదయ్య, మహిళా సంఘాల సభ్యులు, ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. గ్రామాలను దత్తత తీసుకోవాలి : ఎమ్మెల్సీ ఫరీదుద్ధీన్ వందశాతం మరుగుదొడ్ల లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రజా ప్రతినిధులు గ్రామాలను దత్తత తీసుకోవాలని ఎమ్మెల్సీ ఎం.డీ.ఫరీదుద్ధీన్ కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వీలుగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులు కూడా పాటు పడాలన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూ సమావేశాలను నిర్వహించినట్లయితే లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో అందుకోవచ్చన్నారు. అభివృద్ధి పనులపై సమీక్ష... జహీరాబాద్ : జహీరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎం.డీ.ఫరీదుద్దీన్‌తో కలిసి మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, విద్యుత్ శాఖ పనుల ప్రగతిని గురించి ఆయా శాఖల అధికారులతో సమావేశమై చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎం.డీ.ఫరీదుద్ధీన్, ఆర్డీఓ అబ్దుల్ హమీద్, మార్కెట్ చైర్మన్ డి.లక్ష్మారెడ్డి, ఆత్మ చైర్మన్ పి.రామకృష్ణారెడ్డి, ఎంపీపీ చిరంజీవి ప్రసాద్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
36 గంటలు.. 820 మరుగుదొడ్లు
జగిత్యాల జిల్లాలో కలెక్టర్ శరత్ వినూత్న ప్రయోగం • ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లో నిర్మాణాలు ప్రారంభం • పనుల తీరుపై.. స్వచ్ఛభారత్ మిషన్ డాక్యుమెంటరీ • నేటి రాత్రి 8:20కి మొత్తం పనులు పూర్తి సాక్షి, జగిత్యాల: స్వచ్ఛ భారత్.. స్వచ్ఛ తెలంగాణ స్ఫూర్తితో జగిత్యాలనూ స్వచ్ఛ జిల్లాగా లక్ష్యంగా పెట్టుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ వినూత్న ప్రయోగంతో ముందుకు సాగుతున్నారు. కేవలం 90 రోజుల్లోనే జగిత్యాలను స్వచ్ఛ జిల్లాగా మార్చే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఈ క్రమంలో తొలి ప్రయత్నంగా 36 గంటల్లో 820 మరుగు దొడ్ల నిర్మాణ లక్ష్యం పెట్టుకున్న ఆయన మంగళవారం ఉదయం సరిగ్గా 8:20 గంటలకు జిల్లాలోని మల్లాపూర్ మండలం నడికుడ గ్రామంలో పనులు ప్రారంభించారు. అదే సమయంలో నిర్ణయించిన మిగతా గ్రామా ల్లోనూ పనులు ప్రారంభించారు. పనుల పర్య వేక్షణకు సంబంధించి కలెక్టర్ ఐదు మరుగు దొడ్లకు గ్రామస్థాయి అధికారి, పది మంది గ్రామస్థాయి అధికారులపై మండల స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు ఇప్పటికే ఒక్కో గ్రామానికి నియ మించిన జిల్లాస్థాయి అధికారులూ తమకు కేటాయించిన గ్రామాల్లో నిర్మాణ పనులు పర్యవేక్షించారు. కలెక్టర్ సైతం..విశ్రాంతి లేకుండా తిరుగుతూ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. బుధవారం రాత్రి 8:20 గంటలలోపు నిర్మాణ లక్ష్యం పూర్తి చేసి.. గ్రామాన్ని సంపూర్ణ మరుగుదొడ్లు ఉన్న గ్రామంగా తీర్మానం చేయాలని పంచాయతీ పాలకవర్గాన్ని ఆదేశించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో చురుకుగా పాల్గొ ని అధికారులకు మద్దతుగా నిలబడ్డారు. 300 నిర్మాణాలు పూర్తి గత నెల 15 నుంచే నియోజక, మండల, గ్రామ స్థాయి సమావేశాలు.. సమీక్షలు నిర్వహించిన ఆయన మరుగు దొడ్లు లేని లబ్ధిదారులను గుర్తించి వారిని చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహిం చారు. కలెక్టర్ కృషి ఫలితంగా.. ఇన్నాళ్ల నుంచి మరుగుదొడ్ల నిర్మాణాలపై శ్రద్ధ చూపని నిరుపేద, నిరక్షరాస్యులు రెట్టింపు ఉత్సాహంతో ముందుకొచ్చారు. కూలీలతో పాటు లబ్ధిదారులు సైతం పనుల్లో చేయందించారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 8 గంటల వరకు జరిగిన పనుల ఆధారంగా.. అర్ధరాత్రి వరకు..(16 గంటల్లో) జిల్లావ్యాప్తంగా మూడొందల మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. నేటి రాత్రి 8:20 గంటలలోపు.. మిగతా నిర్మాణాలు పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. -
స్వచ్ఛ తెలంగాణ.. అచ్ఛా మెదక్
పట్టణం రూపురేఖల్ని మారుద్దాం డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి పట్టణంలో ‘స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ’ మెదక్ టౌన్ : నాలుగేళ్లలో మెరుగైన ప్రణాళికలతో మెదక్ పట్టణం రూపురేఖలు మారుస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ‘అచ్ఛా మెదక్.. స్వచ్ఛ తెలంగాణ’ నినాదంతో మెదక్ ప్రజాప్రతినిధులు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పట్టణ ప్రజలను భాగస్వాముల్ని చేయాలన్నారు. పట్టణాన్ని 9 సెక్టార్లుగా విభ జించి 27 వార్డుల్లో కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామన్నారు. రోడ్ల విస్తరణ, డివైడర్ల నిర్మాణం కోసం పట్టణానికి రూ.16 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. మంచినీటి కోసం రూ.25 లక్షలు మంజూరు అయ్యాయన్నారు. ఖిల్లాపై భారీ ట్యాంకు నిర్మించి ప్రతి ఇంటికి తాగునీరందిస్తామన్నారు. ప్రస్తుత మార్కెట్ ప్రజల అవసరాలకు సరిపోవట్లేదని, మరో రెండు మార్కెట్ల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. 4 ఎకరాల స్థలంలో వైకుంఠధామం (శ్మశానవాటిక) ఏర్పాటు చేస్తామన్నారు. భౌతికకాయాలను తరలించేందుకు మునిసిపాలిటీ ఆధ్వర్యంలో రూ.12 లక్షలతో వైకుంఠ రథాన్ని కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. పట్టణ ప్రజలకు మొదటి విడతగా 800 మరుగుదొడ్లు మంజూరయ్యాయన్నారు. 400 మందికి ప్రస్తుతం మంజూరు పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆర్డీఓ మెంచు నగేష్, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ పథకాల్లో అధికారులంతా భాగస్వాములు కావాలని పిలునిచ్చారు. మెదక్ ఏరియా ఆస్పత్రిని దత్తత తీసుకొని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని డీఎస్పీ రాజారత్నం తెలిపారు. అంతకు ముందు మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి లబ్ధిదారులకు మరుగుదొడ్ల నిర్మాణ పత్రాలు అందజేశారు. అనంతరం ఆమె ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటి, చెత్తా చెదారాన్ని ట్రాక్టర్లలో నింపి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో తహశీల్దార్ విజయలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కమిషనర్ వెంకటేశం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గంగాధర్, కృష్ణాగౌడ్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫాజిల్, మహిళ అధ్యక్షురాలు జెల్ల గాయత్రి తదితరులు పాల్గొన్నారు. -
8న ‘స్వచ్ఛ తెలంగాణ’కు శ్రీకారం
రాష్ట్రంలోని 67 పట్టణాల్లో అమలు హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఈ నెల 8న ‘స్వచ్ఛ భారత్-స్వచ్ఛ తెలంగాణ’ కార్యక్రమం ప్రారంభించనున్నామని రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు బి.నాగిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 67 మున్సిపాలిటీల్లో ఏకకాలంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ తెలంగాణ ఏర్పాట్లపై మేయర్లు/చైర్మన్లు, మునిసిపల్ కమిషనర్లతో మంగళవారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కింద వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం, ఘన వ్యర్థాల నిర్వహణతో పాటు పారిశుధ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఈ కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు ప్రతి పట్టణానికి ఒక నోడల్ అధికారిని, ప్రతి వార్డుకు వార్డు స్థాయి అధికారిని నియమించామన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేసుకునే లబ్ధిదారులకు ఈ నెల 8న ప్రారంభోత్సవం రోజు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు. రెండు విడతల్లో పునాది వరకు నిర్మిస్తే రూ.6 వేలు, పూర్తిగా నిర్మిస్తే మిగిలిన రూ.6 వేలను లబ్ధిదారులకు చెల్లిస్తామన్నారు.