‘రియల్’ సిండి‘కేట్లు’ | 'Real' syndicates' | Sakshi
Sakshi News home page

‘రియల్’ సిండి‘కేట్లు’

Published Sat, Aug 2 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM

‘రియల్’ సిండి‘కేట్లు’

‘రియల్’ సిండి‘కేట్లు’

  •   ఆస్తుల క్రయ విక్రయాల్లో బ్రోకర్ల హవా
  •   నకిలీ పట్టాలతో నయవంచన
  •   అగ్రిమెంట్ల ముసుగులో మారు వ్యాపారం
  •   భారీగా కమీషన్ల దందా
  • గన్నవరం మండలం వెంకటనరసింహాపురం కేంద్రంగా నకిలీ పట్టాలు సృష్టించి ప్లాట్లు విక్రయించే ముఠాలు జనాన్ని మోసగించి దోచుకుంటున్నాయి. నగరానికి చెందిన రాఘవరావుకు ఓ నకిలీ పట్టా చూపించి సిండికేట్లు రూ.ఐదు లక్షలు దండుకున్నారు. తీరా అక్కడికి వెళితే  వేరే వ్యక్తి ఆ స్థలం తనదని అదే నంబర్‌తో పట్టా చూపించాడు. దీనిపై  ఇద్దరూ గొడవ పడుతుండగా సిండికేట్లు జారుకున్నారు.
     
    నూజివీడులో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు సిండికేట్‌గా తయారై భూముల క్రయ విక్రయాలను శాసిస్తున్నారు. వీరి బారినపడి అనేకమంది అమాయకులు నానా అగచాట్లు పడుతున్నారు. ఎవరైనా స్థలం, ఇల్లు విక్రయిస్తామని చెప్పగానే వారికి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంటు రాయించుకుంటున్నారు. 60 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటామన్న షరతు విధించి అదే ఆస్తిని మారు బేరానికి లక్షలాది రూపాయలకు విక్రయిస్తున్నారు.
     
    విజయవాడ : ఇన్నాళ్లు ఇసుక, మద్యం వ్యాపారాలకే పరిమితమైన సిండికేట్లు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి జొరబడ్డారు. వీరంతా ప్రాంతాలకు హద్దులు ఏర్పాటుచేసుకుని రియల్ మోసాలకు తెగబడుతున్నారు. పైసా పెట్టుబడి లేకుండా కేవలం మాయ మాటలు చెప్పి ఇరు వర్గాలకు ఒప్పందం కుదిర్చి లక్షలాది రూపాయల కమీషన్లు నొక్కేస్తున్నారు. రాజధాని ఏర్పాటు వార్తలతో నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో  భూములు, స్థలాల  ధరలు చుక్కలనంటాయి.

    ఈ నేపథ్యంలో పలువురు రియల్ బ్రోకర్ల అవతారం ఎత్తారు. మధ్యతరగతి నుంచి ఉన్నత స్థాయి వరకు అన్నివర్గాల్లోనూ ఈ తరహా సిండికేట్లు ఏర్పడినట్లు సమాచారం. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రవేశించి కొనుగోళ్లు, అమ్మకాల్లో మధ్యవర్తులుగా ఉండి కమీషన్లు పొందుతున్నారు. గ్రామాలు, పట్టణాలు దాటి సిండికేట్లుగా మారి సెల్‌ఫోన్లలో ఒప్పందం కుదిర్చి కొనుగోలుదారులు, అమ్మకందారులను కలవనీయకుండా దళారీ వ్యవస్థను నడుపుతున్నారు.

    లక్షకు రూ.రెండు వేలు చొప్పున కమీషన్ పొందుతున్నారు. కమీషన్ సొమ్ము కోసం బ్రోకర్లు అరాచకాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రధానంగా విజయవాడ, కంకిపాడు, గన్నవరం, నున్న, నూజివీడు, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, జగ్గయ్యపేట తదితర  ప్రాంతాల్లో ఈ తరహా కార్యకలాపాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు.
     
    అమ్మేవారి కోసం గాలం
     
    ఎవరైనా తమ ఆస్తిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందగానే కొనుగోలుదారులకంటే ముందుగా బ్రోకర్లే ప్రత్యక్షమవుతున్నారని జనం వాపోతున్నారు. సిండికేట్ సభ్యులు ఇరువర్గాల తరఫున మాట్లాడుతూ రేటును కూడా వారే పెంచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులరీత్యా ఆస్తి అమ్ముకోదలచినవారు సిండికేట్లను సంప్రదిస్తే.. ఆ ఆస్తి రేటుపై ఎక్కువ మొత్తం ధర నిర్ణయించి, ఆపై మొత్తం తమదేనని చెబుతున్నారు.

    దీనికి ఆస్తి యజమాని అంగీకరించకపోతే, సంబంధిత ఆస్తి గొడవల్లో ఉందని, దస్తావేజులు లేవని, వాస్తు బాగోలేదని ప్రచారం చేస్తూ అమ్మకందారులను ఇబ్బందులపాల్జేస్తున్నారు. అమాయకులు, మార్కెట్ ధర తెలియని వారు, కుటుంబ ఇబ్బందులు ఉన్నవారు, అప్పులపాలైన వారు వీరి బారినపడి నష్టపోతున్నారు.
     
    పెచ్చుమీరిన ‘టోకెన్’ వ్యాపారం
     
    స్థిరాస్తి వ్యాపారంలో దళారులు ఇటీవలి కాలంలో టోకెన్ వ్యాపారాన్ని ప్రవేశపెట్టారు. టోకెన్ అంటే బయానా  (కొంత అడ్వాన్స్) సొమ్ము చెల్లించి సంబంధిత ఆస్తిని అగ్రిమెంటు చేసుకుంటున్నారు. ఉదాహరణకు కోటి రూపాయల ఆస్తిని ఐదుగురు సిండికేట్ సభ్యులు రూ.25 లక్షలు బయానా ఇచ్చి అగ్రిమెంటుపై చేజిక్కించుకుంటున్నారు. 60 రోజుల షరతుతో మిగిలిన డబ్బు ఇస్తామని ఆస్తి అమ్మే వ్యక్తి చెప్పి గడువులోపే మారుబేరానికి ఆస్తిని విక్రయించేసి సొమ్ము చేసుకుంటున్నారు.

    మరికొందరు చేతిలో చిల్లిగవ్వలేకపోయినా ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చి అమాయకులను మోసగిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అగ్రిమెంటు చేసుకుని పూర్తి సొమ్ము ఇవ్వకుండా, ఆస్తిని వేరొకరికి అమ్మనీయకుండా కొందరు నానా యాగీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్తి యజమానులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేక, రాజకీయ పెద్దలను ఆశ్రయించలేక సిండికేట్ల వలలో ఇరుక్కుంటున్నారు. కొందరైతే అయినకాడికి ఆస్తులు అమ్ముకుని  పూర్తిగా నష్టపోతున్నారు. సిండికేట్లలో విభేదాలు ఏర్పడితే పరిష్కారానికి కూడా ఒక కమిటీని వారు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలాంటి మోసగాళ్లపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement