Syndicates
-
సిండికేటుగాళ్లు!
ప్రభుత్వ ఖజానాకు గండి కొడదామనుకున్న టీడీపీ కార్యకర్తల పాచిక పారలేదు. వీరికి అండగా నిలబడ్డ ప్రజాప్రతినిధులు రంగప్రవేశం చేసినప్పటికీ భంగపాటు తప్పలేదు. వేలంలో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలు సిండికేట్ కావడంతో చిత్తూరు మార్కెట్ టెండర్ల వేలం వాయిదా పడింది. ఈనెల 15వ తేదీ మూడోసారి మరోమారు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. చిత్తూరు అర్బన్: చిత్తూరులో కూరగాయల మార్కెట్ల నుంచి రుసుము వసూలు చేసుకోవడానికి మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన బహిరంగ వేలం మరోమారు వాయిదా పడింది. గతనెల 6న సైతం వాయిదా పడ్డ టెండర్ల ప్రక్రియను అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో రెండోసారి కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. నగరంలో ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేసుకునేవారి నుంచి నామమాత్రపు రుసుము (గేటు) వసూలు చేసుకోవడానికి 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సర్కారువారి పాటను మునిసిపల్ కమిషనర్ ఓబులేసు రూ.65.22 లక్షలుగా నిర్ణయించారు. గత మూడేళ్ల మార్కెట్ టెండర్ల నుంచి సరాసరి ధరను నిర్ణయించడం టీడీపీ నేతలకు నచ్చలేదు. తమనే నమ్ముకున్న కార్యకర్తలకు ఉపాధి చూపిద్దామనుకుంటే ఇష్టానుసారం సర్కారి పాట నిర్ణయించడం ఏమిటని ఏకంగా మునిసిపల్ అధికారులనే నేతలు నిలదీశారు. అయితే దీనిపై అధికారులు కూడా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. చేజేతులా ఉద్యోగానికే ప్రమాదం తెచ్చుకునే పనులు తాము చేయలేమంటూ అధికారులు నిక్కచ్చిగా తేల్చిచెప్పేశారు. నేతల ఆశీస్సులతో వేలానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలు సిండికేట్ అయి వేలంలో పాల్గొనలేదు. వేలానికి సంబంధించిన టెండరు బాక్సు తెరచిచూడగా.. లోకనాధం నాయుడు, జయపాల్ నాయుడు ఇద్దరు మాత్రమే టెండర్లు దాఖలు చేశారు. అదికూడా ఒకరు రూ.40 లక్షలకు, మరొకరు రూ.41 లక్షలకు టెండర్లు వేశారు. ఇది సర్కారు పాటకు చాలా తక్కువగా ఉండటంతో ఎవరికీ ఇవ్వలేమని, మునిసిపల్ ఖజానాకు నష్టం వాటిల్లే పనులు తాము చేయలేమని చెబుతూ టెండర్ల ప్రక్రియను ఈనెల 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ ఓబులేసు ప్రకటించారు. ఇక రూ.8.26 లక్షల కనీస ధర నిర్ణయించిన ఎన్టీఆర్ బస్టాండుకు రూ.5 లక్షలు, రూ.1.57 లక్షలు నిర్ణయించిన జంతువధశాలకు రూ.85 వేలకు బాక్సు టెండర్లు వేయడంతో వీటిని కూడా ఇవ్వలేమని తేల్చిచెప్పారు. అయితే గతేడాది తొమ్మిది నెలల పాటు గేటు వసూలు చేసుకునేందుకు నిర్వహించిన మార్కెట్ వేలంలో ఏకంగా రూ.90 లక్షలు పలకగా.. ఎన్టీఆర్ బస్టాండుకు రూ.15.27 లక్షలు, జంతువధశాల రూ.2.70 లక్షలు çపలకడం గమనార్హం! ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను అడ్డుకునేందుకు అధికార పార్టీ నేతలే ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. -
ఫుల్లుగా తాగించేద్దాం..
- ఆదాయం కోసం సర్కారు సరికొత్త ఎత్తుగడ - సుప్రీంకోర్టు ఆదేశాలు తుంగలోకి.. - నగర, పురపాలక సంస్థల్లో యథాస్థానాల్లోనే షాపుల కొనసాగింపు? - పట్టణాల పరిధిలో ఎన్‌హెచ్, ఎస్హెచ్లను ఎండీఆర్ పరిధిలోకి తీసుకువచ్చే యత్నం - ఇప్పటికే కేబినేట్ భేటీలో నిర్ణయం - నేడో, రేపో జీఓ విడుదల - ఎక్సైజ్ శాఖకు చేరిన మౌఖిక ఆదేశాలు మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న చంద్రబాబు సర్కారు సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతోంది. ఫుల్లుగా తాగించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. మద్యం ద్వారా అధిక ఆదాయం తెచ్చిపెడుతున్న నగర, పురపాలక సంస్థల్లో.. జాతీయ, రాష్ట్ర రహదారులకు దగ్గరగా ఇప్పుడున్న షాపులను యథాస్థానాల్లోనే కొనసాగించేందుకు సరికొత్త ఎత్తుగడ వేసింది. ఇందుకు సుప్రీం ఆదేశాలు ఆటంకం కావడంతో.. పట్టణ ప్రాంతాల్లోని జాతీయ, రాష్ట్ర రహదారులను మున్సిపల్ డెవలప్మెంట్ రోడ్లు(ఎండీఆర్)గా మార్చేందుకు కసరత్తు చేపట్టింది. మండపేట : రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జాతీయ (ఎన్‌హెచ్), రాష్ట్ర (ఎస్‌హెచ్) రహదారులకు కాస్త దూరంగా మద్యం షాపులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆ తేదీ నుంచి నూతన విధానం అమలులోకి వచ్చింది. రాష్ట్రంలో మద్యం పాలసీ జూలై 1వ తేదీ నుంచి జూన్ 31వ తేదీ వరకు ఉండటంతో జూలై 1వ తేదీ నుంచి అమలు చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం 20 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో మద్యం దుకాణాన్ని నేషనల్, స్టేట్ హైవేలకు 220 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి. 20 వేలకు పైబడి జనాభా ఉన్న ప్రాంతాలైతే 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి. సగానికి పైగా వ్యాపారం పట్టణాల్లోనే.. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే మద్యం వ్యాపారం ఎక్కువగా జరిగేది పట్టణ ప్రాంతాల్లోనే. జిల్లావ్యాప్తంగా 555 మద్యం షాపులుండగా, వీటిలో ఆయా నగర, పురపాలక సంస్థల్లో మొత్తం 126 షాపులతోపాటు 34 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో 31, కాకినాడలో 41, అమలాపురం మున్సిపాలిటీలో 7, మండపేటలో 7, రామచంద్రపురంలో 7, పిఠాపురంలో 7, పెద్దాపురంలో 10, సామర్లకోటలో 7, తునిలో 9 మద్యం షాపులున్నాయి. జిల్లావ్యాప్తంగా రోజుకు సుమారు రూ.1.9 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. వీటిలో సగానికి పైగా అమ్మకాలు పట్టణ ప్రాంతాల్లోనే జరగడం గమనార్హం. మద్యం సిండికేట్ల ఆందోళనతో.. జూలై 1వ తేదీ నుంచి నూతన విధానం అమలులోకి రానుండగా.. కొత్త షాపుల ఏర్పాటు తలకు మించిన భారమవుతుందని, కొత్త నిబంధనలతో అమ్మకాలు తగ్గిపోతాయని మద్యం సిండికేట్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రభుత్వ పెద్దలకు భారీగానే ముడుపులు ముట్టజెప్పినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతోపాటు ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరును కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా పాలకులు సరికొత్త విధానాన్ని తెరపైకి తెస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ, రాష్ట్ర రహదారుల నుంచి 220 మీటర్ల లోపే మద్యం షాపులు ఏర్పాటు చేసుకునే వీలుండగా.. పట్టణ ప్రాంతాల్లో ఈ దూరం రెట్టింపునకు మించి పెరిగిపోతోంది. దూరం తక్కువగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలపై పెద్దగా ప్రభావం ఉండకపోయినా, పట్టణాలకు వచ్చేసరికి అమ్మకాలపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. సుప్రీం తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా.. సుప్రీంకోర్టు ఎన్‌హెచ్, ఎస్హెచ్లను మాత్రమే తీర్పులో ఉటంకించడంతో నగర, పురపాలక సంస్థల్లోని జాతీయ, స్టేట్ హైవేలను మున్సిపల్ డెవలప్మెంట్ రోడ్లు(ఎండీఆర్)గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే కేబినేట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశం ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. నేడో, రేపో ఈ మేరకు జీఓ విడుదల కావచ్చని ఎక్సైజ్ వర్గాలంటున్నాయి. దీనిపై ఇప్పటికే తమకు మౌఖికంగా సమాచారం అందినట్టు ఒక ఎక్సైజ్ అధికారి తెలిపారు. ఎండీఆర్ పరిధిలోకి తీసుకురావడం ద్వారా మద్యం షాపులను ఇప్పుడున్నచోటే కొనసాగించుకునేందుకు వ్యాపారులకు వీలు కల్పించనున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా సర్కారు చేస్తున్న ప్రయత్నాలు విమర్శలకు తావిస్తున్నాయి. స్థానిక సంస్థలపై భారం జాతీయ, రాష్ట్ర రహదారుల అభివృద్ధి ఇప్పటివరకూ ఆయా శాఖల పరిధిలోనే జరిగేది. జాతీయ రహదారుల అభివృద్ధికి అయ్యే వ్యయాన్ని కేంద్రం భరించేది. రాష్ట్ర రహదారి అయితే ఆర్అడ్బీ నుంచి నిధుల విడుదల జరిగేది. మద్యం వ్యాపారుల కోసం ఆయా రోడ్లను నగర, పురపాలక సంస్థల పరిధిలోకి తీసుకురానుండటంతో వాటి నిర్వహణ, అభివృద్ధికి అయ్యే కోట్లాది రూపాయలు భారాన్ని ఆయా స్థానిక సంస్థలే భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే స్థానిక సంస్థల పరిస్థితి అంతంతమాత్రంగా ఉండగా.. వీటి రూపంలో కోట్లాది రూపాయల అదనపు భారం పడటంతో పట్టణ ప్రాంతాల అభివృద్ధి కుంటుపడుతుందని పలువురు విమర్శిస్తున్నారు. -
ఖజానాకు పచ్చ గండి
► రేవుల వేలంలో సిండికేట్లు ► టెండర్లు దక్కించుకున్న తమ్ముళ్లు ► మాదిపాడు బల్లకట్టుకు దాఖలు కాని టెండర్లు ► జెడ్పీకి రూ.76 లక్షల 35 వేలు ఆదాయం గుంటూరు వెస్ట్ : పచ్చచొక్కాల నాయకులంతా ఒక్కటై ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపెట్టారు. జిల్లా పరిషత్ నిర్దేశించిన ధరలకు మాత్రమే పాటలు పాడి మమ అనిపించారు. సిండికేట్‌గా మారిన కాంట్రాక్టర్లు పాటలను ముందుకు సాగకుండా చేసి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. పాటల్లో పాల్గొన్నవారి నోళ్లను నోట్ల కట్టలతో కట్టేసిన నాయకులు టెండర్లు దక్కించుకున్న అనంతరం వారికి నగదు పంచారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలోని రేవులకు ఈ నెల 2న పాటలు నిర్వహించగా మిగిలిపోయిన మూడు బల్లకట్టులు, ఆరు పడవ రేవులకు టెండర్లు స్వీకరణ, బహిరంగ వేలం నిర్వహించేందుకు అధికారులు సోమవారం తగిన ఏర్పాట్లు చేశారు. మాచవరం మండలంలోని గోవిందాపురం, దాచేపల్లి మండలంలోని రామాయగూడెం బల్లకట్టులకు మాత్రమే వేలంపాటలు జరిగాయి. గోవిందాపురం బల్లకట్టుకు ఉదయం 10 గంటల నుంచి టెండర్లు స్వీకరించారు. అనంతరం 12 గంటల నుంచి బహిరంగ వేలం నిర్వహించారు. తక్కువ ధరలకే.... జెడ్పీ డిప్యూటీ సీఈవో జి.