స్వైన్‌ఫ్లూ భయం!.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరువాసులకు స్వైన్‌ఫ్లూ భయం పుట్టుకుంది. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ అనుమానంతో ఒకరు చికిత్సపొందుతున్నారని ప్రచారం జోరందుకుంది. అప్రమత్తమైన జనం మాస్క్‌లు ధరించి తిరుగుతుండటం కనిపించింది. గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. రెండురోజుల క్రితం జిల్లాకు చెందిన ఒకరు హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలతో మృతిచెందటం జిల్లావాసులను భయాందోళనకు గురిచేసింది. అదేవిధంగా పక్క జిల్లాలైన చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోనూ స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతుండటంతో భయం మరింత పెరిగింది.
తాజాగా నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మంగళవారం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి స్వైన్‌ఫ్లూ లక్షణాలతో చేరారని సమాచారం. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారని తెలుసుకున్న వైద్యులు, సిబ్బంది మొత్తం మంగళవారం మాస్క్‌లు ధరించే గడిపినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆస్పత్రిలో పనిచేసే ఓ డాక్టర్ సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న మీడియా ఆస్పత్రికి చేరుకుని స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఓ వ్యక్తి వచ్చినట్లు సమాచారం వచ్చిందని వైద్యులను అడిగారు. అయితే వైద్యులు ఆ విషయాన్ని ధృవీకరించలేదు.
అదేవిధంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సైతం అటువంటి కేసులేవీ లేవని తేల్చిచెబుతున్నారు. అయితే ఈ విషయం నగరమంతా వ్యాపించింది. జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడుతున్న వారు మంగళవారం భయంతో ఆస్పత్రులకు పరుగులు తీశారు. ముందు జాగ్రత్త చర్యగా పరీక్షలు చేసుకోవటం కనిపించింది. నగరంలోని ప్రభుత్వాస్పత్రితో పాటు ప్రైవేటు వైద్యుల వద్దకు అధికంగా వెళ్లటం గమనార్హం. ఇదే అదనుగా కొందరు ప్రైవేటు వైద్యులు వివిధరకాల పరీక్షల పేరు తో జనం నుంచి భారీగా డబ్బులు గుంజుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.