సిండికేట్ కిక్
- పాత సిండికేట్లలో కొత్త వ్యాపారులు
- టీడీపీ నేతల దన్ను
- వన్‌టౌన్ మద్యం దుకాణానికి అత్యధికంగా 75 మంది పోటీ
- ఎకాయెకిన జిల్లా దుకాణాల కేటాయింపు
- విశాఖ శివార్లలోని వాటికి ఒక్కో దరఖాస్తే
విశాఖపట్నం: మద్యం సిండికేట్లు మళ్లీ బరితెగించాయి. టీడీపీ నేతల దన్ను చూసుకుని భారీ ఎత్తున దుకాణాలను చేజిక్కించుకున్నారు. నగర శివార్లలోని 70 దుకాణాలను సొంతం చేసుకున్నారు. ఆ దుకాణాలకు పోటీ లేకుండా చూసుకున్నారు. అందుకు ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారుల సహకారం తీసుకున్నారు. నగర శివారుల్లోనే(5 కిలోమీటర్లలోపు ప్రాంతాలు) నిత్యం మద్యం అమ్మకాలు గణనీయంగా ఉంటాయి. అక్కడి దుకాణాలపై పెద్దగా అధికారుల కన్నుపడదు.
సెలవు రోజుల్లోనూ దర్జాగా దుకాణం వెనుక నుంచి అమ్మకాలు యథేచ్ఛగా సాగించొచ్చు. అందుకే ఆ దుకాణాలకు వింత కాకపోతే ఒక్క దరఖాస్తు కూడా అదనంగా రాకపోవడమేమిటి అని అనుకుంటున్నారు. ఆ దుకాణాలను చేజిక్కించుకునేందుకు సిండికేట్లంతా పెద్ద ప్రణాళిక వేశారు. ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారుల సహకారంతో కొత్త మద్యం విధానంలోనూ తమదే పై చేయి అని నిరూపించుకున్నారు.
ఆదాయమొచ్చే అన్నీ దుకాణాలను చేజిక్కించుకునేందుకు అడ్డదారులన్నీ తొక్కారు. కొత్తవారిని భయపెట్టారు. ఎంతోకొంత వాటా ఇస్తామంటూ మభ్యపెట్టారు. అంతగా ఆదాయం రాదనుకున్న 108 దుకాణాలకు దరఖాస్తు లేకుండా చేశారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారు.
వేగంగా సాగిన కేటాయింపు
విశాఖ జిల్లాలో కొత్త మద్యం దుకాణాల కేటాయింపు శరవేగంగా సాగింది. కైలాసపురం డాక్ లేబర్ బోర్డ్ (డీఎల్‌బీ) కల్యాణ మండపంలో శనివారం సాయంత్రం లాటరీ ద్వారా దుకాణాలను జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఎంపిక చేశారు. నాలుగు దుకాణాల కేటాయింపును ఉత్సాహంగా లాటరీ ద్వారా ఎంపిక చేసిన జేసీ అనంతరం లాటరీ తీసే బాధ్యతను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎం. సత్యనారాయణకు అప్పగించారు. ఆయన అందరినీ భాగస్వాములను చేస్తూ ఉత్సాహంగా దుకాణాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేశారు. జిల్లాలో 406 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తే అందులో 298 దుకాణాలకు 3312 మంది దరఖాస్తులు సమర్పించారు.
విశాఖ అర్బన్ ప్రాంతాల్లోని 55 దుకాణాలకు 1212 మంది పోటీపడ్డారు. 108 దుకాణాలకు ఒక్క దరఖాస్తు రాకపోగా జిల్లావ్యాప్తంగా ఉన్న 70 దుకాణాలకు ఒక్కొక్క దరఖాస్తు చొప్పున 70 దరఖాస్తులు అందాయి. వీరందరికీ దుకాణాలు దక్కే చాన్స్‌లున్నాయి. విశాఖ అర్బన్‌లోని 56వ వార్డులో మూడు దుకాణాలకు దరఖాస్తులు కోరగా అక్కడి నుంచి రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. నగరంలోని వన్‌టౌన్ ప్రాంతాల్లోని దుకాణాలకు గట్టిపోటీ ఎదురైంది. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న దుకాణానికి ఏకంగా 75 మంది పోటీపడ్డారు. జిల్లావ్యాప్తంగా ఉన్న దుకాణాలలో ఈ దుకాణానికే భారీ డిమాండ్ నెలకొంది.
నగర శివార్ల దుకాణాలకు ఒక్కో దరఖాస్తే..!
నగర శివారుల్లోని దుకాణాలకు ఒక్కొక్క దరఖాస్తులే వచ్చాయి. దీంతో దరఖాస్తు చేసిన వారికే దుకాణం సొంతం కానుంది. గాజువాక యూనిట్‌లో ఇలాంటి దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయి. అగనంపూడి, గాజువాక, చినగదిలి, పీఎం పాలెం, నరవ, కూర్మన్నపాలెం, ఆదిరెడ్డిపాలెం, వేపగుంట, కోటనరవ, వేములవలస, పిలకవానిపాలెం, పాత డెయిరీ ఫాం, రాపర్తిపాలెం వంటి చోట్ల ఒక్కొక్క దరఖాస్తే చేరింది.