ఆర్ అండ్ బి రోడ్ల టెండర్ల అర్హత నిబంధనల్లో మార్పులు
బ్లాక్ పీరియడ్ ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంపు
తమ వారికి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దల యత్నం
సాక్షి, అమరావతి: రోడ్ల నిర్మాణ కాంట్రాక్టులన్నీ ఇకపై కూటమి నేతల అనుంగులకే దక్కనున్నాయి. ఇందుకు ప్రభుత్వ పెద్దలు పెద్ద ప్లానే వేశారు. తమ అస్మదీయ, బినామీ కాంట్రాక్టర్లకు అనుకూలంగా రోడ్ల నిర్మాణ కాంట్రాక్టు అర్హత నిబంధనలను సడలించారు. తమ వారు మాత్రమే టెండర్లలో పాల్గొనేలా, ఇతర కాంట్రాక్టర్లు పోటీ పడకుండా అడ్డుకుని మరీ కాంట్రాక్టులు ఏకపక్షంగా కట్టబెట్టేందుకు పక్కా స్కెచ్ వేశారు.
ఇందులో భాగంగా బిడ్లు దాఖలు చేసేందుకు అర్హతగా పరిగణించే కాల పరిమితి (బ్లాక్‌పీరియడ్)ని ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచుతూ ఆర్ అండ్ బి శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు కోవిడ్‌ను కారణంగా చూపించడం గమనార్హం. ఇప్పటివరకు గత ఐదేళ్లలో కాంట్రాక్టు సంస్థలు చేసిన పనుల విలువను అర్హతగా పరిగణించేవారు. ఇక నుంచి గత పదేళ్లలో చేసిన నిర్మాణ పనులను పరిగణనలోకి తీసుకుంటారు.
తద్వారా ప్రస్తుతం అర్హత లేని కాంట్రాక్టు సంస్థలు కూడా టెండర్లలో పాల్గొనేందుకు ప్రభుత్వ పెద్దలు మార్గం సుగమం చేశారు. ఈ పదేళ్ల బ్లాక్ పీరియడ్ సడలింపు 2026–27 వరకు వర్తిస్తుందని కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే రానున్న మూడేళ్లలో చేపట్టే రోడ్ల నిర్మాణ టెండర్లలోనూ వారి ఇష్టానుసారం కాంట్రాక్టులు కట్టబెడతారన్న విషయం స్పష్టమైంది.
పీపీపీ రోడ్ల కాంట్రాక్టులు కట్టబెట్టేందుకే..!
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై టోల్ భారం వేస్తూ పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో త్వరలో రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనుంది. మొత్తం రూ.4 వేల కోట్లతో రాష్ట్ర ప్రధాన, జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి ఇప్పటికే నిర్ణయించింది. అందులో మొదటి దశగా రూ.698 కోట్లతో 3,931 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి కన్సల్టెన్సీలను ఆహ్వానించింది కూడా.
ఈ కాంట్రాక్టులను ప్రభుత్వ పెద్దలు సన్నిహితులకు కట్టబెట్టేందుకే అర్హత నిబంధనలను సడలించినట్టు స్పష్టమవుతోంది. అందుకే కన్సల్టెన్సీల ఎంపిక కోసం ఉత్తర్వులు జారీ చేసిన మంగళవారమే కాంట్రాక్టు సంస్థల అర్హత నిబంధనలను కూడా సడలించింది.
రోడ్ల నిర్మాణాన్ని అస్మదీయ సంస్థలకు ఏకపక్షంగా కట్టబెట్టి, ఆ సంస్థలు వాహనదారుల నుంచి ఐదేళ్ల పాటు టోల్ ఫీజుల రూపంలో భారీగా వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం పక్కాగా కథ నడుపుతోందని ఆర్ అండ్ బి వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment