15 రోజుల్లో 4వేల కిలోమీటర్లు పూర్తి
మోదీ స్ఫూర్తిగా ప్రయాణం
రంగారెడ్డి(తాండూరు): ప్రధాని నరేంద్ర మోదీ ‘స్వచ్ఛ భారత్’ స్ఫూర్తితో తాండూరు పట్టణానికి చెందిన జొల్లు ప్రవీణకుమార్ అనే వ్యక్తి తన ద్విచక్రవాహనంపై చేపట్టిన భారత దేశయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. గత నెల 31వ తేదీన తాండూరులో ప్రారంభించిన ఈ యాత్ర తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, అనంతపురం, కర్నూలు, చిత్తూరుతోపాటు తమిళనాడులో 8 జిల్లాలు, కేరళలో 7 జిల్లాల్లో పూర్తయ్యింది. కర్ణాటకలోని 8 జిల్లాల్లో ఈయాత్ర పూర్తయి ప్రస్తుతం గుల్బర్గా జిల్లాలోకి ప్రవేశించింది. తాండూరు నుంచి ప్రవీణ్‌కుమార్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, వీరశైవ సమాజం ప్రతినిధులు, స్నేహితులు గుల్బర్గాకు వెళ్లి ఆయనను కలిశారు. గుల్బర్గాలోని శ్రీశరణు బసవేశ్వర దేవాలయంలో అప్పాజీని ప్రవీణ్‌కుమార్ కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ ఫోన్‌లో మాట్లాడారు. యాత్ర చేపట్టిన 15 రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో సుమారు 4వేల కి.మీ. పూర్తి చేసినట్టు తెలిపారు. రోజుకు సుమారు 250-300కి.మీ. వరకు ప్రయాణం చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి చోటా ప్రజలు,స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, పోలీసులు మంచి ఆదరణ చూపారన్నారు. స్వచ్ఛభారత్‌తోపాటు భ్రూణ హత్యల నివారణ, మహిళలను గౌరవించడం తదితర అంశాలపై ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు,పట్టణాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు ఆయన చెప్పారు. ఆదివారం గుల్బర్గా నుంచి బీజాపూర్‌కు బయలుదేరనున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు యాత్రలో ఎలాంటి ఇబ్బందులు కలుగలేదని తెలియజేశాడు.