జోసఫ్‌కుమార్, అక్కౌంట్స్ ఆఫీసర్ సిహెచ్.రవిచంద్రారెడ్డి, వివిధ విభాగాల పర్యవేక్షకులు జె.శోభారాణి, మహేష్, త్యాగరాజు, విజయ్‌కుమార్, సిబ్బంది కుమార్‌రెడ్డి, పూర్ణచంద్రారెడ్డి, మూర్తి, జి.శ్రీనివాస్ తదితరులు టెండర్లు, వేలం ప్రక్రియను నిర్వహించారు. గోవిందాపురం బల్లకట్టుకు జెడ్పీ పాటగా రూ.45 లక్షలుగా నిర్ణయించింది. 20 మంది వరకు పాటలో పాల్గొనేందుకు డిపాజిట్లు చెల్లించారు. అమరావతి మండలం జూపూడికి చెందిన వై.రామకోటేశ్వరరావు రూ.45 లక్షల 30 వేలకు టెండరును దక్కించుకున్నారు. జెడ్పీ నిర్దేశించిన పాటకు కేవలం రూ.30 వేలు మాత్రమే పెంచి కాంట్రాక్ట్ దక్కించుకోవడం వెనుక చాలాతతంగమే నడిచింది. పాటలో పాల్గొన్న ఏ ఒక్కరూ కూడా నోరుమెదపకపోవడం గమనార్హం. తెలంగాణా రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో జరిగిన వేలంపాటలో ఆ జిల్లావాసులు ఈ బల్లకట్టును రూ.65 లక్షలు వెచ్చించి దక్కించుకున్నారు. దానితోపోల్చితే ఇక్కడివాళ్లు రూ.15 లక్షల వరకు తక్కువకు పాడుకున్నారు. రామాయగూడెం బల్లకట్టుకు 39 మంది డిపాజిట్లు: దాచేపల్లి మండలం రామాయగూడెం బల్లకట్టుకు మధ్యాహ్నం 3 గంటల నుంచి బహిరంగ వేలం నిర్వహించారు. జెడ్పీ పాటగా రూ.31 లక్షలు నిర్ణయించారు. వేలంలో పాల్గొనేందుకు 39 మంది డిపాజిట్లు చెల్లించారు. పిడుగురాళ్ల మండలం కరాలపాడుకు చెందిన ఎం.వెంకటేశ్వరరెడ్డి రూ.31 లక్షల 5 వేలకు బల్లకట్టును దక్కించుకున్నారు. ఈ రెండు బల్లకట్టుల ద్వారా జెడ్పీకి రూ.76 లక్షల 35 వేలు ఆదాయం వచ్చింది. ఈనెల 2వ తేదీన వేలంపాటలు నిర్వహించగా తాడువాయి, మాదిపాడు, గింజుపల్లి, పుట్టపల్లి, వల్లభాపురం పడవ రేవులు మాత్రమే పూర్తయ్యాయి. అచ్చంపేట మండలంలోని చామర్రు, చింతపల్లి, మాదిపాడు(బల్లకట్టు), దాచేపల్లి మండలం రామాపురం, గురజాల మండలం దైద తదితర రేవులు వాయిదా వేశారు. -
సిండి‘కేట్ల’ గుప్పిట్లో మద్యం వ్యాపారం
►ఎంఆర్పీ ఉల్లంఘనపై కమిషనర్ సీరియస్ ►చర్యలకు తటపటాయిస్తున్న అధికారులు ►ధరల నియంత్రణ అమలు చేయాల్సిందే : డిప్యూటీ కమిషనర్ ►క్రాస్ చెకింగ్ కోసం టీంల ఏర్పాటుకు ఆదేశం కర్నూలు: జిల్లాలో మద్యం వ్యాపారులు సిండికేట్లుగా మారి అన్ని రకాల మద్యం సీసాలపై రూ.20 నుంచి రూ.40 వరకు ధర పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ బృందం ఇటీవల గూళ్యంలో మద్యం దుకాణంపై దాడి చేసి ధరల ఉల్లంఘనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆలూరులో సీఐగా పనిచేస్తూ శాఖాపరమైన చర్యల్లో భాగంగా మాదవరం చెక్‌పోస్టుకు ఇటీవలే బదిలీ అయిన సీఐ మహేష్‌కుమార్‌పై ఎక్సైజ్ కమిషనర్ ముఖేష్‌కుమార్ మీనా సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖలో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. జిల్లాలో మొత్తం 209 మద్యం దుకాణాలు, 36 బార్లు ఉన్నాయి. గత ఏడాది జులై నుంచి కొత్తవారికి అనుమతులిచ్చారు. కొంతకాలం నిర్ణీత ధరలకే విక్రయాలు జరిపిన వ్యాపారులు స్థానికంగా ఎక్సైజ్ అధికారులతో ఒప్పందాలు కుదుర్చుకుని ఎక్కడికక్కడ సిండికేట్లుగా మారి అధిక ధరలకు విక్రయాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. మద్యం వ్యాపారులకు అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలు ఉండటంతో స్థానికంగా ఎక్సైజ్ అధికారులు కూడా వ్యాపారులకు వంత పాడక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల డిప్యూటీ కమిషనర్లతో హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో కమిషనర్ ఆదేశాలిచ్చారు. రాష్ట్రస్థాయిలో బృందాలు జిల్లాకు తనిఖీలకు వచ్చి కేసులు నమోదు చేస్తుండటంతో జిల్లాస్థాయి ఎక్సైజ్ అధికారులు ఇరకాటంలో పడ్డారు. కొంతకాలంగా యథేచ్ఛగా అధిక ధరలకు విక్రయాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులను కట్టడి చేయడం ఎక్సైజ్ అధికారులకు కష్టసాధ్యంగా మారింది. అధికారుల చర్యలు ఫలించేనా: ఎక్సైజ్ కమిషనర్ హెచ్చరికల నేపథ్యంలో డిప్యుటీ కమిషనర్ నాగలక్ష్మి ధరల నియంత్రణ అమలుపై దృష్టి సారించారు. శనివారం కర్నూలు, నంద్యాల ఇన్చార్జి ఎక్సైజ్ సూపరింటెండెంట్లు హెప్సీబా రాణి, ఫయాజ్‌లతో పాటు సీఐలతో ప్రత్యేకంగా సమావేశమై ఎంఆర్పీ ఉల్లంఘనపై చర్చించారు. ఎక్కడైనా సిండికేట్లకు వంత పలికితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్రాస్ చెకింగ్ కోసం టీములను ఏర్పాటు చేశారు. ఒక సర్కిల్ పరిధిలోని దుకాణాలను మరో సర్కిల్ పరిధిలోని అధికారులు తనిఖీలు చేసి ఎంఆర్పీ ఉల్లంఘన బయటపడితే కేసులు నమోదు చేసే విధంగా నిర్ణయించారు. ఎంఆర్పీ ధరల ఉల్లంఘన వ్యవహారంలో సీఐ మహేష్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు భయం ఒకవైపు అధికారుల్లో ఉన్నప్పటికీ వ్యాపారులకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండటంతో నిక్కచ్చిగా ధరల నియంత్రణ అమలు చేయడానికి తటపటాయిస్తున్నారు. స్థానిక అధికారుల సహకారం లేకుండా జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం విక్రయాలు అమలు సాధ్యమేనా అనే చర్చ జరుగుతోంది. -
సిండి‘కేటు’గాళ్లు
సాక్షి, గుంటూరు: చెప్పేదొకటి... చేసేది మరొకటి.. ఇది జిల్లాలో టీడీపీ నేతల తీరు. ఒకపక్క టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు బెల్టుషాపులను రద్దు చేస్తున్నట్లుగా ప్రమాణ స్వీకారం సమయంలోనే ఫైల్‌పై సంతకం చేయగా జిల్లాలో ఆ పార్టీ నాయకులు మాత్రం సిండికేట్లుగా ఏర్పడి అడ్డగోలుగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు. వీరికి జిల్లాకు చెందిన ఓ మంత్రి, పలువురు టీడీపీ ఎమ్మెల్యేల అండదండలు ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో గ్రామాల్లో ఒకటో రెండో బెల్టుషాపులు ఉండేవి. అయితే ప్రస్తుతం బెల్టుషాపులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించడంతో అధికారిక బెల్టుషాపులను తొలగించి బడ్డీ బంకుల్లో పప్పు, బెల్లం అమ్మినట్లుగా మద్యం విక్రయాలు జరుపుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిని నియంత్రించాల్సిన ఎక్సైజ్ అధికారులు ఏమీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో 80 శాతం మద్యం సిండికేట్లు టీడీపీ నేతలకు చెందినవి కావడంతో వాటి పరిధిలో బెల్టుషాపుల జోలికి గానీ, అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపుతున్న షాపుల జోలికిగానీ వెళ్ళాలంటే అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ దుకాణాల వద్దకు వెళ్ళి తనిఖీలు చేస్తుండగానే జిల్లా మంత్రో, లేదా అధికార పార్టీ ఎమ్మెల్యేనో వెంటనే ఫోన్లో లైనులోకి వస్తున్నారు. దీంతో ఏమీ చేయలేక వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజల పక్షాన నిలబడి పోరాడాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలే మద్యం సిండి‘కేటు’గాళ్లకు అండదండలు అందిస్తుండటం శోచనీయమని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో అసలు మద్యం దుకాణాలు, బెల్టుషాపుల జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిదనే అభిప్రాయానికి ఎక్సైజ్ అధికారులు వచ్చినట్లు తెలిసింది. అయితే సందట్లో సడేమియాలా కొందరు ఎక్సైజ్ అధికారులు మద్యం సిండికేట్ల వద్ద నెలవారీ మామూళ్లు తీసుకుంటూ చూసీచూడనట్లు మిన్నకుంటున్నారు. మండుతున్న మద్యం ధరలు.. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మద్యం షాపులు కేటాయించిన వారం రోజుల నుంచే ఎమ్మార్పీ కంటే ఒక్కో సీసాకు రూ.30 చొప్పున అధికంగా వసూలు చేస్తున్నారు. అదేమని ప్రశ్నించి ఆందోళనకు దిగితే వెంటనే కౌంటర్లో ఉన్న మంచి బ్రాండ్లను పక్కకు తప్పించి ఎవరికి తెలియని బ్రాండ్లను పెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో ఎంత డబ్బు ఎక్కువైనా పర్వాలేదు, ఫలానా బ్రాండ్ ఇవ్వండని అడిగేలా చేస్తూ మందుబాబుల వీక్నెస్ను క్యాష్ చేసుకుంటున్నారు. దీనికి తోడు ఉదయం 5 గంటలకే మద్యం దుకాణాలు తెరుచుకుంటున్నాయి. అర్ధరాత్రి ఒంటిగంట వరకు నిర్వగ్నంగా కొనసాగుతూనే ఉన్నాయి. రాత్రి 9 గంటలు అయిందంటే రోడ్లపై ఉన్న తోపుడు బండ్లు, చిన్న చిన్న బడ్డీ దుకాణాలను సైతం మూసివేయించే పోలీసులు మద్యం దుకాణాలను మాత్రం తెల్లవారుజాము వరకు అనుమతిస్తుండటం చూస్తుంటే వీరికి ఏ స్థాయిలో మామూళ్ళు ముడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా బాధ్యతగల మంత్రులు, ఎమ్మెల్యేలు మద్యం సిండికేట్లకు వత్తాసు పలకకుండా ప్రజల పక్షాన పోరాటాలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
‘రియల్’ సిండి‘కేట్లు’
