
గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
సాక్షి, కడప : స్వైన్ ఫ్లూ రాయలసీమను వణికిస్తోంది. ఇప్పటికే పొరుగున ఉన్న చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో స్వైన్‌ఫ్లూ భయకంపితులను చేస్తుండగా.. చాపకింద నీరులా జిల్లాలోనూ ప్రవహిస్తోంది. ఈ ఏడాది జూలైలో జమ్మలమడుగుకు చెందిన ఒక మహిళ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. అనధికారికంగా మరో ముగ్గురు మత్యువాత పడ్డారు. అయితే వైద్య ఆరోగ్య శాఖ రికార్డుల్లో మాత్రం ఇప్పటికీ ఒకరు మాత్రమే మృతి చెందినట్లుగా చూపించారు. గతేడాది కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖను స్వైన్ ఫ్లూ భయ పెట్టిందనే చెప్పవచ్చు. బుధవారం చక్రాయపేట మండలం నెర్సుపల్లెకు చెందిన చంద్ర స్వైన్ ఫ్లూతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని ‘సాక్షి’ తెలియజేస్తోంది.
2017లోనూ భారీగా కేసులు నమోదు
జిల్లాలో గతేడాది స్వైన్‌ఫ్లూ కేసులు భారీగా నమోదయ్యాయి. తెలంగాణ, కేరళతోపాటు రాష్ట్రంలోని వైఎస్సార్ జిల్లాలో కూడా స్వైన్‌ఫ్లూ ఎక్కువగానే కనిపించింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారమే 50 కేసులు నమోదయ్యాయి. కొంత మంది రిమ్స్‌లో ప్రత్యేక వార్డులో చికిత్స పొందగా.. మరి కొంత మంది తిరుపతి స్విమ్స్, బెంగళూరు, హైదరాబాద్‌లో కూడా చికిత్స ద్వారా కోలుకున్నారు. అయితే ఇటీవల మరో ముగ్గురు కూడా స్వైన్‌ఫ్లూ బారిన పడి ప్రాణాలు వదిలారు.
సరిహద్దు జిల్లాల్లో అలజడి
వైఎస్సార్ జిల్లా ఆనుకుని ఉన్న చిత్తూరు జిల్లాలో స్వైన్‌ఫ్లూ కలవర పెడుతోంది. అందులోనూ జిల్లాలో 2018 జూలై 6న జమ్మలమడుగుకు చెందిన ఓ మహిళ స్వైన్ ఫ్లూ సోకి హైదరాబాదు అపోలో ఆస్పత్రిలో మృతి చెందిన ఘటన కూడా ఉన్న నేపథ్యంలో.. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే జిల్లాలో స్వైన్ ఫ్లూ ఇటీవల ఎక్కువగా కనిపిస్తుండటంతో ఆందోళన రేకెత్తుతోంది. చిత్తూరు, కర్నూలులో స్వైన్‌ఫ్లూతో పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తుండగా, పలు వురు పెద్దాస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు.
ఎప్పుడూ కనిపించని వ్యాధి
సాధారణంగా జిల్లాలో వైరల్ జ్వరాలు నమోదవుతుంటాయి. స్వైన్ ఫ్లూ కేసులు అరుదుగా ఉంటా యి. అలాంటిది ఈ వ్యాధి 2012 నుంచి కనిపిస్తోంది. ఇటీవల కాలంలో విజృంభించడం వైద్య ఆరోగ్య శాఖను ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాకు చెందిన పలువురు వ్యాధి బారిన పడినా.. హైదరాబాద్, తిరుపతి, వేలూరు, కర్నూలు పెద్దాస్పత్రుల్లో చికిత్స పొందుతూ గతంలో మృత్యువాత పడడంతో రికార్డులకు ఎక్కనట్లు తెలు స్తోంది. జిల్లాలోని ఆస్పత్రులకు సంబంధించి ఎవరూ కూడా స్వైన్‌ఫ్లూతో రాకపోవడం ఊరటనిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ కూడా ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్లలో స్వైన్ ఫ్లూకు సంబం ధించి కౌంటర్లు పెట్టి మందులను అందుబాటులో ఉంచింది. అలాగే పలు పెద్దాస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ వార్డులను కూడా ఏర్పాటు చేశారు. అయితే చక్రాయపేట మండలం నెర్సుపల్లెకు చెందిన చంద్ర స్వైన్ ఫ్లూ సోకి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందడం కలకలం రేపింది.
జిల్లాలో కలకలం
చక్రాయపేట : నెర్సుపల్లెలో ఓ వ్యక్తి స్వైన్ ఫ్లూతో బుధవారం మృతి చెందిన సంఘటన జిల్లాలో కలకలం రేపింది. వివరాలలోకి వెళితే.. బేల్దారి పూల చంద్ర(50)కు 10 రోజుల క్రితం జలుబుతో కూడిన జ్వరం వచ్చింది. సురభి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకోగా.. జ్వరం తగ్గకపోవడంతో కడప రిమ్స్‌కు వెళ్లారు. అక్కడ కూడా తగ్గకపోవడంతో.. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చంద్రకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. స్వైన్‌ఫ్లూ అని వైద్యులు నిర్ధారించారు. వైద్యం చేయించుకుంటూ అక్కడే మృతి చెందాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉండగా.. ఒక కుమార్తెకు వివాహమైంది. కుటుంబ యజమాని చనిపోవడంతో వారి కుటుంబం వీధిన పడింది. స్వైన్‌ఫ్లూతో చంద్ర మృతి చెందడంతో.. గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
భయ పడొద్దంటున్న డాక్టర్లు
గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు చేస్తామని వైద్యులు తెలిపారు. స్వైన్‌ఫ్లూ అనుమానత వ్యక్తులను కడప రిమ్స్‌కు పంపించి వైద్యం చేయిస్తామని వారు పేర్కొన్నారు. ఎవరూ భయపడవద్దని వివరించారు.
మందులు ఇవ్వని వైద్యులు
చంద్ర కుటుంబ సభ్యులకు, గ్రామంలోని ప్రతి ఒక్కరికి జిల్లా వైద్య శాఖ అధికారి, డీఎంహెచ్‌ఓ అసిఫ్, డాక్టర్ ఏపీడీమాలజిస్ట్ డాక్టర్ ఖాజా, ఎంపీహెచ్‌ఓ వెంకటరెడ్డి, ఎంపీహెచ్‌ఓ ప్రసాద్, డాక్టర్ ఖాజామోద్ధీన్‌తోపాటు సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ముందస్తు నివారణలో భాగంగా ఎలాంటి మందులు పంపిణీ చేయలేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
పరామర్శించిన వైఎస్ భాస్కర్‌రెడ్డి
బాధిత కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్‌చార్జి వైఎస్ భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. మృతి చెందిన పూల చంద్రకు నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment