‘కిక్కు’ లక్కు కొందరికే...! | 'Suppose' appropriate grammars ... | Sakshi
Sakshi News home page

‘కిక్కు’ లక్కు కొందరికే...!

Published Sun, Jun 29 2014 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM

‘కిక్కు’ లక్కు కొందరికే...!

‘కిక్కు’ లక్కు కొందరికే...!

  •     లాటరీ తీసిన ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి
  •      349 మందికి లెసైన్సుల కేటాయింపు
  •      ముగిసిన దుకాణాల కేటాయింపు
  •      జూలై 1 నుంచి కొత్త పాలసీ అమలు
  •      తమ్ముళ్ల కనుసైగలో సిండికేట్ల ఏర్పాటు
  • చిత్తూరు (అర్బన్): మద్యం అదృష్టం కొందరినే వరించింది. మద్యం దుకాణాల నిర్వహణ కోసం శనివారం నిర్వహించిన లాటరీలో 349 మందికి లెసైన్సులు వచ్చాయి. అన్ని సజావుగా సాగడంతో జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. దుకాణాల కోసం చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన లాటరీ డిప్‌ను జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి ప్రారంభించారు. ఎక్సైజ్ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ డీవీఎన్.ప్రసాద్, తిరుపతి, చిత్తూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు శ్రీనివాసరావు, శేషారావు టెండర్ల ఖరారు విధానాన్ని పర్యవేక్షించారు.
     
    2014-15 సంవత్సరానికి చిత్తూరు, తిరుపతి ఎక్సైజ్ జిల్లాలో 458 మద్యం దుకాణాల నిర్వహణ కోసం ఈ నెల 23న నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 2112 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రూ.25 వేలను ఎక్సైజ్ అధికారులకు చెల్లించాలనే నిబంధన ఉండడంతో ఒక్క దుకాణం కేటాయింపు జరగకుండానే రూ.5.20 కోట్ల ఆదాయం లభించింది. ఇక 2112 మంది దరఖాస్తులు వేసినప్పటికీ 349 మందినే అదృష్టం వరించింది. దీంతో మిగిలిన 1763 మందికి నిరాశ తప్పలేదు. ఎలాంటి కష్టం లేకుండా వీరి నుంచి ప్రభుత్వానికి రూ.4.40 కోట్ల ఆదాయం లభించడం విశేషం.
     
    సిండికేట్లలో టీడీపీ నేతలు

    మద్యం దుకాణాల టెండర్ల నిర్వహణ ప్రక్రియ పూర్తవడం తో జూలై 1 నుంచి 2015 జూన్ 30 వరకు జిల్లాలో కొత్త మద్యం పాలసీ అమల్లో ఉంటుంది. ఈ విధానంలో బాటిళ్లపై స్కాన్ అండ్ ట్రేస్ విధానం ఉండడంతో బెల్టు షాపుల్లో దొరికిన బాటిళ్ల ఆధారంగా దుకాణాల లెసైన్సులు రద్దు చేస్తామని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. దీనికి తోడు గత ఏడాదితో పోలిస్తే ఈ సారి 10 శాతం వరకు లెసైన్సు ఫీజులు కూడా పెరిగాయి. ప్రభుత్వ విధివిధానాలు కచ్చితంగా అమలు చేస్తే దుకాణాలు దక్కించుకున్న వాళ్లకు ఒక్క రూపాయి లాభం రాకపోగా చేతిలో ఉన్న డబ్బును పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది.

    దీంతో దుకాణాలు కైవశం చేసుకున్న వ్యక్తులు సిండికేట్‌గా మారి ఎంఆర్‌పీకన్నా ఎక్కువకు విక్రయించాలని నిర్ణయించుకున్నారు. తిరుపతి, చిత్తూరు, పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన నేతలు మద్యం సిండికేట్ నాయకులుగా ఏర్పాటై దుకాణాల నిర్వాహకులను తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. వచ్చింది మా ప్రభుత్వమే మీకొచ్చిన ఢోకా ఏమీలేదంటూ టెండరుదార్లకు భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యం వ్యాపారం ఏ రీతిన సాగుతుందో వేచి చూడాల్సి ఉంది.
     
    త్వరలో మరో నోటిఫికేషన్
     
    మరోవైపు జిల్లాలోని 109 మద్యం దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా పడకపోవడంతో త్వరలోనే వీటికి నోటిఫికేషన్ జారీ కానుంది. పెరిగిన లెసైన్సు ఫీజుల వల్లే ఈ దుకాణాల కు దరఖాస్తులు పడలేదు. రెండోసారి ఇచ్చే నోటిఫికేషన్‌లో ఎవరూ ముందుకు రాకపోతే దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక జిల్లాలోని బార్ల నిర్వాహకులు సైతం ఈ నెల 30లోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement