స్వచ్ఛభారత్‌లో భాగంగా మరుగుదొడ్డి లేని ఇళ్లు ఉండొద్దన్న లక్ష్యం జిల్లాలో పూర్తిగా నీరుగారిపోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పుష్కలంగా నిధులు విడుదల చేస్తున్నా మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లా యంత్రాంగం వెనుకబడింది.
స్వచ్ఛభారత్‌లో భాగంగా మరుగుదొడ్డి లేని ఇళ్లు ఉండొద్దన్న లక్ష్యం జిల్లాలో పూర్తిగా నీరుగారిపోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పుష్కలంగా నిధులు విడుదల చేస్తున్నా మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లా యంత్రాంగం వెనుకబడింది. సంబంధిత శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా మరుగుదొడ్ల ఆవశ్యకతపై అవగాహన కరువై మళ్లీ బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా మంజూరైన మరుగుదొడ్లలో మూడోవంతు మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయి. తాజాగా స్వచ్ఛభారత్ పేరుతో పారిశుధ్యంపై దృష్టి పెట్టినా మరుగుదొడ్లను మరుగున పడేయడం గమనార్హం.
ముకరంపుర: వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, మహిళల ఆత్మగౌరవం కోసం 2017 నాటికి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలన్న లక్ష్యం ఆచరణలో ఆమడదూరంలో ఉంది. క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమవుతోంది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను గతంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ నిర్మాణాల బిల్లుల చెల్లింపులో అంతులేని అవినీతి, అక్రమాలు జరిగాయి. సగం బిల్లులే మంజూరీ చేసి మిగతావి ఎగవేసిన సంఘటనలున్నారుు. దీంతో గత కలెక్టర్ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణాలపై అవినీతి నిరోధక శాఖ తనిఖీలు చేపట్టింది. తర్వాత మరుగుదొడ్ల నిర్మాణాలను ఉపాధిహామీ పథకానికి బదిలీ చేశారు. అయినా నిర్మాణాలు నత్తనడకన సాగాయి. తాజాగా ఈ పథకాన్ని మళ్లీ ఆర్‌డబ్ల్యూఎస్‌కు బదలాయించారు. పెండింగ్‌లో ఉన్న 1,26,546 మరుగుదొడ్లను వారే నిర్మించాల్సి ఉంది. జిల్లాలో 2012 నుంచి ఇప్పటివరకు 2,34,000 మరుగుదొడ్లు మంజూరయ్యూరుు. ఇప్పటివరకు 79,527 మాత్రమే పూర్తయ్యాయి. మరో 27,927 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయి.
యంత్రాంగం నిర్లక్ష్యంతోనే..
గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ మంజూరు చేసినప్పటికీ నిర్మాణాలు పూర్తి చేసేందుకు అధికారులు సహకరించడం లేదు. నిర్మాణాలు పూర్తయిన వారికి కొంత మొత్తం బిల్లులు చెల్లించడం, అసలే రాకపోవడం, సాంకేతిక సాకులతో బిల్లుల ఎగవేత వంటి కారణాలతో అర్ధాంతరంగా ఆపేస్తున్నారు.
అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లు స్టోరేజీ గదులుగా మారుతున్నారుు. మరుగుదొడ్ల ఆవశ్యకతపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేయకపోవడంతో ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా మళ్లీ బహిర్భూమికే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారు బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ మార్గదర్శకాలు విడుదలయ్యాక బిల్లులు చెల్లిస్తామని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.