ఆస్తుల క్రయ విక్రయాల్లో బ్రోకర్ల హవా నకిలీ పట్టాలతో నయవంచన అగ్రిమెంట్ల ముసుగులో మారు వ్యాపారం భారీగా కమీషన్ల దందా గన్నవరం మండలం వెంకటనరసింహాపురం కేంద్రంగా నకిలీ పట్టాలు సృష్టించి ప్లాట్లు విక్రయించే ముఠాలు జనాన్ని మోసగించి దోచుకుంటున్నాయి. నగరానికి చెందిన రాఘవరావుకు ఓ నకిలీ పట్టా చూపించి సిండికేట్లు రూ.ఐదు లక్షలు దండుకున్నారు. తీరా అక్కడికి వెళితే వేరే వ్యక్తి ఆ స్థలం తనదని అదే నంబర్‌తో పట్టా చూపించాడు. దీనిపై ఇద్దరూ గొడవ పడుతుండగా సిండికేట్లు జారుకున్నారు. నూజివీడులో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు సిండికేట్‌గా తయారై భూముల క్రయ విక్రయాలను శాసిస్తున్నారు. వీరి బారినపడి అనేకమంది అమాయకులు నానా అగచాట్లు పడుతున్నారు. ఎవరైనా స్థలం, ఇల్లు విక్రయిస్తామని చెప్పగానే వారికి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంటు రాయించుకుంటున్నారు. 60 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటామన్న షరతు విధించి అదే ఆస్తిని మారు బేరానికి లక్షలాది రూపాయలకు విక్రయిస్తున్నారు. విజయవాడ : ఇన్నాళ్లు ఇసుక, మద్యం వ్యాపారాలకే పరిమితమైన సిండికేట్లు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి జొరబడ్డారు. వీరంతా ప్రాంతాలకు హద్దులు ఏర్పాటుచేసుకుని రియల్ మోసాలకు తెగబడుతున్నారు. పైసా పెట్టుబడి లేకుండా కేవలం మాయ మాటలు చెప్పి ఇరు వర్గాలకు ఒప్పందం కుదిర్చి లక్షలాది రూపాయల కమీషన్లు నొక్కేస్తున్నారు. రాజధాని ఏర్పాటు వార్తలతో నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో భూములు, స్థలాల ధరలు చుక్కలనంటాయి. ఈ నేపథ్యంలో పలువురు రియల్ బ్రోకర్ల అవతారం ఎత్తారు. మధ్యతరగతి నుంచి ఉన్నత స్థాయి వరకు అన్నివర్గాల్లోనూ ఈ తరహా సిండికేట్లు ఏర్పడినట్లు సమాచారం. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రవేశించి కొనుగోళ్లు, అమ్మకాల్లో మధ్యవర్తులుగా ఉండి కమీషన్లు పొందుతున్నారు. గ్రామాలు, పట్టణాలు దాటి సిండికేట్లుగా మారి సెల్ఫోన్లలో ఒప్పందం కుదిర్చి కొనుగోలుదారులు, అమ్మకందారులను కలవనీయకుండా దళారీ వ్యవస్థను నడుపుతున్నారు. లక్షకు రూ.రెండు వేలు చొప్పున కమీషన్ పొందుతున్నారు. కమీషన్ సొమ్ము కోసం బ్రోకర్లు అరాచకాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రధానంగా విజయవాడ, కంకిపాడు, గన్నవరం, నున్న, నూజివీడు, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో ఈ తరహా కార్యకలాపాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. అమ్మేవారి కోసం గాలం ఎవరైనా తమ ఆస్తిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందగానే కొనుగోలుదారులకంటే ముందుగా బ్రోకర్లే ప్రత్యక్షమవుతున్నారని జనం వాపోతున్నారు. సిండికేట్ సభ్యులు ఇరువర్గాల తరఫున మాట్లాడుతూ రేటును కూడా వారే పెంచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులరీత్యా ఆస్తి అమ్ముకోదలచినవారు సిండికేట్లను సంప్రదిస్తే.. ఆ ఆస్తి రేటుపై ఎక్కువ మొత్తం ధర నిర్ణయించి, ఆపై మొత్తం తమదేనని చెబుతున్నారు. దీనికి ఆస్తి యజమాని అంగీకరించకపోతే, సంబంధిత ఆస్తి గొడవల్లో ఉందని, దస్తావేజులు లేవని, వాస్తు బాగోలేదని ప్రచారం చేస్తూ అమ్మకందారులను ఇబ్బందులపాల్జేస్తున్నారు. అమాయకులు, మార్కెట్ ధర తెలియని వారు, కుటుంబ ఇబ్బందులు ఉన్నవారు, అప్పులపాలైన వారు వీరి బారినపడి నష్టపోతున్నారు. పెచ్చుమీరిన ‘టోకెన్’ వ్యాపారం స్థిరాస్తి వ్యాపారంలో దళారులు ఇటీవలి కాలంలో టోకెన్ వ్యాపారాన్ని ప్రవేశపెట్టారు. టోకెన్ అంటే బయానా (కొంత అడ్వాన్స్) సొమ్ము చెల్లించి సంబంధిత ఆస్తిని అగ్రిమెంటు చేసుకుంటున్నారు. ఉదాహరణకు కోటి రూపాయల ఆస్తిని ఐదుగురు సిండికేట్ సభ్యులు రూ.25 లక్షలు బయానా ఇచ్చి అగ్రిమెంటుపై చేజిక్కించుకుంటున్నారు. 60 రోజుల షరతుతో మిగిలిన డబ్బు ఇస్తామని ఆస్తి అమ్మే వ్యక్తి చెప్పి గడువులోపే మారుబేరానికి ఆస్తిని విక్రయించేసి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు చేతిలో చిల్లిగవ్వలేకపోయినా ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చి అమాయకులను మోసగిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అగ్రిమెంటు చేసుకుని పూర్తి సొమ్ము ఇవ్వకుండా, ఆస్తిని వేరొకరికి అమ్మనీయకుండా కొందరు నానా యాగీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్తి యజమానులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేక, రాజకీయ పెద్దలను ఆశ్రయించలేక సిండికేట్ల వలలో ఇరుక్కుంటున్నారు. కొందరైతే అయినకాడికి ఆస్తులు అమ్ముకుని పూర్తిగా నష్టపోతున్నారు. సిండికేట్లలో విభేదాలు ఏర్పడితే పరిష్కారానికి కూడా ఒక కమిటీని వారు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలాంటి మోసగాళ్లపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
‘కిక్కు’ లక్కు కొందరికే...!
లాటరీ తీసిన ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి 349 మందికి లెసైన్సుల కేటాయింపు ముగిసిన దుకాణాల కేటాయింపు జూలై 1 నుంచి కొత్త పాలసీ అమలు తమ్ముళ్ల కనుసైగలో సిండికేట్ల ఏర్పాటు చిత్తూరు (అర్బన్): మద్యం అదృష్టం కొందరినే వరించింది. మద్యం దుకాణాల నిర్వహణ కోసం శనివారం నిర్వహించిన లాటరీలో 349 మందికి లెసైన్సులు వచ్చాయి. అన్ని సజావుగా సాగడంతో జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. దుకాణాల కోసం చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన లాటరీ డిప్‌ను జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి ప్రారంభించారు. ఎక్సైజ్ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ డీవీఎన్.ప్రసాద్, తిరుపతి, చిత్తూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు శ్రీనివాసరావు, శేషారావు టెండర్ల ఖరారు విధానాన్ని పర్యవేక్షించారు. 2014-15 సంవత్సరానికి చిత్తూరు, తిరుపతి ఎక్సైజ్ జిల్లాలో 458 మద్యం దుకాణాల నిర్వహణ కోసం ఈ నెల 23న నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 2112 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రూ.25 వేలను ఎక్సైజ్ అధికారులకు చెల్లించాలనే నిబంధన ఉండడంతో ఒక్క దుకాణం కేటాయింపు జరగకుండానే రూ.5.20 కోట్ల ఆదాయం లభించింది. ఇక 2112 మంది దరఖాస్తులు వేసినప్పటికీ 349 మందినే అదృష్టం వరించింది. దీంతో మిగిలిన 1763 మందికి నిరాశ తప్పలేదు. ఎలాంటి కష్టం లేకుండా వీరి నుంచి ప్రభుత్వానికి రూ.4.40 కోట్ల ఆదాయం లభించడం విశేషం. సిండికేట్లలో టీడీపీ నేతలు మద్యం దుకాణాల టెండర్ల నిర్వహణ ప్రక్రియ పూర్తవడం తో జూలై 1 నుంచి 2015 జూన్ 30 వరకు జిల్లాలో కొత్త మద్యం పాలసీ అమల్లో ఉంటుంది. ఈ విధానంలో బాటిళ్లపై స్కాన్ అండ్ ట్రేస్ విధానం ఉండడంతో బెల్టు షాపుల్లో దొరికిన బాటిళ్ల ఆధారంగా దుకాణాల లెసైన్సులు రద్దు చేస్తామని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. దీనికి తోడు గత ఏడాదితో పోలిస్తే ఈ సారి 10 శాతం వరకు లెసైన్సు ఫీజులు కూడా పెరిగాయి. ప్రభుత్వ విధివిధానాలు కచ్చితంగా అమలు చేస్తే దుకాణాలు దక్కించుకున్న వాళ్లకు ఒక్క రూపాయి లాభం రాకపోగా చేతిలో ఉన్న డబ్బును పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో దుకాణాలు కైవశం చేసుకున్న వ్యక్తులు సిండికేట్‌గా మారి ఎంఆర్పీకన్నా ఎక్కువకు విక్రయించాలని నిర్ణయించుకున్నారు. తిరుపతి, చిత్తూరు, పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన నేతలు మద్యం సిండికేట్ నాయకులుగా ఏర్పాటై దుకాణాల నిర్వాహకులను తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. వచ్చింది మా ప్రభుత్వమే మీకొచ్చిన ఢోకా ఏమీలేదంటూ టెండరుదార్లకు భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యం వ్యాపారం ఏ రీతిన సాగుతుందో వేచి చూడాల్సి ఉంది. త్వరలో మరో నోటిఫికేషన్ మరోవైపు జిల్లాలోని 109 మద్యం దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా పడకపోవడంతో త్వరలోనే వీటికి నోటిఫికేషన్ జారీ కానుంది. పెరిగిన లెసైన్సు ఫీజుల వల్లే ఈ దుకాణాల కు దరఖాస్తులు పడలేదు. రెండోసారి ఇచ్చే నోటిఫికేషన్లో ఎవరూ ముందుకు రాకపోతే దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక జిల్లాలోని బార్ల నిర్వాహకులు సైతం ఈ నెల 30లోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. -
సిండికేట్ కిక్
పాత సిండికేట్లలో కొత్త వ్యాపారులు టీడీపీ నేతల దన్ను వన్‌టౌన్ మద్యం దుకాణానికి అత్యధికంగా 75 మంది పోటీ ఎకాయెకిన జిల్లా దుకాణాల కేటాయింపు విశాఖ శివార్లలోని వాటికి ఒక్కో దరఖాస్తే విశాఖపట్నం: మద్యం సిండికేట్లు మళ్లీ బరితెగించాయి. టీడీపీ నేతల దన్ను చూసుకుని భారీ ఎత్తున దుకాణాలను చేజిక్కించుకున్నారు. నగర శివార్లలోని 70 దుకాణాలను సొంతం చేసుకున్నారు. ఆ దుకాణాలకు పోటీ లేకుండా చూసుకున్నారు. అందుకు ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారుల సహకారం తీసుకున్నారు. నగర శివారుల్లోనే(5 కిలోమీటర్లలోపు ప్రాంతాలు) నిత్యం మద్యం అమ్మకాలు గణనీయంగా ఉంటాయి. అక్కడి దుకాణాలపై పెద్దగా అధికారుల కన్నుపడదు. సెలవు రోజుల్లోనూ దర్జాగా దుకాణం వెనుక నుంచి అమ్మకాలు యథేచ్ఛగా సాగించొచ్చు. అందుకే ఆ దుకాణాలకు వింత కాకపోతే ఒక్క దరఖాస్తు కూడా అదనంగా రాకపోవడమేమిటి అని అనుకుంటున్నారు. ఆ దుకాణాలను చేజిక్కించుకునేందుకు సిండికేట్లంతా పెద్ద ప్రణాళిక వేశారు. ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారుల సహకారంతో కొత్త మద్యం విధానంలోనూ తమదే పై చేయి అని నిరూపించుకున్నారు. ఆదాయమొచ్చే అన్నీ దుకాణాలను చేజిక్కించుకునేందుకు అడ్డదారులన్నీ తొక్కారు. కొత్తవారిని భయపెట్టారు. ఎంతోకొంత వాటా ఇస్తామంటూ మభ్యపెట్టారు. అంతగా ఆదాయం రాదనుకున్న 108 దుకాణాలకు దరఖాస్తు లేకుండా చేశారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారు. వేగంగా సాగిన కేటాయింపు విశాఖ జిల్లాలో కొత్త మద్యం దుకాణాల కేటాయింపు శరవేగంగా సాగింది. కైలాసపురం డాక్ లేబర్ బోర్డ్ (డీఎల్బీ) కల్యాణ మండపంలో శనివారం సాయంత్రం లాటరీ ద్వారా దుకాణాలను జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఎంపిక చేశారు. నాలుగు దుకాణాల కేటాయింపును ఉత్సాహంగా లాటరీ ద్వారా ఎంపిక చేసిన జేసీ అనంతరం లాటరీ తీసే బాధ్యతను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎం. సత్యనారాయణకు అప్పగించారు. ఆయన అందరినీ భాగస్వాములను చేస్తూ ఉత్సాహంగా దుకాణాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేశారు. జిల్లాలో 406 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తే అందులో 298 దుకాణాలకు 3312 మంది దరఖాస్తులు సమర్పించారు. విశాఖ అర్బన్ ప్రాంతాల్లోని 55 దుకాణాలకు 1212 మంది పోటీపడ్డారు. 108 దుకాణాలకు ఒక్క దరఖాస్తు రాకపోగా జిల్లావ్యాప్తంగా ఉన్న 70 దుకాణాలకు ఒక్కొక్క దరఖాస్తు చొప్పున 70 దరఖాస్తులు అందాయి. వీరందరికీ దుకాణాలు దక్కే చాన్స్లున్నాయి. విశాఖ అర్బన్‌లోని 56వ వార్డులో మూడు దుకాణాలకు దరఖాస్తులు కోరగా అక్కడి నుంచి రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. నగరంలోని వన్‌టౌన్ ప్రాంతాల్లోని దుకాణాలకు గట్టిపోటీ ఎదురైంది. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న దుకాణానికి ఏకంగా 75 మంది పోటీపడ్డారు. జిల్లావ్యాప్తంగా ఉన్న దుకాణాలలో ఈ దుకాణానికే భారీ డిమాండ్ నెలకొంది. నగర శివార్ల దుకాణాలకు ఒక్కో దరఖాస్తే..! నగర శివారుల్లోని దుకాణాలకు ఒక్కొక్క దరఖాస్తులే వచ్చాయి. దీంతో దరఖాస్తు చేసిన వారికే దుకాణం సొంతం కానుంది. గాజువాక యూనిట్లో ఇలాంటి దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయి. అగనంపూడి, గాజువాక, చినగదిలి, పీఎం పాలెం, నరవ, కూర్మన్నపాలెం, ఆదిరెడ్డిపాలెం, వేపగుంట, కోటనరవ, వేములవలస, పిలకవానిపాలెం, పాత డెయిరీ ఫాం, రాపర్తిపాలెం వంటి చోట్ల ఒక్కొక్క దరఖాస్తే చేరింది. -
ఎక్సైజ్ దూకుడు
34 బెల్ట్ షాపులు సీజ్ వేళలు పాటించని 18 షాపులపై కేసులు 46 మందిపై బైండోవర్ కేసులు 15 చోట్ల కొత్త చెక్‌పోస్టులు విశాఖపట్నం, న్యూస్‌లైన్: ఎన్నికల వేళ ఎక్సైజ్ శాఖ దూకుడు పెంచింది. జిల్లాలోని గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో అక్రమంగా మద్యం నిల్వ చేసేందుకు రాజకీయ వర్గాలు వ్యూహాలు పన్నుతున్న నేపథ్యంలో ఈ దాడులకు ప్రాధాన్యత పెరిగింది. నేతల ముఖ్య అనుచరులు మద్యం నిల్వ చేసే పనుల్లో బిజీగా వుండడంతో జిల్లా యంత్రాగం ఎక్సై జ్ శాఖను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా ఒడిశా, చత్తీస్‌గఢ్ సరిహద్దుల నుంచి మద్యం, నాటుసారా గిరిజన తండాలకు రవాణా కాకుండా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీ బృందాలను, కొత్తగా నియామకమైన సిబ్బందిని మరో 15 చోట్ల చెక్‌పోస్టుల్లో నియమించింది. కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లను పల్లెలకు తరలించి అక్రమ మద్యం దుకాణాలపై సర్వే చేయిస్తున్నారు. అనధికారిక దుకాణాలు, సిండికేట్లు, బెల్ట్ షాపుల గుట్టును వీరితో అధికారులు సేకరిస్తున్నారని తెలిసింది. ఇటీవల 124 అక్రమ సారా కేసులు నమోదు చేసి 59 మందిని అరెస్టు చేశారు. పాడేరు, చింతపల్లి, అరుకు, నర్సీపట్నం వంటి ప్రాంతాలతో బాటు విశాఖ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోనూ దాడులను ముమ్మరం చేశారు. అక్రమంగా తరలిస్తున్న 1720 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. 18 మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేసి రూ. లక్షల్లో అపరాధ రుసుం వసూలు చేశారు. అక్రమంగా మద్యాన్ని తరలించేవారు, గొడౌన్లలో భద్రపరిచేవారు, అక్రమంగా మద్యం అమ్మే అవకాశం ఉందనుకున్న పాత ముద్దాయిలందరిపై బైండోవర్ కేసులు నమోదు చేసేందుకు కూడా ఎక్సైజ్ శాఖ వెనకాడడం లేదు. పొరుగు రాష్ట్రాల నుంచి నకిలీ మద్యం తీసుకొచ్చి ఎన్నికల వేళ సొమ్ము చేసుకుంటారన్న అనుమానంతో 46 మందిపై బైండోవర్ కేసులు పెట్టారు. గ్రామాల్లో అనధికారిక మద్యం దుకాణాలుగా చెలామణి అవుతోన్న 34 బెల్ట్ దుకాణాలపై దాడులు చేసి వాటిని సీజ్ చేయడంతో బాటు వాటిని నిర్వహించే 34 మంది చోటా నేతలను అరెస్టు చేశామని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ టి. శ్రీనివాసరావు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా నిఘా బృందాలను నియమించామని దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. మద్యం దుకాణాలన్నీ ఉదయం 11 గంటలకు తెరచి రాత్రి 10 గంటలకల్లా మూసివేయకపోతే కేసులు బుక్ చేస్తామని తెలిపారు. -
మామూలిచ్చి అమ్ముకోండి!
