సాక్షి, హైదరాబాద్: నగర వాసికి ఆన్‌లైన్‌లో పరిచయమై పంపిణీ కోసం ఉచితంగా మాస్క్‌లు పంపిస్తున్నానంటూ ఎర వేసి రూ.24 లక్షలు స్వాహా చేసిన కేసులో లిల్లీ అనే యువతి కీలకంగా మారింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెతో పాటు మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ వ్యవహారంలో సూత్రధారి బెంజిమెన్‌ను మంగళవారం బెంగళూరు జైలు నుంచి పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చి అరెస్టు చేశారు.
⇔ బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఫేస్‌బుక్ ద్వారా కెనడాలో నివసిస్తున్న వ్యక్తిగా చెప్పుకొన్న బెంజిమన్ పరిచయమయ్యాడు. నైజీరియాకు చెందిన ఇతగాడు వాస్తవానికి బెంగళూరులో స్థిరపడ్డాడు. నగరవాసి– కెనడా వాసిగా చెప్పుకొన్న నైజీరియన్ దాదాపు రెండు నెలల పాటు చాటింగ్ చేసుకున్నారు.
⇔ ఈ నేపథ్యంలో తాను ఓ స్వచ్ఛంద సేవా సంస్థను నిర్వహిస్తున్నామని, ప్రపంచ వ్యాప్తంగా అనేక పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజలకు వీలైనంత సహాయం చేస్తుంటామని సదరు నైజీరియన్ నమ్మబలికాడు.
⇔ కరోనా ప్రభావం హైదరాబాద్‌లో తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తాను సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఎర వేశాడు. ఇందులో భాగంగా తమ సంస్థ తరఫున కొన్ని మాస్క్‌లు, శానిటైజర్లు, ఇతర వైద్య సామగ్రి, కొంత నగదు పంపిస్తున్నామని నగరవాసితో చెప్పాడు. వీటి విలువ దాదాపు రూ.2 కోట్లకుపైగా ఉంటుందంటూ నమ్మించాడు. దీంతో నగరవాసి వాటిని పంపాలని, హైదరాబాద్‌లో ఉన్న అవసరార్ధులకు అందిస్తామని చాటింగ్‌లోనే చెప్పాడు.
⇔ ఇది జరిగిన రెండు రోజులకు ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ విభాగం అధికారిణి అంటూ బెంగళూరులో నివసిస్తున్న లిల్లీ నగరవాసికి ఫోన్ చేసింది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఈమె నైజీరియన్లతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది.
⇔ ‘మీ పేరుతో కెనడా నుంచి పెద్ద పెద్ద పార్శిల్స్ వచ్చాయి’ అంటూ నగర వాసికి చెప్పింది. అయితే విదేశం నుంచి వచి్చన వాటిని పొందాలంటే కస్టమ్స్ క్లియరెన్స్ తీసుకోవాని స్పష్టం చేసింది. ఆ పార్శిల్స్‌లో మాస్క్‌లు, శానిటైజర్లు, పీపీఈ కిట్లతో పాటు పెద్ద మొత్తంలో డాలర్లు కూడా ఉన్నట్లు గుర్తించామని నమ్మబలికింది.
⇔ ఇలా బాధితుడిని ముగ్గులోకి దింపిన బెంజిమన్, లిల్లీ సహా మరో నైజీరియన్ కస్టమ్స్ సహా వివిధ సుంకాల పేరు చెప్పి దఫదఫాలుగా రూ. 24 లక్షలు బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నారు. ఆపై అసలు విషయం తెలిసిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
⇔ దీన్ని ఇన్‌స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి సాంకేతికంగా దర్యాప్తు చేశారు. బాధితుడు డబ్బు పంపిన బ్యాంకు ఖాతాలు బెంగళూరుకు చెందిన అశోక్ పేరుతో ఉన్నాయి. అతడిని పట్టుకున్న నేపథ్యంలోనే కమీషన్ తీసుకుని తన బ్యాంకు ఖాతాలను లిల్లీ అనే యువతికి అందించానని అంగీకరించాడు.
⇔ దీంతో అశోక్‌ను అరెస్టు చేసిన పోలీసులు ప్రధాన సూత్రధారి బెంజిమన్‌తో పాటు లిల్లీ, మరో నిందితుడి కోసం గాలించారు. ఈ తరహా నేరాలను వీళ్లు బెంగళూరులోనూ చేయడంతో అక్కడ రెండు కేసులో నమోదయ్యాయి. ఇటీవల అక్కడి పోలీసులు బెంజిమెన్, లిల్లీలతో సహా ముగ్గురిని అరెస్టు చేశారు.
⇔ ఈ విషయం గుర్తించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అక్కడకు వెళ్లి పీటీ వారెంట్‌పై నిందితుల్ని తీసుకుని రావాలని భావించారు. ఈలోపే బెయిల్ పొందిన లిల్లీతో పాటు మరో నైజీరియన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బెంజిమెన్ మాత్రం జైల్లోనే ఉండటంతో మంగళవారం నగరానికి తీసుకువచ్చారు. ఇతడిని లోతుగా విచారించడం కోసం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment