
గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్
సాక్షి, టీ.నగర్: ఐదేళ్లపాటు తాను రాష్ట్ర గవర్నర్‌గా కొనసాగుతానని బన్వరీలాల్ పురోహిత్ ధీమా వ్యక్తం చేశారు. గవర్నర్ పదవి చేపట్టగానే బన్వరీలాల్ జిల్లాల వారీగా వెళ్లి తనిఖీలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఆయన స్వచ్ఛ భారత్ పనుల్లో పాల్గొనడమే కాకుండా ప్రజల దగ్గర వినతులను స్వీకరిస్తున్నారు. ప్రభుత్వ అధికారులతో అభివృద్ధి పనుల గురించి చర్చలు జరుపుతున్నారు.
కృష్ణగిరిలో ఈ పనులను పరిశీలించేందుకు గవర్నర్ సోమవారం చెన్నై నుంచి కారులో కృష్ణగిరికి వెళ్లారు. రాత్రి టూరిస్టు బంగ్లాలో బస చేశారు. మంగళవారం ఉదయం గవర్నర్ పురోహిత్ అక్కడ నుంచి కారులో కావేరిపట్టణంకు వెళ్లారు. అక్కడ సఫానిపట్టి ప్రాంతంలో జరిగిన చెన్నై శంకర నేత్రాలయ మొబైల్ కంటి శస్త్ర చికిత్స శిబిరంలో ప్రత్యేక అతిథిగా గవర్నర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో అంధత్వం నివారణకు 2015లో సంచార కంటి శస్త్ర చికిత్స కేంద్రాలు ఏర్పాటైనట్లు తెలిపారు. తర్వాత ఆయన కావేరి పట్టణంలోని తిమ్మాపురానికి వెళ్లి అక్కడున్న చెత్తల తొలగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు మంత్రి బాలకృష్ణారెడ్డి, కలెక్టర్ కదిరవన్ సహా పాల్గొన్నారు.
డీఎంకే నిరసన
కృష్ణగిరి టోల్‌గేట్‌లో ఈస్ట్ జిల్లా డీఎంకే నిర్వాహకులు, ఎమ్మెల్యే సెంగుట్టవన్ ఆధ్వర్యంలో అక్కడికి చేరుకున్న డీఎంకే, కూటమి పార్టీలు గవర్నర్‌కు వ్యతిరేకంగా నల్లజెండాలు ప్రదర్శించి నినాదాలు చేశారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment