సిండి‘కేటు’గాళ్లు
సాక్షి, గుంటూరు: చెప్పేదొకటి... చేసేది మరొకటి.. ఇది జిల్లాలో టీడీపీ నేతల తీరు. ఒకపక్క టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు బెల్టుషాపులను రద్దు చేస్తున్నట్లుగా ప్రమాణ స్వీకారం సమయంలోనే ఫైల్‌పై సంతకం చేయగా జిల్లాలో ఆ పార్టీ నాయకులు మాత్రం సిండికేట్లుగా ఏర్పడి అడ్డగోలుగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు. వీరికి జిల్లాకు చెందిన ఓ మంత్రి, పలువురు టీడీపీ ఎమ్మెల్యేల అండదండలు ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో గ్రామాల్లో ఒకటో రెండో బెల్టుషాపులు ఉండేవి. అయితే ప్రస్తుతం బెల్టుషాపులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించడంతో అధికారిక బెల్టుషాపులను తొలగించి బడ్డీ బంకుల్లో పప్పు, బెల్లం అమ్మినట్లుగా మద్యం విక్రయాలు జరుపుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిని నియంత్రించాల్సిన ఎక్సైజ్ అధికారులు ఏమీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు.
జిల్లాలో 80 శాతం మద్యం సిండికేట్లు టీడీపీ నేతలకు చెందినవి కావడంతో వాటి పరిధిలో బెల్టుషాపుల జోలికి గానీ, అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపుతున్న షాపుల జోలికిగానీ వెళ్ళాలంటే అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ దుకాణాల వద్దకు వెళ్ళి తనిఖీలు చేస్తుండగానే జిల్లా మంత్రో, లేదా అధికార పార్టీ ఎమ్మెల్యేనో వెంటనే ఫోన్‌లో లైనులోకి వస్తున్నారు. దీంతో ఏమీ చేయలేక వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజల పక్షాన నిలబడి పోరాడాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలే మద్యం సిండి‘కేటు’గాళ్లకు అండదండలు అందిస్తుండటం శోచనీయమని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో అసలు మద్యం దుకాణాలు, బెల్టుషాపుల జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిదనే అభిప్రాయానికి ఎక్సైజ్ అధికారులు వచ్చినట్లు తెలిసింది. అయితే సందట్లో సడేమియాలా కొందరు ఎక్సైజ్ అధికారులు మద్యం సిండికేట్ల వద్ద నెలవారీ మామూళ్లు తీసుకుంటూ చూసీచూడనట్లు మిన్నకుంటున్నారు.
మండుతున్న మద్యం ధరలు.. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మద్యం షాపులు కేటాయించిన వారం రోజుల నుంచే ఎమ్మార్పీ కంటే ఒక్కో సీసాకు రూ.30 చొప్పున అధికంగా వసూలు చేస్తున్నారు. అదేమని ప్రశ్నించి ఆందోళనకు దిగితే వెంటనే కౌంటర్‌లో ఉన్న మంచి బ్రాండ్‌లను పక్కకు తప్పించి ఎవరికి తెలియని బ్రాండ్‌లను పెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో ఎంత డబ్బు ఎక్కువైనా పర్వాలేదు, ఫలానా బ్రాండ్ ఇవ్వండని అడిగేలా చేస్తూ మందుబాబుల వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. దీనికి తోడు ఉదయం 5 గంటలకే మద్యం దుకాణాలు తెరుచుకుంటున్నాయి.
అర్ధరాత్రి ఒంటిగంట వరకు నిర్వగ్నంగా కొనసాగుతూనే ఉన్నాయి. రాత్రి 9 గంటలు అయిందంటే రోడ్లపై ఉన్న తోపుడు బండ్లు, చిన్న చిన్న బడ్డీ దుకాణాలను సైతం మూసివేయించే పోలీసులు మద్యం దుకాణాలను మాత్రం తెల్లవారుజాము వరకు అనుమతిస్తుండటం చూస్తుంటే వీరికి ఏ స్థాయిలో మామూళ్ళు ముడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా బాధ్యతగల మంత్రులు, ఎమ్మెల్యేలు మద్యం సిండికేట్లకు వత్తాసు పలకకుండా ప్రజల పక్షాన పోరాటాలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.