విశాఖకు కలియుగ దైవం
- జూలై 21 నుంచి ‘శ్రీవేంకటేశ్వర వైభవం’ నిర్వహణ
- స్వర్ణభారతి స్టేడియం వేదిక
- తిరుమల తరహాలో సేవలు
- టీటీడీ జేఈఓ భాస్కరరావు వెల్లడి
ఎంవీపీ కాలనీ: తిరుమల తిరుపతి దేవస్థానం, ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా విశాఖలో శ్రీవేంకటేశ్వరస్వామి వైభవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు టీటీడీ జేఈఓ పొలా భాస్కరరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. నగరంలోని స్వర్ణభారతి స్టేడియంలో జూలై 21 నుంచి 29 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా విశాఖలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న వేంకటేశ్వరస్వామి లాంటి విగ్రహాన్ని తయారు చేసి వారం రోజుల పాటు తిరుమలలో జరిగే ప్రతి సేవ ఇక్కడ జరుపుతామన్నారు.
వీటితో పాటు స్వామివారి విశిష్టత భక్తులకు తెలిసేవిధంగా వచ్చే నెల 21, 22 తేదీల్లో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఉత్సవ విగ్రహంతో పాటు అర్చకులు, మేళతాళాలు, పల్లకి, కళాకారులు తిరుమల నుంచి వస్తారన్నారు. తెలంగాణ, సీమాంధ్ర జిల్లాలో రెండు సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వివరించారు.
భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకుని తరించాలని కోరారు. గోవింద కీర్తన కార్యక్రమం విజయవంతంగా చేసేందుకు త్వరలో భజన బృందాలలో ప్రతిభ చూపే నృత్య కళాకారులకు శిక్షణ ఇస్తామన్నారు. కళానీరాజనం కార్యక్రమాన్ని త్వరలో తిరుపతిలో ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో హిందూ ధర్మప్రచార పరిషత్ స్పెషల్ ఆఫీసర్ శ్రీరాం రాఘరాం, ధర్మప్రచార మండలి, పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.