మంత్రిగారి బంధువుబంపర్ ఆఫర్ =ఇండెంట్ చెల్లించి పది శాతం ఎక్కువకు అమ్ముకోండి =మంత్రిగారి పేరిట వసూళ్లు కప్పం కట్టండి.. ఎక్కువకు అమ్ముకోండి.. ఇదీ జిల్లాలోని వైన్‌షాపులు, బార్ యజమానులకు మంత్రి గారి బంధువు నుంచి వచ్చిన బంపర్ ఆఫర్. ఇప్పటికే అందరికీ మామూళ్లు ఇస్తూనే వస్తున్నామని, ఇప్పుడు అమాత్యుడి పేరుతో అడిగితే తమకు ఇబ్బందేనని వాపోవడం నిర్వాహకుల వంతయింది.. ఇంతకీ ఆ కథేంటో తెలుసుకుందాం... సాక్షి, విజయవాడ : జిల్లాలోని వైన్‌షాపులు, బార్ యజమానులకు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. అదేంటంటే రూ.40 వేలు కప్పం కడితే ఎంఆర్పీ కన్నా పది శాతం ఎక్కువకు అమ్ముకున్నా పట్టించుకోం అని. అయితే ఈ హామీ అబ్కారీ శాఖ నుంచి కాకుండా ఆ శాఖ అదనపు బాధ్యతలు చూస్తున్న మంత్రిగారి దగ్గర బంధువు నుంచి రావడం విశేషం. ఈ అంశంలో మంత్రి పుంగవుడు ఎక్కడా నేరుగా జోక్యం చేసుకోలేదు. ఆయనకు దగ్గర బంధువుగా సిండికేట్లతో పాటు అసోసియేషన్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న నేత ఈ ప్రతిపాదన ముందుకు తెచ్చినట్లు సమాచారం. త్వరలో ఎన్నికలు వస్తున్నాయి... అవసరాల కోసం మనం ఇవ్వడం మంచిదని ఆయన ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. వాన్‌పిక్ కేసులో అప్పటి అబ్కారీ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టు కావడంతో మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథికి అదనపు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అసోసియేషన్ ముందుకు ప్రతిపాదన... జిల్లాలో 360 వరకూ వైన్‌షాపులు, బార్లు ఉన్నాయి. ఒక్కో షాపు నుంచి రూ.40 వేలు మంత్రికి నజరానాగా ఇవ్వాలని అసోసియేషన్ ముందుకు ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదన తెచ్చింది కూడా మంత్రి బంధువే. ఈ బంధువే ఈ అసోసియేషన్‌లో కీలక బాధ్యత వహిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు జిల్లాలోని వైన్‌షాపుల నుంచి పెద్దగా అభ్యంతరాలు రాకపోయినా, బార్ యజమానులు వ్యతిరేకిస్తున్నారు. వారికి లూజ్ అమ్మకాలు, ఎంఆర్పీ కన్నా ఎక్కువకు అమ్మకూడదన్న నిబంధనలు ఉన్నాయి. అదే బార్ల విషయానికి వస్తే రేటు ఎంతకి అమ్మాలన్న నిబంధనలు లేవు. దీంతో వారు ఈ ఆఫర్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 60 నుంచి 70 షాపుల వారు సదరు నేతకు రూ.40 వేల చొప్పున చెల్లించారు. డబ్బులు చెల్లించిన వారి షాపులపై కూడా ఇటీవల ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. ఒకసారి కేసు నమోదై షాపు మూతపడితే మళ్లీ తెరుచుకోవడానికి కనీసం నెలరోజులు పడుతుంది. రాజధాని స్థాయి నుంచి మళ్లీ అనుమతులు రావాల్సి ఉండటం, ఇక్కడి నుంచి ప్రతిపాదనలు పంపడానికి చాలా సమయం పట్టడం దీనికి కారణం. దీనివల్ల ఆయా షాపులకు ఆరు నుంచి ఏడు లక్షల రూపాయల వరకు వ్యాపారంలో నష్టం వస్తోంది. షాపుల యజమానుల షరతు... డబ్బులు చెల్లించిన తర్వాత కూడా కేసులు రాస్తుండటంతో వారు అడ్డం తిరిగినట్లు సమాచారం. తమ జోలికి రాకుండా ఉంటేనే డబ్బులు ఇస్తామని మిగిలిన షాపుల వారు మొండికేస్తున్నట్లు సమాచారం. కనీసం నెలన్నర రోజులైనా ఎటువంటి దాడులూ జరగవని హామీ ఉంటే అడిగిన మొత్తం ఇస్తామని వైన్‌షాపుల యజమానులు షరతు పెట్టారు. దీంతో నాలుగురోజుల క్రితం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ విషయంలో కోపంగా ఉన్న సభ్యులు సమావేశానికి హాజరుకాలేదు. కేవ లం ఇద్దరు ముగ్గురు మాత్రమే రావడంతో మిగిలిన వారితో సదరు నేత ఫోన్లో సంప్రదింపులకు తెరతీసినట్లు తెలిసింది. ఇప్పటికే విజయవాడలోని బార్ యజమానులు చాలామంది అందరికీ మామూళ్లు ఇస్తూనే వస్తున్నామని, కొత్తగా మళ్లీ మంత్రిగారి పేరుతో అడిగితే తాము ఇచ్చేదిలేదని కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. అసలు మంత్రిగారికి ఇస్తారో లేదో కూడా తమకు అనుమానాలున్నాయని, అందుకే ఇవ్వడానికి ఇష్టపడటం లేదని అధికార పార్టీకి చెందిన బార్ యజమాని ‘సాక్షి’ వద్ద వ్యాఖ్యానించారు.